ᐅబలోపాసన
అతను విద్యావంతుడే. మంచి చెడులను గ్రహించగల వివేకం కలిగినవాడే. అయినా మద్యానికి బానిసయ్యాడు. ఆరోగ్యం పాడుచేసుకోవడమే కాక ఆర్థికంగా చితికిపోయాడు. పైగా సమాజం భ్రష్టుడన్న ముద్రవేసింది.
కొడిగడుతున్న జీవితాన్ని చూసుకుని ఇలా అనుకున్నాడు. స్వయంకృతంవల్లే ఈ స్థితి దాపురించింది... ఈ మహమ్మారిని కోరి తలకెత్తుకున్నాను. ఎత్తుకున్నదాన్ని దించుకోలేనా! ఈ ఊబి నుంచి పైకిరాలేనా!... ఆలోచనలో పడ్డాడు. ఆ దశలో అతడికి ఓ మహావాక్యం సందేశంగా స్ఫూర్తిగా నిలిచింది.
'బలహీనతకు పరిష్కారం దాన్ని గురించి చింతించడంకాదు. బలాన్ని గురించి ఆలోచించడమే' క్రమంగా పరివర్తనకు శ్రీకారం చుట్టాడు. నియమబద్ధమైన జీవనాన్ని అలవరచుకున్నాడు. ప్రాణాయామం, యోగా సత్సంగాలకు హాజరు కావడం, సద్గ్రంథ పఠనంలాంటి వాటిపై దైనందిన జీవనరథాన్ని నడిపాడు. 'ఛీ' కొట్టిన సమాజమే భేష్ అన్నది. తేజోవంతుడయ్యాడు.
బలహీనతలు చెడు అలవాట్లకేసి నడిపిస్తాయి. వ్యసనాల బారిన పడేటట్లు చేస్తాయి. వివేకం హెచ్చరిస్తూనే ఉంటుంది. 'చేస్తున్నది తప్పు' అంటూ. అయినా అధిగమించలేని దౌర్భాగ్యమే జీవితాన్ని చీకటిమయం చేసే కోణం.
బలహీనతలతో వ్యసనాలపాలయ్యానే అంటూ కుంగిపోకుండా వాటిని అధిగమించే 'బలోపాసన' చేయడం శ్రేయోదాయకం.
అందుకే అన్నారు- చీకటిని తిడుతూ కూర్చోక చిరుదివ్వెను వెలిగించే ప్రయత్నం చేయడం వివేకవంతుల లక్షణం అని.
బలోపాసన అంటే- బీడుభూమిని వ్యవసాయక్షేత్రంగా ఉపయుక్తం చేసుకోవడమే. రాళ్ళు, రప్పలు, ముళ్లకంపలు తొలగించి, చదును చేసుకొని దుక్కిదున్ని, నీళ్ళుపెట్టి విత్తనం ఎదపెట్టి కాపుగా ఉంటాడు రైతు.
పంట చేతికి వచ్చేదాకా తెగుళ్ళు సోకకుండా జాగ్రత్త పడతాడు. ఇక ఆ భూమి సస్య శ్యామలంగా తయారవుతుంది. నిజానికి ఇదొక బ్రహ్మాండమైన ఉపాసనామార్గం. ఏకదీక్షగా శ్రమించే తత్వం. ఓ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని బీడువారిన నేలను రాజనాల పంటలను అందించే సుక్షేత్రంగా తయారుచేసుకోవడం.
మనిషి ధీరోదాత్తుడు. సామర్థ్యం, వివేచనాసంపత్తి ఉన్నవాడు. వెలుగును కప్పిపుచ్చే మబ్బులను తొలగించుకుంటే అజేయుడిగా, సమర్థుడిగా నిలుస్తాడు. తనలో ఇంతటి చైతన్యశక్తి ఉందన్న విషయం తెలుసుకోవడమే బలోపాసన. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ శక్తిహీనులు కారు.
ఇద్దరు మిత్రులు ఓ కారడవిలో నడిచివెళ్తున్నారు. ఒకతనికి విపరీతంగా దాహం వేయసాగింది. వెంటతెచ్చుకున్న 'సొరకాయ బుర్ర'లోని మంచినీళ్ళు ఎప్పుడో అయిపోయాయి. ఎక్కడా నీటితావు కనిపించడంలేదు. గొంతు పిడచకట్టుకుపోసాగింది. డీలా పడిపోసాగాడు. అంతకంతకూ అడుగువేయడమే ప్రళయమవుతోంది. రెండో అతనికి ఏంచెయ్యాలో పాలుపోలేదు. చటుక్కున ఏదో స్ఫురించిన వానిలా అన్నాడు.
'నువ్వేదో పెద్ద ఉపాసకుణ్ని అంటావ్! దేన్నైనా తట్టుకోగల సమర్థుణ్ని అంటావ్! ఆ మాత్రం దప్పికను తట్టుకోలేవా? తమాయించుకోలేవా?' అన్నాడు కాస్తంత ఘాటుగా దెప్పినట్లుగా.
అంతే... ఆ మాటలతో ఏదో శక్తి పూనినవాడిలా లేచి హుషారుగా నడవసాగాడు. 'తిప్పుకొన్నాను పద!' అంటూ అడవిదాటాడు. అడవిదాటాక నీటి ప్రవాహం ఎదురైనా ఏ మాత్రం ఆత్రపడలేదు. నింపాదిగా దాహం తీర్చుకున్నాడు.
నిజానికి అంతటి దాహం ఎలా భరించాడు? దాహం లేకుండా ఎలా పోతుంది? దప్పిక ఉందికానీ- అంతశ్శక్తిని నిగ్రహశక్తిగా మార్చుకున్నాడు. అవరోధాన్ని దాటగలిగాడు.
శాంతి, అహింసలే ఉపాసనామార్గంగా మార్చుకున్న మహాత్ముడు లోకానికే ఆదర్శనీయుడయ్యాడు.
హృదయాంతర్గత చేతనా శక్తిని మేల్కొలపడమే బలోపాసన. ఈ బలం ధాటికి ఏ ప్రతిబంధకాలూ నిలువజాలవు.
తననుతాను అసమర్థుడిగా భావించడం అసహజ లక్షణం. పూలకు సుగంధం, తరులతాదులకు చల్లదనం, ప్రవాహ జలానికి స్వచ్ఛత, వాయువుకు వీచే స్వభావం, అగ్నికి వెలుగునిచ్చే నైజం ఎంత స్వాభావికాలో- మానవ హృదయానికి ధీశక్తి, చైతన్యశక్తి అంతే స్వాభావికం.
శాస్త్రాధ్యయనాలన్నీ ఉపాసనలే. బలీయమైన శాస్త్రాధ్యయన పాటవం మానవుణ్ని నిష్ణాతుణ్ని చేస్తుంది. కళ్లకు గంతలు కట్టుకొని కేవలం శబ్దం వినడంద్వారా లక్ష్యాన్ని ఛేదించడం ఉపాసనావైచిత్రి కాకమరేమిటి? అంధత్వం, అంగవైకల్యం కలిగినవారూ పలురంగాల్లో విజయకేతనాలు ఎగురవేయడం ఉపాసనాబలం కాక మరేమిటి!
సంకల్పమే ముఖద్వారం. ముఖద్వారమే భవన నిర్మాణాకృతిని, ఉన్నతిని తెలుపుతుంది. దిటవైన సంకల్పం వివేకానికి ప్రతీక.
విశ్వరహస్యాలనే ఛేదిస్తున్న మానవమేధకు, దేహాంతర్గత భావవైచిత్రిని, మనఃప్రవృత్తిని అధ్యయనం గావించుకొనడం కష్టమైన పనేమీకాదు.
- దానం శివప్రసాదరావు