ᐅవిజయరహస్యం



విజయరహస్యం 

కొందరు యోగులు, గురువుల జీవితాలను పరిశీలిస్తే వారి జీవనసరళిలో ఒక ప్రత్యేకత, తమ లక్ష్యసాధనలో వారు నిష్ఠగా అవలంబించిన నియమాల విశిష్టత మనకు గోచరిస్తాయి.
గాంధీజీ ఒకసారి శాంతినికేతన్‌ని సందర్శించారు. ఆయన గురుదేవ్‌తో అనేక విషయాలమీద చర్చించారు. మధ్యాహ్న భోజనానంతరం కాసేపు కునుకుతీయటం గాంధీజీకి అలవాటు. ఆయన్ని విశ్రాంతి మందిరానికి చేర్చటానికి వచ్చిన ఆశ్రమవాసులు తమదో విన్నపమన్నారు. అదేమిటో సందేహించక చెప్పమన్నారు గాంధీ.

'గురుదేవుల గురించి మాకు చాలా దిగులుగా ఉంది. ఆయన ఆరోగ్యం బాగుండటంలేదు. ఆయనకు తప్పక విశ్రాంతి కావాలని వైద్యులు చెబుతున్నారు. కాని, ఆయన మా మాటలు వినటం లేదు. భోజనమైన మరుక్షణంలోనే పనిలోకి దిగిపోతున్నారు. ఆయన శారీరక అస్వస్థత మాకు చాలా ఆందోళనగా ఉంటోంది' అన్నారు వాళ్ళు. గురుదేవ్‌ని తగినంత విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పమని తననే ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు గాంధీ. ఆయన సలహాను రవీంద్రులు తప్పక గౌరవిస్తారని తమ నమ్మకమన్నారు వారు.

కాసేపు నిద్రపోయాక బాపూజీ ఠాగూర్ దగ్గరకు వెళ్ళారు. గురుదేవ్ ఎంతో ఏకాగ్రచిత్తులై తన పనిలో మునిగిఉన్నారు. ఎవరో పక్కన నిలబడినట్లనిపించి ఠాగూర్ తలతిప్పి చూశారు. 'అప్పుడే మీరు విశ్రాంతి చాలించి వచ్చారేమిటి? మీ బసలో సౌకర్యంగా లేదా?' అని అడిగారు ఆ సౌజన్యమూర్తి.

'నా నిద్ర అయిపోయింది. మీరూ భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా! అది మీకెంతో అవసరం. మీ ఆరోగ్యం అంతగా బాగుండటంలేదని విన్నాను' అన్నారు గాంధీ అనునయంగా.

'అది నాకెలా వీలవుతుంది మహాత్మా! మధ్యాహ్నం నిద్రపోకూడదని నా పన్నెండో ఏటనే ఒక నియమం పెట్టుకున్నాను. ఇన్నేళ్లుగా నేనది తప్పలేదు. ఇంక నాకెన్నేళ్లు మిగిలాయని- ఇప్పుడా నియమాన్ని వదలిపెట్టను!' అన్నారు రవీంద్రుడు.

ఇంతవరకు తనదో నియమబద్ధమైన జీవితమని మహాత్ముని అభిప్రాయం. 67 ఏళ్లపాటు గురుదేవ్ ఎన్నడూ పగటిపూట నిద్రపోలేదు. ఎంత నిష్ఠ! గురుదేవ్ మాటలు ఆయన్ని కదలించివేశాయి. 'విశ్వకల్యాణానికి మీరు చేపట్టని ప్రక్రియ లేదు. మీ లక్ష్యసాధనలోని విజయరహస్యమేమిటో ఇప్పుడే నాకు తెలిసింది...' అన్నారు గాంధీ మహాత్ముడు.

కళాసాధనలోనే కాదు- రవీంద్రుడు చూపించిన నిజాయతీ, నిబద్ధత, ఏకాగ్రత ఉంటే... ఆధ్యాత్మిక సాధనలో కూడా ఎవరికైనా విజయం తథ్యం! చేసే పనిమీద ప్రేమ ఉండాలి. విశ్వకల్యాణం లక్ష్యం కావాలి. మన శక్తి ఏమిటో ఎంతటిదో తెలుసుకుంటే మనకు మార్గాలకు కొదవుండదు. గమ్యం సుగమం కావటంలో అపజయం తొంగిచూడదు.

- తటవర్తి రామచంద్రరావు