ᐅసూర్యజయంతి
చిక్కని చీకట్లను చీల్చివేస్తూ వేనవేల కిరణాలతో వెలుగులు చిమ్మే సూర్యుడు మనకు ఆరాధ్యదైవం. భూమి వికాసంలో, జీవపరిణామ ప్రస్థానంలో సూర్యుడికి ప్రముఖ స్థానం ఉంది. జ్యోతిషంలో అగ్రస్థానం ఇచ్చారు. ఉదయం బ్రహ్మగా, మధ్యాహ్నం మహేశ్వరునిగా, సాయంకాలం విష్ణుస్వరూపంగా భాసిస్తుంటాడని చెబుతారు. సృష్టికి కారణభూతుడైన పరాత్పరుని కోటి కోటి సూర్యుల తేజస్సును మర్త్య నేత్రాలు చూడలేవు. ప్రత్యక్షదైవంగా, సూర్యనారాయణుడిగా మెరిసే తేజోమండలం మాత్రం మానవ నేత్రాలకు దృగ్గోచరం కావడం మానవాళి చేసుకున్న పుణ్యం. ఈ దృశ్యమాన దైవాన్ని యుగయుగాలుగా సర్వమానవాళి నమ్మి ఆరాధిస్తున్నది. ఈ 'సూర్యజయంతి' పండుగను రథసప్తమిగా మాఘమాసం శుద్ధ సప్తమినాడు విశేషంగా జరుపుకొంటారు. సప్తాశ్వాలను పూన్చిన సువర్ణరథంపై సూర్యుడు ప్రయాణిస్తుంటాడు. సూర్యుడు కదలటం లేదని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని ఆధునికులు భావిస్తారు. పాలపుంత కేంద్రంగా కోటానుకోట్ల నక్షత్రాలతోపాటు సూర్యుడు కూడా పరిభ్రమిస్తున్నాడు. ఏడు గుర్రాలు కాంతికిరణంలోని సప్తవర్ణాలను సూచిస్తాయి. సూర్యోదయకాలంలో గ్రహనక్షత్రాల కూటమి రథం ఆకృతిలో ఉంటుంది. అందువల్ల దీనికి 'రథసప్తమి' అని పేరు వచ్చింది. అంతేకాని, సూర్యుని రథం వల్ల ఈ పండుగకు ఆ పేరు రాలేదని పండితోత్తములు విశదం చేశారు.
సూర్యుడు వెలుగు ప్రదాత మాత్రమే కాదు. ఆరోగ్య ప్రదాత కూడా. సూర్య నమస్కారాలు సుప్రభాతంలో సూర్యుడికి శుభప్రాంజలి, కాంతి నీరాజనం. స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, వివిధ ఫల పుష్పాలను సేకరించి, గొబ్బిళ్లను పిడకలుగా మారుస్తారు. తులసిమొక్క పక్కనే సూర్యునికి అభిముఖంగా నిప్పు రాజేసుకుని ఆవుపాలతో పొంగలి తయారుచేస్తారు. తులసికి ఎదురుగా సూర్య ప్రతిమను ప్రతిష్ఠించి, స్వామివారికి షోడశోపచారాలతో పూజాదికాలు నిర్వర్తించి, చిక్కుడాకులపై పొంగలి ప్రసాదం ఉంచి సూర్యభగవానుడికి నివేదన చేస్తారు. సూర్యుడికి ఇష్టమైన జిల్లేడు ఆకుల మధ్య రంధ్రంచేసి రేగుపండ్లను ఉంచి శిరస్సులపైన, భుజాలపైన, హృదయంపైన ఉంచుకుని శిరస్నానం చేసి, జిల్లేడు ఆకు రంధ్రంగుండా సూర్య దర్శనం చేసుకుని పునీతులవుతారు.
సూర్యారాధనవల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్న ప్రాచీనుల ప్రగాఢ విశ్వాసం వారసత్వ సంపదగా మనకు లభించింది. ఉదయించే భాను కిరణాలు ఆరోగ్యం ఇస్తాయని నవీనులు సైతం నమ్ముతున్నారు.
పాండవులు వనవాస కాలంలో సూర్యోపాసన వల్లనే అక్షయ పాత్రను, సత్రాజిత్తు శ్యమంతకమణిని సూర్యునినుంచి దివ్యవరాలుగా పొందారని పురాణాలు చెబుతున్నాయి.
మహామంత్ర శక్తిప్రపూరితమైన 'సూర్యగాయత్రి'ని విశ్వామిత్రుడు సూర్యునికే అంకితమిచ్చాడు. విశ్వామిత్రుని గాయత్రిమంత్రం జగత్‌ప్రసిద్ధం. రథసప్తమి పుణ్యకాలంలో సూర్యగాయత్రిని అందరూ విధిగా స్మరిస్తారు.
మన సంస్కృతీ సంప్రదాయాల్లో, కట్టుబాట్లలోని ఆంతర్యం బాహ్యదృష్టికి అంత సులభంగా అందదు. ధర్మార్థ కామమోక్షాల బాటలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు, రథసప్తమి వంటి పండుగలు ఏర్పరచి, చక్కని ఆదర్శవంతమైన జీవిత గమనాన్ని సూచిస్తూ సమాజ హితవుకోసం ఆధ్యాత్మిక జ్ఞానసంపదతో పాటు ఇటు మంచి సంస్కారాన్ని సౌజన్యాన్ని పెంపొందించడానికి ప్రాచీనులు మార్గదర్శకులయ్యారు. విశ్వజనీన శాంతి సౌమనస్యాలకు వారే మార్గ నిర్దేశకులు.
- కె.యజ్ఞన్న