ᐅపరహిత వ్రతం



పరహిత వ్రతం 

లోకంలో మూడు రకాల మనుషులుంటారు. ఈ జీవితం పరుల మేలుకోసమేననుకునేవారు మొదటిరకం. జీవితం పరుల కోసమూ, తన కోసమూ అనుకునేవారు రెండోరకం. జీవితం తనది, తన కోసమేననుకునేవారు మూడోరకం. వీరిలో మొదటి కోవకు చెందినవారే ఉత్తములు. యోగులు, మునులు, పౌరాణికులు, బుధులు- అంతా ఆ శ్రేణికి చెందినవారే. వారు లోకకల్యాణమే మహోన్నతాశయంగా భావించి తమ జీవిత సర్వస్వం జ్ఞాన సముపార్జనకు, జ్ఞాన వితరణకే అంకితం చేసిన మహానుభావులు. కనుకనే నేడు మన భారత జాతి పావనమైన ఆధ్యాత్మిక దిశవైపు దూసుకుపోతోంది.
ఎంతటి ఆధ్యాత్మికానందానుభూతిలో రసప్లావితులవుతున్నా మానవుడు నిరంతరం జ్ఞాపకముంచుకుని అనుసరించదగినది ఒకే ఒక్క వ్రతం. అదే పరహితవ్రతం. అంటే- ఇతరులకు ఉపకారం చేయడమే నిరంతర దీక్షగాబూని వర్తిల్లడం.

నిజానికి పరోపకారమనే శబ్దం చాలా తేలికగా కనిపించినా, వినిపించినా ఆ పదంలోని శక్తి, మహిమ వర్ణనాతీతం. తెల్లవారి మేల్కొన్నప్పటి నుంచీ మన దినచర్యలను, సంభాషణలను, ప్రవర్తనలను ఏమైనా పరిశీలించుకుంటున్నామా? మనం ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇదంతా ఎవరికోసమనే ప్రశ్నలు వేసుకొంటే వస్తున్న సమాధానం ఒకటే- 'నా కోసం నా కుటుంబం కోసం!'. ఎంత స్వార్థం! ఎంత హేయం! ఈ సమాధానంతో సంతృప్తిపడుతూ శ్లేష్మంలోని ఈగలా సంపారలంపటంలో కొట్టుమిట్టాడుతూ నిరర్థకంగా జీవితం వెళ్లబుచ్చడమేనా?

భగవంతుడు ప్రసాదించిన ఈ జీవన వరప్రసాదం పదిమందికీ అందాలి. పదిమంది మన మాటవల్ల మన చర్య వల్ల ఆనందపడాలి, సుఖపడాలి. బదులుగా వారేమిస్తారు. మనకేం చేస్తారన్న భావనకే మనసులో చోటివ్వకూడదు. హితమన్నా ఉపకారమన్నా అదే. ఉపకారికి ఉపకారంతోపాటు అపకారికి కూడా ఉపకారం చెయ్యమనే చెబుతున్నాయి మన ధర్మశాస్త్రాలు. అంతటి విశాల దృక్పథాన్ని మానవుడు అలవరచుకున్ననాడు మానవజాతిలో హింసకు, దౌర్జన్యానికి అశాంతికీ తావే ఉండదు. పొరుగువారికి తోడ్పటంలో సొంత లాభం కొంతలో కొంతైనా మానుకుంటే మునిగిపోయే కొంపలేముంటాయి? ఒక్క మాటసాయమో, ఒక్క పనిసాయమో చేస్తే ఎదుటి వ్యక్తి ముఖంలో ఎంతటి ఆనందం, సంతృప్తీ తొణికిసలాడతాయో- అది చూస్తే మన జన్మ ధన్యమనిపించదూ! ఇలాగే- ఇంకా, ఇంకా సాటివాడికి సాయం చేయాలనిపించదూ! అందులో ఎంత తృప్తి, ఎంత ఆనందం! ఆ ఆనందమే మన ఆరోగ్యాన్ని పెంచుతుంది.

తొంభై సంవత్సరాల ఓ పండు వృద్ధుడు ఓ మామిడి మొక్కను నాటుతుంటే చూసిన ఓ పిల్లవాడు- 'తాతా! ఈ మామిడి మొక్క పెద్దదై పండ్లు ఇస్తే తినొచ్చని ఆశతో నాటుతున్నావా?' అని అడిగితే తాత అన్నాడట- 'మా తాత ముత్తాతలు వేసిన మొక్కలు వృక్షాలై ఫలాలనిస్తే తృప్తిగా ఆరగించాను కదా. అలాగే- ఈ మొక్కలు నాకోసం కాదు నాయనా, నా తరవాతి తరాలకోసం!' అన్నాడట. అటువంటి ఉపకార భావం మనిషి నరనరానా జీర్ణించుకుపోవాలి. ఇతరులకు సాయపడే తత్వమే లేకపోతే మనం దేని నుంచైనా, ఎవరి నుంచైనా ఏ రకంగా మేలుపొందగలం?

ఎంత డబ్బున్నా ఆ డబ్బుతో కూడా కొనలేనివెన్నో ఉన్నాయి. అది గమనించాలి మనం. మూడు వేళ్లతో దానం చేస్తే అయిదు వేళ్లతో తినగలం. పది వేళ్లతో నమస్కరిస్తే పదుల వేలు సంపాదించుకోగలం. అయితే మనం ఎంత సంపాదించామన్నది కాదు, ఎలా సంపాదించామనేది ముఖ్యం! ఎంత దాచామన్నది కాదు ముఖ్యం, ఎంత వితరణ చేశామన్నది ముఖ్యం. ఎంతసేపూ 'వాడు నాకేం చేశాడని నేను చెయ్యాలి?' అని ప్రశ్నించుకోవడం మహా మూర్ఖత్వం. మనం చెయ్యడమే ప్రధానం.

ఎదుటివాడు కోరకపోయినా, ఆశించకపోయినా తోచిన సలహా మంచిదైతే మనకు మనం చెప్పడంలో తప్పులేదు. ఉపకారం చేయడం నేరం కాదు. 'మంచి చెయ్యకపోయినా, చెడు మాత్రం చెయ్యకు' అంటారు కొందరు. తనంతట తానుగా ఉపకారం చేయాలన్న మనసున్నవాడు సహజంగానే ఇతరులు చేసే మేలుకు సర్వదా కృతజ్ఞుడై ఉంటాడు. ఇదొక ఉత్తమమైన సంస్కారం. భవ్య జీవనసారం. నిజానికి పరహిత దీక్షపరుడెప్పుడూ ఈ ప్రకృతికే కృతజ్ఞుడై ఉంటాడు. ప్రతి వస్తువునుంచీ ఉపకారం పొందుతూనే ఉంటాడు కనుక!

నిజమైన ఉపకారి తాను ఇతరులకు చేసిన మేలును బహిరంగంగా ప్రకటించుకోడు. కీర్తి కోసమో, సత్కారం కోసమో, బిరుదు కోసమో తాపత్రయపడడు. 'మాఫలేషు కదాచన' అన్న గీతావాక్యాన్ని ఎన్నటికీ విస్మరించడు. వ్యక్తిత్వ పరిపక్వతకిదే తార్కాణం. పరహితవ్రత దీక్షాపరులకు అందే సుఖశాంతులు అందుకే అనుభవైక వేద్యాలు, ఆత్మ-పరమాత్మలకు నిత్యనైవేద్యాలు!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి