ᐅదృష్టిని బట్టి సృష్టి
మానవ జీవితం సంసార సాగరంలో పయనించే ఓ పడవ. అలలు, తిమింగలాలు, తుపానులు... పయనం మొత్తం భయానకం, భీభత్సం. ఇలాంటి అనిశ్చిత పయనంలో పడవ గమ్యానికి చేరుతుందా, మనిషి ఒడ్డున పడతాడా? మానవ జీవితానికి రెండు రకాల గమ్యాలు. సాధారణ మానవుడు, పారమార్థిక పామరుడు వూహించే మరణం... ఒక గమ్యం. రెండోది- మహా అదృష్టవంతుడైన పారమార్థికతను ఆశించే పరమపదం. ఆధ్యాత్మిక స్పర్శ ఏమాత్రం లేని సాధారణ మానవుడి దృష్టిలో జీవితానికి ఉద్దేశం, చివరి అంకం, గమ్యం అంటూ ఉన్నది కేవలం మరణం మాత్రమే. అనివార్యమని తెలిసినా అనుక్షణం మరణానికి భయపడుతూ, ఉన్న కొద్ది వ్యవధిలోనే అంతా సొంతం చేసుకోవాలనే తాపత్రయంతో జన్మోద్దేశాన్ని గ్రహించక వృథా చేసుకునే నిర్భాగ్యుడు. నిజంగానే అతని జీవితం కల్లోలిత భవసాగరంలో ఓ ఓటిపడవ. నిలకడ లేక, కుదుపులకు వ్యధ చెందుతూ అనిశ్చిత, అశాంతిమయ జీవితం గడిపే ఈ అభాగ్యుడు, 'పెనం మీంచి పొయ్యిలోకి పడాలే' అనేంత భయవేదనతో మరణానికై చూస్తూ ఉంటాడు. అతని జన్మోద్దేశం, దానికి తగిన జీవన శైలి, గమ్యం అదే. అంతే. అయితే మరో అదృష్టవంతుడున్నాడు. క్షామసదృశమైన జీవితాన్ని క్షీరమయం చేసుకున్నవాడు, మరుభూమిని మల్లెతోటగా మలచుకున్నవాడు, భవసాగరాన్ని భవ్యసాగరంగా మార్చుకున్నవాడు. అతడే ఆధ్యాత్మికపరుడు. జీవితం అతనికి ఓ యజ్ఞం... మనోజ్ఞం! జీవితం అతనికి ఓ పాట... పూతోట! జీవితం అతనికి శ్రీకారం, ఎడతెగని ఓంకారం. ప్రతివ్యక్తిలో అతను చూసేది అవ్యక్తమైన అంతర్యామిని. అందుకే అతనికి ఎవరిని చూసినా భయం లేదు... చివరికి, మరణమన్నా! మరణం అతనికి ఓ మార్పు. ఆధ్యాత్మిక ప్రగతికై కొత్త వసతుల కూర్పు. ఈ జన్మలో చేసిన సాధనలకు భగవంతుడిచ్చిన మరిన్ని బహుమతుల ఓదార్పు. అతడు ఆశాజీవి. అతనిది శతకోటి జన్మల తదనంతరమైనా 'ఆయన' తన పాదపీఠానికి చేర్చుకుంటాడనే మధురమైన ఆశ. మన్నికైన ఆశ. అందుకే మరణం అతణ్ని బాధించదు. నిరాశపరచదు. అతనికి తెలుసు తనకు మరణం లేదని. తాను ఆత్మనని. ఆత్మ శాశ్వతమని. జన్మాంతరాల అతని ప్రయత్నమల్లా ఈ జీవాత్మను ఆ పరమాత్మలో లయం చేయాలని మాత్రమే. ఈ జన్మ పరంపరలు, మరణవేదనలు అతనికి భయాన్ని, విసుగును కలిగించవు. ఎందుకంటే జీవితాన్నొక వేడుకగా భావించినవాడతడు. మరణాన్నొక మార్పుగా స్వీకరించినవాడతడు. వేదనను సాధనగా మార్చుకున్నవాడతడు. అతని సంయమనం ముందు, అతని వైరాగ్యం ముందు, అతని ముముక్షత్వం ముందు సమస్త సంక్లిష్టతలు, సంవేదనలు సోదిలోకి కూడా లేకుండా, అతని ఛాయల వరకూ కూడా రాకుండా పొట్టులా కొట్టుకుపోతాయి.
ఏ మనిషికైనా జీవితం ఒకటే. ద్వంద్వాలు ఒకటే. అయితే స్వీకరించటంలోనే, అర్థం చేసుకునే విధానంలోనే సౌభాగ్య, దౌర్భాగ్యాలు మనకు దక్కుతాయి. జీవన సాఫల్యం చేజిక్కుతుంది.
- చక్కిలం విజయలక్ష్మి