ᐅవసంత నవరాత్రులు





వసంత నవరాత్రులు 

ఏడాదిలో రెండు నవరాత్రులను తెలుగువారు జరుపుకొంటారు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆశ్వియుజమాసంలో శరన్నవరాత్రులు. చైత్రం తొలిమాసం. చైత్రంలో వసంతం వెల్లివిరుస్తుంది. వసంతం రుతువుల రాణి. వసంతం ప్రకృతి కాంతకు సీమంతం. వసంతం మధుమాసం, మాధవ మాసం. కోయిల కూజితాలు, పరవశించే తుమ్మెదల రాగాలు, పూలగుత్తులతో మురిసిపోయే మామిడి, వేప చెట్లు వసంతంలో మనల్ని ఆనందంలో ముంచెత్తుతాయి.
కాళిదాస మహాకవి చెట్లు పూలతో, సరస్సులు పద్మాలతో, స్త్రీలు కాముక భావనలతో ఉండగా వసంతం మనోహరంగా ఉంది అని వర్ణిస్తాడు. నన్నెచోడకవి కుమార సంభవంలో 'పొన్నలు పూచె' అనే పద్యంలో వసంతం రాగానే ఫలవృక్షాలన్నీ ఒకదానితో ఒకటి పోటీపడి పూచాయని వర్ణిస్తాడు. వసంతంలో హాయిగొలిపేది మలయమారుతం. వాయుదేవుడు మంచి గంధపు చెట్ల సువాసనే అన్నిచెట్లకు కలిగించాలని ఆ సుగంధాన్ని మోసుకొని ఆ చెట్లకు పట్టించాడంటాడు కృష్ణదేవరాయలు. వసంతంలో ఎర్రగా పూచి కనువిందు చేసేవి మోదుగు పూలు. ఆ ఎర్రని పూలతో రంగులు తయారుచేసి వసంతోత్సవ కాలంలో స్త్రీ పురుషులు జల్లుకునేవారు. వసంతం శత్రువుపై దండెత్తిన రాజుగా పెద్దన మనుచరిత్రలో అభివర్ణిస్తాడు. వసంతం రాగానే దేవకాంతలు హిందోళరాగంలో గానం చేశారట. ప్రణయ భావాలను వ్యక్తంచేసే హిందోళం రసజ్ఞుల హృదయాలకు పల్లకి వంటిది. ప్రకృతి అందాలతో పరవశించే చైత్రంలో మొదటి తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు. చైత్రశుద్ధ పాడ్యమి తెలుగువారి సంవత్సరాది. ప్రకృతి పండుగ. నేలంతా పులకరించి కొత్త ఇగుళ్లు, పూలతో కళకళలాడే పండుగ. మానవ జీవితం ఆరురుతువుల సమ్మేళనం. కొత్త ఆశలే వసంతం. భవిష్యత్తుపై ఆశలు పెంచి కొత్త జీవితానికి వూపిరులూదేది వసంతం.

చైత్రశుద్ధ తదియనాడు డోలాగౌరీవ్రతం ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి వూయలకట్టి అందులో గౌరిని ఉంచి వూగిస్తారు. దీన్నే సౌభాగ్య గౌరీవ్రతమనీ అంటారు. చైత్రశుద్ధ పంచమి కల్పాది. ఆరోజు చేసే దానాలు అక్షయఫలాలను అందిస్తాయంటారు. చైత్రశుద్ధ అష్టమి భవాని మాత ఆవిర్భవించిన రోజు. ఆరోజు ఎనిమిది అశోక పుష్పాలతో తయారుచేసిన రసాన్ని తాగే ఆచారాన్ని 'అశోక కలిక ప్రాశనం' అంటారు.

చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి. పునర్వసు నక్షత్రంతో కూడిన ఈ నవమినాడే విష్ణువు రాముడై కర్కాటక లగ్నంలో అవతరించాడని అగస్త్య సంహిత చెబుతోంది. నవమినాడు బాలరాముణ్ని తొట్టెలో వేసి జోలపాడటం ఉంది. నవమినాడే సీతారామ కల్యాణం కూడా జరిగిందనే నమ్మకంతో ఆరోజున తెలుగునాట సీతారామ కల్యాణం జరిపిస్తారు. నవమి నాటి పందిళ్ళలో పానకాలు వడపప్పులు విసనకర్రలు పంచడం, నవమినుంచి తొమ్మిది రోజులు ఉత్సవాలు జరపడం ఒకనాటి వేడుక.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు