ᐅమత్స్య జయంతి 2
ధర్మరక్షణకోసం, దుష్టశిక్షణకోసం మహావిష్ణువు ధరించిన అవతారాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి దశావతారాలు. వాటిలో మొదటిది మత్స్యావతారం. దేవదేవుడు ధరించిన ఈ అవతారాలు కేవలం రాక్షసులను సంహరించడానికో, విష్ణుభక్తి ప్రచారానికో ఉద్దేశించినవి కావు. సమస్త మానవాళికి సన్మార్గ ప్రబోధకాలుగా, బాధల్లో ఉన్నవారిని ఆదుకొమ్మనే సందేశ సూచికలుగా భావించాలి.
మత్స్యావతార గాథ విస్మయపరుస్తుంది. దాని ప్రకారం- సత్యవ్రతుడనే మహారాజు(మనువు) మాలానదిలో తర్పణమందిస్తుండగా, ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, 'ఓ రాజర్షీ! నీవు దయాత్ముడివి... నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడానికి నేను నీ చేతిలోకి వచ్చాను' అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. ఆయనను మత్స్యనారాయణుడిగా గుర్తించిన మనువు కీర్తించి స్తుతించగా, స్వామి మనువుకు ప్రళయకాలం త్వరలో రాబోతున్నదని, ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాడని మత్స్య మహాపురాణం, భాగవతం చెబుతున్నాయి. ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పుడు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకు నౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
ప్రళయకాలంలో నిద్రిస్తున్న బ్రహ్మ చతుర్ముఖాలనుంచి వేదాలను సోమకాసురుడు దొంగిలించి, సముద్రంలో దాక్కున్నాడన్నది ఇంకో ఉదంతం. మత్స్యరూపంలో స్వామి ఆ సోమకుని సంహరించి, వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పజెప్పాడని చెబుతారు.
మత్స్యనారాయణుడు తన అవతారంలో సమాజ హితానికి, అభివృద్ధికి మూలకందాలైన వేదవిజ్ఞానం భరత జాతికందేలా అనుగ్రహించాడన్నది పురాణగాథల సారాంశం. చైత్ర శుద్ధ తదియ మహావిష్ణువు మత్స్యావతారం ధరించిన రోజు. ఆనాడు మత్స్య జయంతి జరపడం ఆనవాయితీగా వస్తోంది. మత్స్యావతారంలో విష్ణువు పూజలందుకునే ఏకైక దేవాలయం మనరాష్ట్రంలోనే ఉంది. చిత్తూరు జిల్లా నాగలాపురంలో స్వామిని వేదనారాయణుడిగా కొలుస్తారు. వేదరక్షణను పారమర్ధక భావనతోనే కాక, మరోరకంగానూ విశ్లేషిస్తారు. ఉప్పునీటితో నిండి ఉండే సముద్రంలో లోతుకు వెళ్లినకొద్దీ ఆణిముత్యాలు, అరుదైన నిధులు లభ్యమవుతాయి. సముద్రానికి అట్టడుగున ఉన్న వేదాలను శ్రీహరి తీసుకువచ్చి బ్రహ్మకందించాడు. సముద్రాన్ని అజ్ఞానానికి అర్ధంగా తీసుకుంటే, వేదాలు విజ్ఞాన సర్వస్వం! ఇందులోని సందేశం ఏమిటంటే- అజ్ఞానపు తెరలు తొలగించుకుని, లోపలికి వెళ్లినకొద్దీ, మనకు అత్యంత ఆవశ్యకమైన, ఉపయుక్తమైన జ్ఞాననిధి సొంతమవుతుంది! ఈ విషయాన్ని ఆకళింపు చేసుకుని, మానవాళి అజ్ఞానపు తిమిరాన్ని తొలగించుకుని, విజ్ఞానపు దివ్వెలు వెలిగించుకోవాలని 'మత్స్యావతారం' ప్రబోధించినట్లుగా భావించాలి.
- వెంకట్ గరికపాటి