ᐅమానవత్వ పరిమళం



మానవత్వ పరిమళం 

మానవుడిగా పుట్టినందుకు కలిగి ఉండాల్సింది మానవత్వం. తోటివారి కష్టాలను, తన కష్టాలుగా ఎంచేది, తోటివారి ఆనందమే తన ఆనందంగా భావించేదే ఈ సుగుణం. మానవత్వం అస్సలు లేనివాడే దానవుడు. అతడే చరిత్ర హీనుడు. చరిత్రలో రెండురకాల వారిని చూస్తూంటాం. పదిమందికీ అన్నం పెట్టేవారిని, పదిమంది ప్రాణాలు నిలిపేవారిని. అలాగే పరులకు హాని తలపెట్టేవారిని, పరుల ప్రాణాలు తీసేవారిని. మానవత్వ సుగుణమున్నవారు పరసమృద్ధి కోరుకుంటాడు. సహజ పరిమళాలు వెదజల్లే గంధపు చెక్క ఎక్కడ ఉన్నా సువాసనలు వెదజల్లుతుంది. మానవత్వం కలిగినవాడు, పరిమళిస్తూనే స్నేహ సౌహార్ద్రత కలిగి ఉంటాడు. ఎలాంటి సమయంలోనూ మానవతను కోల్పోడు. ఈ శరీరం పరోపకారార్థమే అనే భావనతో ఉంటాడు. దధీచి తన వెన్నెముకను ఇంద్రుడికి వజ్రాయుధం కోసం ఇచ్చాడు. శిబి చక్రవర్తి పక్షి కోసం తన మాంసం కోసి ఇచ్చి ప్రాణం రక్షించాడు.
రోడ్డున వెళ్తుంటే ఎవరైనా ఎండ వేడిమి తాళలేక పడిపోతే గుమిగూడి చూసేవారే ఎక్కువ కానీ- తక్షణం సపర్యలు చేసేవారు, ప్రాణాపాయ స్థితినుంచి కాపాడేవారు మనలో ఎంతమంది ఉంటారు? అనుకోని దుర్ఘటన జరిగితే ఆదుకొనే వారెంతమంది ఉంటారు? ఆపన్నులకు ఆ క్షణంలో అండగా నిలవాలి. రక్తం దొరక్క ప్రాణంపోయే స్థితిలో ఉన్న రోగికి ప్రాణదానం చేయాలి. నీ దేహంలోని రక్తం మరొకరి ప్రాణాన్ని నిలుపగలిగినందుకు సంతోషించాలి.

నీరుకు నీవేమిచ్చావని నీ దాహం తీరుస్తుంది. చెట్లకు నీవేమిచ్చావని ఫలాలనందిస్తున్నాయి. సూర్యచంద్రులకు నీవేమిస్తున్నావని వెలుగులనిస్తున్నారు. నీవేమిస్తున్నావని గాలి నీ ప్రాణం నిలుపుతోంది... ప్రకృతిని పరిశీలిస్తే మానవత్వమే దైవత్వంలా బోధపడుతుంది.

దేవుడెక్కడో లేడు. ఎదుటివారి ఎదలోనే, నీ సాయంతో వారిలో కలిగే ఆనందంలోనే దైవం దర్శనమిస్తాడు. నీ స్తోత్రాలకు సైతం సంతోషించని దేవుడు ఎదుటివారి కష్టసుఖాల్లో నువ్వు పాలుపంచుకొన్నప్పుడే సంతోషిస్తాడు.

తోటివారి కష్టాలను తన కష్టాలుగా చూసినవాడు, తోటివారి సంతోషమే తనదిగా ఎంచినవాడే మానవుడు. ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు చూసినా ఎన్ని గుండాలు మునిగినా... పరోపకార పరిమళత్వం లేనివాళ్ల మానవ జన్మ నిస్సారమే అవుతుంది.

ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణమిది. సంపాదించినదేదీ మనతో తీసుకుపోలేం. అందుకే- ఉన్నదానిలోనే నలుగురికి సహాయం చేసే లక్షణాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు కలిగే ఆనందంలో నీకు దైవమే దర్శనమిస్తాడు. ఎదుటివారితో మనసారా మాట్లాడు! లోపల ఒకటి, బయట మరొకటి కాకుండా నిర్మలత్వంగా ఉండు! ప్రపంచమంతా ఆనందంగా ఉండాలనే కాంక్షతోనే చూడు. శక్తివంచన లేకుండా ఎదుటివారికి సహకరించు.

మదర్ థెరెసా తన బాల్యంలో పాఠశాలకు ఆలస్యంగా వెళ్లిందొకసారి. మాస్టారు కారణం అడిగారు. 'ఒక గుడ్డివాడు రోడ్డు దాటుతుంటే, అతని కష్టాన్ని చూడలేక అతనికి తోడుగా నిలిచి, రోడ్డు దాటించి వచ్చాను' అంది. పువ్వు పుట్టగానే పరిమళించడమంటే అదే. మానవతామూర్తులందరూ వారు తమ సుఖాలను కోరుకోరు. ఎదుటివారి కష్టాల్లో అండగా నిలిచి, వారికి ఆనందం కలిగిస్తారు. ఎదుటివారి సుఖదుఃఖాల్లో పాలుపంచుకొనేవాడే అసలైన మానవుడు. అతడే మానవత్వం పరిమళించే మానవతామూర్తి!

- డాక్టర్ మరింగంటి మధుబాబు