ᐅతనువే తపోవనం
భక్తుడు భగవదున్మత్తుడు. భగవానుణ్ని సాధించుకునే ప్రయత్నంలో సాధకుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి, ఎవరిని ఆశ్రయించాలి? మనిషికో మార్గం, మనస్తత్వానికో మతం. ఎవరి అభిరుచి, అనుసరణ వారిది. చాలామంది కొండ గుహలకో, అరణ్యాలకో, హిమాలయాలకో వెళ్లి ఏకాంతంగా తపస్సు ఆచరించాలని భావిస్తారు. మంచిదే... కాదు కాదు... పరమోత్తమమైనదే. అందరికీ ఆ అవకాశం ఉంటుందా? సంసారం, ఆధారపడిన ఆత్మీయులు, వాతావరణ సమస్యలు, ముదిమి, అనారోగ్యం... ఎన్నో అడ్డంకులు! ఎన్నెన్నో ఆటంకాలు! అన్నింటినీ అధిగమించి వెళ్లగలిగినా మనది నిజమైన వైరాగ్యమే అయిఉండాలికదా? ఇంటిమీద గాలి మళ్లవచ్చు. ఒంటరితనం బాధించవచ్చు. పశ్చాత్తాపం ప్రారంభం కావచ్చు. ఇవన్నీ అధిగమించే సత్తా మనకు లేకపోవచ్చు. అన్నీ భరించి నిలువగలిగిన గౌతముడిలాంటివాళ్లు లేకపోతే- ఈ మార్గం ఎప్పుడో శాశ్వతంగా మూసుకుపోయి ఉండేది. అందరూ ఆ స్థాయి విరాగులు అయిఉండరు. వైరాగ్యం కలిగినా అవకాశం ఉండదు. ఉంటే మంచిదే. అందువల్ల... మనం ఉన్నదే మనకు అరణ్య మధ్యం అయ్యే అవకాశం ఉంది. ఉన్న ప్రాంతమే శీతల ఏకాంత హిమగిరులయ్యే అదృష్టం మనకు అందుబాటులో ఉంది. గుహాంతర్భాగమయ్యే గుహ్యతమ ప్రదేశం మన చేరువలోనే ఉంది. అదే... మన తనువు!!! ఒక్క అంగుళం కూడా కదలకుండా మనను ఏకాంత ప్రశాంత ప్రదేశానికి తరలించే వాహనం. హిమాలయ పర్వతాగ్రాలన్నంత శీతలత్వాన్ని అందించే ఏసీ గది, కొండ గుహలంత సమశీతల నిశ్శబ్ద రాసీభూతనిధి... మన తనువు.
శరీరం, దేహం, తనువు... ఏమిటిది! మజ్జ, మాంసం, అస్తులు, నాడులు, రక్తం... ఈ రక్తసిక్త, మలమూత్ర మలిన దేహమా భగవధ్యానానికి మనకుపకరించే పవిత్రక్షేత్రం! ఔను. ముమ్మాటికీ. అదే రహస్యం. అదే ఆనందం. అదే అనుకూలం. నిజానికి మనం ఈ జన్మ, మానవ దేహం పొందిందే పరమపద ప్రయాణసాధనంగా, పరమాత్మసాధనా నిధానంగా. అయితే పరమాత్మ పవిత్ర పూజావిధులకు వినియోగించవలసిన గంగాజలాన్ని పురచేతి పనులకు దుర్వినియోగపరుస్తున్నాం. పరమాత్మ నిలయమైన, భగవత్‌సాధనా పరికరమైన ఈ దేహాన్ని తుచ్ఛమైన భౌతిక సుఖాలకు (ధర్మబద్ధం కానివాటికి. గృహస్తులకు ధర్మబద్ధ సుఖానుభవం నిషిద్ధం కాదు) దుర్వినియోగం చేస్తున్నాం. కాదు. ఇది కాదు పద్ధతి. ఇది కాదు ధర్మం. ఇదికాదు తనూ సార్థక్యం. ఇదికాదు దేహధారణోద్దేశం.
తనువు... ఒక తపోవనం. ఔను. తనువే తపోవనం. భగవంతుడు అత్యంత దయామయుడు. అతి దుర్లభమైన తన సన్నిధానానికి కరుణతో అతి సౌకర్యవంతమైన మార్గాన్ని ఏర్పాటుచేసి అందించాడు. శరీరాన్ని ఇచ్చి దాన్ని ఉపకరణంగా మలిచాడు. నేను, నాది అనుకునే దానిపట్ల మనకెంత స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌలభ్యం ఉంటాయి! నన్ను నేను ఎలాగైనా వినియోగించుకోవచ్చు. నాది అనుకున్నదాన్ని ఎలాగైనా మలచుకోవచ్చు. ఎంతగానైనా కష్టపెట్టుకోవచ్చు. ఏమిటీ తనువు? పంచభూత నిర్మితం. పంచకోశ సమన్వితం. పంచ జ్ఞానేంద్రియ పేటిక. పంచకర్మీంద్రియ వాటిక.
ఈ అనంత విశ్వంలో భగవంతుడు ప్రియమార ఎన్నుకున్న మేలిమి సింహాసనం మానవ హృదయం. అలాంటి హృదయాన్ని కలిగిఉన్న అదృష్టవంతులమైన మనం ఎలా ఉండాలి? భగవంతుడు అతి శుచివంతుడు. అత్యంత పవిత్రుడు. ఆయన శుచికి గోమూత్రాన్ని, గోమయాన్ని, అభిషేకార్చనలకు గోక్షీర, గోదధి, గోఘృతాన్ని ఇష్టపడతాడు. సర్వదేవతానిలయ గోవు. అందువల్ల మనం ఓ గోమాత కావాలి. సహనంతో ఒక భూమాత అయిపోవాలి. పంక ప్రాయమైన ప్రాపంచిక కల్మషాల మధ్య అవేమీ అంటని కమలాలమైపోవాలి.
దర్భాసనం మీద పద్మాసనంలో ఉంచిన ఈ శరీరం ఓ తపోవనం. ఈ తపోవనంలో, ఈ యజ్ఞవాటికలో భగవంతుని కైంకర్యానికి అవసరమైన అన్నీ అమరిఉన్నాయి. జీవాత్మను యాజ్ఞికుడుగా అంతరంగ యజ్ఞం ప్రారంభించాలి. ఆర్తి అనే అరణిని (పవిత్ర యజ్ఞాన్ని) రగిలించాలి. మొదట దుష్టగుణాల్ని, తరవాత కోరికల్ని వాంఛల్ని, ఆపై ప్రాపంచిక వాసనల్ని, దరిమిలా సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మల్ని సమిధలుగా అర్పించి, చివరకు 'నేను' అనే 'అహం' భావాన్ని పూర్ణాహుతిగా సమర్పించి అగ్నితప్తమై, అతిపవిత్రమైపోయిన జీవితాన్ని యజ్ఞాగ్ని శిఖగా మిగిల్చి భగవంతుడనే పరంజ్యోతిలో లయం చేయాలి.
- చక్కిలం విజయలక్ష్మి