ᐅజవాబులు అక్కర్లేని ప్రశ్నలు



జవాబులు అక్కర్లేని ప్రశ్నలు 


ఒకవ్యక్తి పర్వత చరియపై నడిచివెడుతుండగా కాలుజారింది. అలా కొండ శిఖరంపైనుంచి దొర్లుకుంటూ పడిపోతుండగా సానువు పైనుంచి ముందుకు వంగిన చెట్టు కొమ్మొకటి బయటకి చొచ్చుకురావటం కనిపించింది. గబుక్కున దాని చివరనందిపుచ్చుకున్నాడు. దాని ఆధారంగా పైకెగబాకగల సామర్థ్యంలేక అలా ప్రాణాలుగ్గబట్టుకుని కొమ్మనుంచి వేలాడసాగాడు. సరిగ్గా అదే సమయంలో ఆ కొండ శిఖరంపై నిలబడిన గురువు కనిపించాడు. తననేం చేయమంటారని అతను గట్టిగా గురువును అడిగాడు. భౌతికంగా గురువు శిష్యుని చేరి రక్షించటానికికెక్కడా అవకాశం లేదు.
'చూడు నాయనా! నీ ఎడమ వైపున్న లోయంతా రాళ్లు రప్పలు ముళ్లతో నిండివుంది. నీ కుడివైపు పచ్చని పచ్చికతో నిండిన మైదానముంది. కుడివైపు వూగి అటువైపు పడిపోవటానికి ప్రయత్నించు. పడిపోవటం తప్పనప్పుడు చివరిక్షణాల్లో ఆహ్లాదకరమైన దృశ్యాల్ని కళ్ళారా చూడటం ఉత్తమం కదా!' అన్నాడు గురువు.

ఆయుర్వేదంలో ఆరోగ్యం చేకూర్చటానికి మర్దనా ఒక పద్ధతి. ఒక్కోసారి మర్దనా చేసేవాడు చేతులతో కాకుండా రోగి ఒంటిమీదకెక్కి కసపిస తొక్కుతాడు కూడ. అప్పుడు ఎముకలు విరిగిపోతాయేమోనన్నంత బాధగా ఉంటుంది. కాసేపు ఓర్చుకోగలిగితే, తరవాత శరీరానికి కలిగే ఉపశమనం వర్ణనాతీతం. అంటే, తరవాత లభించబోయే సుఖాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం కలిగే కష్టాన్ని భరించగలగాలి! తప్పని బాధల్ని భరించేందుకు సిద్ధంగా లేకపోవటం వల్లనే నేడనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడొకడు హస్త సాముద్రికం చూపించుకోవటానికి వెళ్ళాడు. తన ఆత్మహత్య ప్రయత్నం నిర్విఘ్నంగా సాగుతుందో లేదో చెప్పమన్నాడు. ఎందుకింత నిస్పృహగా మాట్లాడుతున్నావని ఆ హస్తసాముద్రికుడు అతన్నడిగాడు. 'నా జీవితంలో అంది వస్తాయనుకున్న అదృష్టాలన్నీ ఇలాగే చేజారిపోయాయి. కనీసం ఇదైనా ఆశిస్తున్నట్టు జరుగుతుందో లేదోనని!' అన్నాడటను. నిరాశావాదికి ఆత్మహత్యా సాఫల్యం ఒక అదృష్టంగా అనిపించటం ఎంత బాధాకరం!

మృత్యుముఖంలో ఉన్న ఒక స్త్రీని వైద్యంకోసం ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందని వైద్యులు తీసుకుపొమ్మన్నారు. ఆమె ఆఖరి ఘడియలు బంధుమిత్రుల్ని ఎంతో బాధించాయి. మనిషికి మరణం తప్పనప్పుడు ఇంత బాధాకరంగా ఎందుకు జీవితాన్ని ముగించాలని చాలామంది దేవుణ్ని నిందిస్తుంటారు. ఈ జగన్నాటకంలో మనమంతా దేవుని చేతిలో కీలుబొమ్మలమైతే ఆయన మన జీవితాలతో ఎందుకింత కఠినంగా ఆడుకోవాలి- అని నిస్పృహలో ప్రశ్నిస్తుంటారు కొందరు.

దీనికి బుద్ధ భగవానుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు. చీకటిలో ఒక బాణాన్ని వేస్తే అది ఎవరికో తగలవచ్చు. గాయపడ్డ మనిషి ఎవరు బాణం వేశారు, ఎందుకు వేశారని అడగవచ్చు. కాని, వీటికన్నాముందు చేయాల్సింది ఆ బాణాన్ని జాగ్రత్తగా తొలగించి ఆ గాయానికి కట్టుకట్టి రక్తస్రావాన్ని అరికట్టడం... అదే అతని ప్రాణాన్ని నిజంగా కాపాడగలిగేది. అందుకనే, దేనికైనా 'ఎందుకు?' అన్న ప్రశ్న వేయటం మానుకుని- ఏ విధంగా ఉపశమనం కలుగుతుందో చూడాలి. భూమిమీద పాపం నిండి పోవటం వల్లనే సునామీలు, భూకంపాలు, ప్రళయాలు వస్తున్నాయని పెదవి విరుస్తూ- ఎందుకూ కొరగాని వ్యాఖ్యానాలు చేయటంకన్నా... వాటివల్ల బాధితులైనవారికి ఉపశమనం కలిగించటానికి చేతనైన ప్రయత్నం మనం చేయాలి!

- తటవర్తి రామచంద్రరావు