ᐅగౌరవంగా జీవిద్దాం!





గౌరవంగా జీవిద్దాం! 

'సమాజంలో గౌరవంగా బతకాలి, కీర్తిని పొందాలి, పదికాలాలపాటు లోకులు మన పేరునే స్మరిస్తూ, మెచ్చుకుంటుండాలి' అనుకుంటాం. అలా జీవించాలంటే ఏం చేయాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా మాట్లాడాలి? జీవించే కొద్దికాలం గౌరవంగా జీవించాలి. లేకపోతే మనిషికీ పశువుకూ తేడాయే లేదు. భగవంతుడు మనకు ప్రత్యేకంగా బుద్ధీ, హృదయమూ ఇచ్చాడు. ఈ రెంటినీ సద్వినియోగపరచుకుంటేనే జీవితం కల్యాణమయం. అందుకోసం సనాతన ధర్మం ఎన్నో సన్మార్గాలను సూచించింది. మన మహర్షులు పురాణాలు, శాస్త్రాలు అందజేశారు. వాటిని శ్రద్ధతో అధ్యయనం చేసినట్లయితే ఎన్నెన్నో మంచి విషయాలు అవగతమవుతాయి. వాటిని ఆచరించడం మన విజ్ఞత, సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది.
ప్రధానంగా మన జీవన సార్ధకతకు అయిదు 'వ'కారాలను సర్వదా గుర్తుంచుకుని ఆచరించడం వాంఛనీయమని పెద్దలు చెబుతారు. 1. వస్త్రం, 2. వపుస్సు అంటే శరీరకాంతి, 3. వాక్కు, 4. విద్య, 5. వినయం. ఈ అయిదింటి పట్ల శ్రద్ధ వహించాలి.

మన వస్త్రాలు పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించకపోతే సంఘంలో ఆదరణ లభించదు. రెండోది, వపుస్సు అంటే 'శరీరకాంతి'. ఇది శరీరవర్ణంవల్ల ప్రాప్తించదు. శరీరం తెలుపైనా, ఎరుపైనా నలుపైనా ముఖం తేజోవంతంగా ఉండాలి. అలా ముఖసౌందర్యం తేజస్సుతో విరాజిల్లాలంటే యోగ, ధ్యానం, జపం చెయ్యాలి. కామక్రోధాది వికారాలను పూర్తిగా మనసునుంచి తరిమెయ్యాలి. మనసును ప్రసన్నంగా, శాంతంగా ఉంచుకోవాలి. ఎవరిమీదా పగ, ద్వేషం పెంచుకోకూడదు. మంచి ఆలోచనలే చేయాలి. ఫలితంగా ముఖం కాంతిమంతమై అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది.

తరవాతది వాక్కు. అంటే మాట. 'వాగ్భూషణమ్ భూషణమ్' అన్నాడు భర్తృహరి. గౌరవమయ జీవనానికి ఇది అత్యంత ప్రధానమైనది. వాక్శక్తి అసమానమైనది. అమోఘమైనది. సభ్యత, సంస్కారం కలిగిన మాట మనకు సమాజంలో అపూర్వ ఖ్యాతి తెచ్చిపెడుతుంది. మన మాట సౌమ్యంగా, ఆనందకరంగా ఉంటే ఎదుటివారు మనకోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు. ఎంతగానో అభినందిస్తారు. అందుకే 'మాటే మంత్రం' అన్నారు. 'మాటనేదే గొప్ప వశీకరణ మంత్రం' అన్నాడు గోస్వామి తులసీదాసు. మన నాలుకనుంచి ఎన్నటికీ పరుషపదాలు, అసభ్య-అశ్లీల పదాలు రాకుండా చూసుకోవాలి. సమాజంలో ప్రత్యక్షంగా, అతిశీఘ్రంగా మనకు యశస్సును, కీర్తిని సంపాదించిపెట్టేది మాటే! మనసు మంచిదైతే మాట మంచిదే వస్తుంది. మనసును నియంత్రించుకోవాలి అందుకే. మాట మన్ననలిస్తుంది. మంచి మాట మానవుణ్ని దేవుడిగా మారుస్తుంది. మానవత్వంలో దైవత్వాన్ని ప్రతిష్ఠితంచేసేది మాటొక్కటే. రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి మహనీయుల మాటలు శ్రోతల్ని మంత్రముగ్ధులు చేసేవంటే- అందుకు కారణం వారి సాధన, ఏకాగ్రత, నైష్ఠికత, క్రమశిక్షణ, అధ్యయనశీలత!

నాలుగోది, విద్య. విద్య మహత్తు తెలియనివారుండరు. రాజు తన రాజ్యంలోనే గౌరవం పొందుతాడు. విద్వాంసుడికి అన్ని దేశాల్లోనూ గౌరవం లభిస్తుంది. మనిషిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించి సన్మార్గానువర్తుడిగా చేసేదే విద్య. ధనం పంచిన కొద్దీ తరుగుతుంది. విద్య పంచినకొద్దీ పెరుగుతుంది. అందుకే సద్గురువులు తమ ఆశ్రమాల్లో నిస్వార్ధంగా జ్ఞానాన్ని శిష్యులకు పంచి, తమ జ్ఞానాన్ని పెంచుకునేవారు.

అయిదో ప్రధానాంశం 'వినయం'. వినయం విద్యను, క్రమశిక్షణను, విజయాన్ని ప్రసాదిస్తుంది. సకల కార్యసాఫల్యానికీ వినయమే పునాది. వినయంతో ఏదైనా సాధించవచ్చు. ఏ విద్యను, కళను నేర్చుకుని నైపుణ్యం పొందాలన్నా- మానవుడికి వినయం విధిగా ఉండాలి. అహంకారంతో తలెత్తి పెరుగుతున్న మహావృక్షాన్ని, కింద నేలమీద ప్రవహించే నీరు నిలువునా కూల్చేస్తుంది. బలహీనంగా ఉన్న గడ్డిపరక తలవంచుకునే ఉంటుంది, కనుక ఎంతటి ఉప్పెనయినా ఏమీ చేయలేదు. అలాగే వినయసంపన్నుణ్ని ఎవరూ ఏమీ చేయలేరు. పెద్దలకు, గురువులకు, పరమాత్మకు, ప్రకృతికి వినయబద్ధులమైఉంటే- అది ఆత్మన్యూనత, అవమానం కాదు. పైగా అది గౌరవప్రాప్తికి ముఖ్యసాధనం కూడా. వ్యక్తి సౌశీల్యానికి అలంకారప్రాయం వినయగుణం.

ఈ అయిదు రకాల ఆవశ్యక లక్షణాలను ఆకళింపు చేసుకుని, ఆధ్యాత్మిక భావనతో మేళవింపు చేసి, ఆత్మసంతృప్తితో గౌరవమయ జీవనం కొనసాగించి, జన్మను చరితార్థం చేసుకోవడం మన విధ్యుక్తధర్మం!


- చిమ్మపూడి శ్రీరామమూర్తి