ᐅసంబరాల లోగిలి... హోలీ
కాలానుగుణంగా, రుతు సంబంధమైన పండుగలు, పర్వదినాలు మనకు ఎన్నో ఉన్నాయి. ప్రకృతిలో సంభవించే మార్పులకు సూచకంగా వ్యక్తుల్లో చైతన్యం వెల్లివిరుస్తుంది. మనసు సంతోషంతో పరవశిస్తుంది. ప్రకృతి కొత్త పెళ్లికూతురిలా ముస్తాబై మురిపించే వసంత రుతువు వచ్చిందంటే, ఎక్కడా లేని నవ్యానందం ప్రకటితమవుతుంది. వసంత శోభ నేపథ్యంగా మనం నిర్వహించుకునే పండుగల్లో హోలీ ప్రత్యేకతే వేరు. మాఘమాస కృష్ణ పంచమి అయిన వసంత పంచమి పర్వదినం నాటికి ప్రకృతిలో వసంత రుతువు లక్షణాలు అంకురిస్తాయి. ఫాల్గుణ పౌర్ణమి అయిన హోలీ నాటికి ఆ వసంత సౌందర్యం ప్రస్ఫుటమవుతుంది. నవనవలాడే లేత చిగుళ్లు రాగిరంగునుంచి ఆకుపచ్చ రంగులోకి మారే తరుణంలో, పలు వర్ణాల్లో పుష్పాలు గుబాళించే సందర్భంలో ఈ రంగుల పండుగ అడుగిడుతుంది. ప్రకృతిలో పొటమరించే వర్ణశోభకు సూచనగా వ్యక్తులు ఆనందాతిరేకాలతో రంగుల్ని చిలకరించుకునే సంప్రదాయం ఏర్పడిందంటారు. హోలీ పండుగకే వసంతోత్సవమనీ, మదనోత్సవమనీ పేర్లున్నాయి. పంటలు చేతికందే సమయాన రైతులందరి హోహోకారాలే 'హోలీ' అయిందంటారు. ఈ హోలీ పండుగకు సంబంధించి ఎన్నో కథనాలు ఉన్నాయి. అవన్నీ ఈ పర్వదిన విశిష్టతను ప్రతిఫలింపజేస్తాయి.
శిశు హంతకి అయిన రాక్షసి హోలిక వినాశనానికి సూచికగా హోలీ ఏర్పడిందంటారు. హోలికతో ముడివడిన మరో కథనమూ ఉంది. అగ్ని కూడా కాల్చలేని మహా శక్తిమంతురాలైన హోలిక హిరణ్య కశ్యపుని సోదరి. హరినామస్మరణ వీడని తన కుమారుడు ప్రహ్లాదుణ్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని హోలికను అగ్నిప్రవేశం చేయమని హిరణ్య కశ్యపుడు ఆదేశిస్తాడు. హరి భక్తుని స్పర్శ వల్ల హోలిక శక్తి సన్నగిల్లి, ఆమె అగ్నికి ఆహుతవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా అగ్నినుంచి బయటపడతాడు. హోలీతో ప్రధానంగా ముడివడిన గాథ కామదహనం. శివ తపస్సును భగ్నంచేసిన మన్మథుణ్ని ఈశ్వరుడు ఫాల్గుణ పౌర్ణమి రోజే భస్మం చేశాడంటారు. మధుర మీనాక్షీ దేవి తపస్సు చేసి సుందరేశ్వరస్వామిని ఫాల్గుణ పౌర్ణమినాడే వివాహం చేసుకొందని చెబుతారు. దక్షిణాది దేవాలయాల్లో ఆనాడు కల్యాణ వ్రతాన్ని నిర్వహిస్తారు. కుమార సంభవానికి నాందిపలికిన కామదహనం ఘట్టానికి ప్రతిబింబంగా జనావాస కూడళ్లలో పెద్ద మంట పెడతారు. ఈ మంట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రజలు తమ ఉల్లాసాన్ని ప్రకటిస్తారు. అక్కడి బూడిదను ప్రసాదంగా స్వీకరిస్తారు. దుష్టగ్రహ పీడల్ని ఆ విభూతి నివారిస్తుందని విశ్వసిస్తారు.
ఫాల్గుణ పౌర్ణమికి కాస్త అటూ ఇటూగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి సంబంధమైన పండుగల్ని నిర్వహించుకునే సంప్రదాయం ఉంది. ఏ ప్రాంతంలో ఈ తరహా పండుగ జరుపుకొన్నా, ఆయా వ్యక్తుల మధ్య సమైక్యతకు, సౌహార్దతకు ఇది చిహ్నం. ఎందరో విదేశీ యాత్రికుల కథనాలు, ఎన్నో శాసనాలు హోలీ పర్వ విశిష్టతను వెల్లడిస్తున్నాయి. మనిషి తన మనసులోని దుష్ట ఆలోచనల్నీ, చెడు సంకల్పాల్నీ దహింపజేసుకుని, ఉత్సాహంగా అందరితో కలిసి మెలిసి సహజీవనాన్ని సాగించాలని రంగుల కేళి హోలీ సందేశమిస్తుంది.
- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్