ᐅవృద్ధాప్యమొక వరం
లోకంలో ముసలితనం అనేది మానవులందరికీ వస్తుంది. దానికి గొప్పవాళ్లు, సామాన్యులనే భేదం లేనేలేదు. రాజుకు, మంత్రికి, వైద్యునికి, సన్యాసికి... అందరికీ వస్తుంది. దాని స్వభావాన్ని గురించి ప్రాచీనులు ఎంతో గొప్పగా చెప్పారు. ఆరిపోయేముందు ఉజ్జ్వలంగా వెలిగే దీపంలా ముసలితనం మానవులపై ఒక్కసారిగా విరుచుకుపడుతుందని ఒక కవి అంటాడు. యౌవనంలో నల్లగా నిగనిగలాడిన తలవెంట్రుకలు ముసలితనంలో తెల్లబడిపోవడంతో రోషంతో మండిపడే మనిషి నోటిలోనుంచి దంతాలూ వెలుపలికి వస్తాయని చమత్కరిస్తాడు మరొక కవి. నోటిలో దంతాలు రాలిపడిపోతాయి. నోటిలోనుంచి మాట స్పష్టంగా రాదు. నడవడానికి శక్తి కొరవడుతుంది. ఇంద్రియాలలోనూ శక్తి అస్పష్టంగానే ఉంటుంది. కనుక ముసలితనం ఒక విధంగా మళ్లీ వచ్చిన బాల్యమే అంటాడు మరొక కవి.
ముసలితనం యముని దూత వంటిది. ముసలితనంలో చెవులు సరిగా వినబడవు కనుక, చెవి దగ్గరకు వచ్చి ఆ ముసలితనం- 'ఓ మనిషీ! ఇకనైనా నీవు పరస్త్రీలపై వ్యామోహాన్ని విడిచిపెట్టు, పరుల ద్రవ్యానికి ఆశపడకు, ఇతరులను వంచనతో మోసగించకు, సాధ్యమైనంతకాలం ఇతరులకు ఉపకారాన్ని చేస్తూ ఉండు, మృత్యువు నీ భుజస్కంధంపైనే కూర్చొని ఉంది' అని చెబుతున్నదని ఇంకొక కవి అంటాడు.
ఈ మాటలు వినడానికి చమత్కారంగా ఉన్నా- ఇవి నిజంగా నిత్యసత్యాలే.
బాల్యంలోవలె వృద్ధాప్యంలో చాపల్యాలు పెరుగుతాయి. పిల్లల్లో ఉండే స్వభావం ఆవిష్కృతం అవుతుంది. అన్నీ కావాలనిపిస్తుంది. అనుభవించే సామర్థ్యం ఉండదు. గతంలో చేసిన తప్పులన్నీ జ్ఞాపకానికి వస్తుంటాయి. మనసు పశ్చాత్తాపం చెందుతుంది. చేసిన పాపాలను కడిగివేసుకోవడానికి శక్తి సామర్థ్యాలుండవు. వారసులు ఈసడించుకొంటూ ఉంటారు. డబ్బును, సంపదలను లాగేసుకొంటారు. అశక్తులను చేస్తారు. ఎవరూ మాట వినరు. ఎప్పుడు మరణిస్తారా అని ఎదురు చూస్తుంటారు. అందువల్ల వృద్ధాప్యం మనిషికి ఒక విధంగా శాపమే.
అయితే, ఇంతటి ఘోరమైన ముసలితనాన్నీ వరంగా మార్చుకునే ఉపాయాలు, దారులు లేకపోలేదు. వాటిని అనుసరిస్తే శేషజీవితం అశేషానందామృతాన్ని పంచుతుంది. అలాంటి ఉపాయాల్లో శ్రేష్ఠమైంది మానసికానందం. ఇది ఎప్పుడూ మనిషికి స్వాధీనమై ఉంటుందేకాని, పరాధీనంగా ఎప్పుడూ ఉండదు. దీనికి కావలసింది సద్భావన. 'భావించే విషయం ఎలాంటిదైతే, ఫలితం అలాంటిదే అవుతుంది' అని పెద్దలు చెబుతారు కనుక- మొదట, మంచిని భావించే స్వభావాన్ని అలవరచుకోవాలి. తమకు సంప్రాప్తించిన ముసలితనం దేవుడు ఇచ్చిన ఒక వరమే అనుకోవాలి. ఆత్మను గురించి ఆలోచించడానికి జీవితంలో లభించిన అమూల్య సమయం ఇదేనని అనుకోవాలి. మిగిలిన మూడు దశల్లో ఏ కోశంలోనూ బతుకు ప్రశాంతంగా ఉండదు. బాల్యం ఆటపాటలతోనే అవిశ్రాంతం అవుతుంది. కౌమారం చదువు సంధ్యలకే అంకితమైపోతుంది. యౌవనం విషయవాంఛలకు అర్పితం అవుతుంది. ముసలితనం ఒక్కటే మానసిక విశ్రాంతతకు నెలవుగా మారుతుంది. కనుక ముసలితనం ఎంత గొప్పవరం!
వృద్ధాప్యాన్ని అమృతమయం చేసుకోవడానికి ఆధ్యాత్మికతను మించిన ఉపాయం మరొకటి లేదు. ఆధ్యాత్మికత అంటే బాహ్యపూజలు, ఆర్భాటాలు, ఆడంబరాలు కావు. మానసిక చింతనమే. ఏ చింతనం అయినా చింతను పెంచకూడదు, తగ్గించాలి. చింతను పెంచేది చింతనం కాదు, ఆరాటం అవుతుంది. ఆరాటాన్ని తగ్గించుకోవడానికే పోరాటం చేయాలికానీ, ఆరాటాన్ని పెంచుకోవడానికి కాదు. అందుకే వృద్ధాప్యంలో అన్ని బంధాలనూ తెంచుకోవాలని పెద్దలమాట. బంధాలను తెంచుకోవాలంటే మానసికంగా సన్యసించాలికానీ, భౌతికంగా కాదు. భౌతిక సన్యాసంవల్ల మానసిక శాంతి ఎప్పుడూ లభించదు. మానసిక సన్యాసమే నిజమైన సన్యాసం.
మృత్యువు సమీపిస్తున్నప్పుడు ఎంత శాస్త్ర పాండిత్యం ఉన్నా అది పనిచేయదు. దాన్ని జయించాలంటే ఆత్మను గురించి మానసిక చింతనం ఒక్కటే శరణ్యం అని శంకర భగవత్పాదులు పలికిన మాట అక్షరసత్యం.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ