ᐅప్రేమతత్వం
ప్రాణికి సహజ లక్షణం ప్రేమ. చెట్టుకు మొగ్గతొడిగే చేష్ట, మొగ్గకు వికసించే గుణం, విరికి వలపుల వెదజల్లు విద్య, వలపునకు గుబుల్కొనే అలవాటు ఉన్నాయని; ఇదంతా ప్రేమ కొరకేనని అంటాడు భావకవి. పువ్వులు ఎందుకు సౌరభాన్ని చిమ్ముతున్నాయో, చందమామ ఎందుకు వెన్నెల వెదజల్లుతున్నాడో, నీరు ఎందుకు పారుతోందో, గాలి ఎందుకు వీస్తోందో ఆ కారణం చేతనే నేను నిన్ను ప్రేమిస్తున్నానంటాడు ఇంకోకవి. ప్రకృతిలో సంయోగ గుణమన్నది ప్రధానమని పరస్పర ప్రేమే దీని మూలసూత్రమని స్పష్టమవుతోంది. ఆత్మను ఆత్మను కలిపి కుట్టు దారమే ప్రేమ అని కూడా కవుల భావన. కవులు తమ సౌందర్యతృష్ణకు తగినట్లుగా ఊహాప్రేయసులను సృష్టించుకొని చిత్తశాంతిని పొందారు.
ఇంద్రియ తర్పణంచేసే సౌందర్యం నుంచి ఆత్మిక సౌందర్యం వైపు, ఆత్మిక సౌందర్యం నుంచి ఆధ్యాత్మిక సౌందర్యంవైపు నడిపించే మహత్తరశక్తి ప్రేమ అంటాడు ప్లేటో. ఉత్తమ ప్రేమికుడు తాను ప్రేమించిన స్త్రీలతో మానసికంగా తాదాత్మ్యం చెందాలని, కేవలం శారీరక సంపర్కమైనది ప్రేమకాదని విజ్ఞుల భావన.
లోకంలో ప్రేమకు, కామానికి మధ్య గల సూక్ష్మభేదం అవగాహన లేక కామతృష్ణనే ప్రేమగా భ్రమించడం కద్దు. ప్రేమ ఒక పవిత్రమైన భావన. ఒక మధురమైన మానసిక అవస్థ. అశ్వఘోష మహాకవి రచించిన సంస్కృతకావ్యం, 'సౌందరనందం'లో గౌతమబుద్ధుడికి, అతని సవతి సోదరుడైన నందుడికి మధ్య జరిగిన 'ధర్మ సంవాదం'లో ప్రేమతత్త్వం చక్కగా ఆవిష్కృతమైంది. నందుడు బుద్ధుడితో ఇష్టసఖులు లేని జీవితం మోడువారిన చెట్టులాంటిదని, ప్రణయమాధుర్యాన్ని అనుభవించిన బతుకు ఒక్కరోజు లభించినా చాలునంటాడు. ప్రేమలేమికంటె దారిద్య్రం మరొకటి లేదంటాడు. బుద్ధుడు నందుడికి చెట్టుకొమ్మల మీద ఫలాలు తింటూ పరస్పరం కోరికతో రెండు శరీరాలను ఒక్కటిగా చేసి కామప్రీతితో తిరుగుతున్న కోతుల జంటను చూపించి వారి సౌఖ్యానికి ఏం పేరు పెడతావని ప్రశ్నిస్తాడు. కామవికారం కొంచెమైనా కలగకపోతే ప్రేమకు ఆధారమైన ప్రేయసి కోసం ఎందుకు విలపిస్తారని అడుగుతాడు. కడుపుతీపి, పితృభక్తి, కాంతమీది వలపు, ఇష్టసఖులపట్ల మమకారం 'నా' అనే విత్తనంలో పుట్టి నాశనమవుతాయి. మమకార రహితమైన ప్రేమ నిత్యమై నిలుస్తుంది. ప్రేమ వ్యక్తినిష్ఠంగాక సామాజిక నిష్ఠంకావాలని బుద్ధుడు చెబుతాడు.
మానవుడికున్న ఒక అపురూపమైన విలువ ప్రేమ. నిస్వార్థంగా ఇతరులను ప్రేమించడం ఎప్పుడు కుదురుతుంది? ఉదాత్తమైన సంస్కారం అలవడినప్పుడు. ప్రపంచమంతా భగవన్మయంగా కనబడినప్పుడు.
ప్రకృతి ప్రేమ స్వరూపిణి. వృక్షాలు ప్రేమతో ఫలాలనిస్తున్నాయి. నదులు ప్రవహిస్తూ తియ్యని నీటిని ఇస్తున్నాయి. మేఘాలు వర్షాన్ని కురిపిస్తూ పంటలు పండిస్తున్నాయి. పరహితబుద్ధిలో ప్రేమ ఉంది.
పరమాత్మ ప్రేమ స్వరూపుడు. ప్రేమకు, పరమాత్మకు భేదం లేదు. సర్వసమర్పణ భావం కలిగి లౌకిక స్వార్థగంధం కొంచెమైనా లేని ప్రేమ ఒక్క భగవానుడి ఎడలనే సంభవం. విషయాభిముఖంగా పారుతున్న తనలోని ప్రేమవాహినిని జీవుడు ఈశ్వరాభిముఖంగా మరల్చాలి. స్వచ్ఛమైన ప్రేమ గుణరహితమైనది. దానికి పరమాత్ముడే పరమప్రియుడు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు