ᐅఅసలైన ఆయుధాలు




అసలైన ఆయుధాలు 

ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ధరించడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. ఆయుధం పట్టని దేవుళ్లు మన పురాణాల్లో అరుదుగా కనిపిస్తారు. వివేకం, విచక్షణ కలిగినవారే ఆయుధాలను సమయోచితంగా ప్రయోగిస్తారు. ఆటవికయుగం నాటి కత్తులు, బల్లాల నుంచి ఆధునిక అణ్వస్త్రాల వరకు అన్నీ... ప్రమాదకరమైనవే. ప్రపంచాధిపత్యం కోసం అతి భయంకరమైన మారణాయుధాలు తమ వద్ద ఉన్నాయని బెదిరించడం వరకే అవి పనికొస్తాయి. తొందరపడి చేసే ప్రయోగం 'భస్మాసుర హస్తం' అవుతుందన్న భయం వారికుండటం సహజం. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన వినాశనం ఇప్పటికీ చేదుగుర్తుగా మానవాళిని వెంటాడుతూనే ఉంది.
ఆయుధ ధారణ గురించి రామాయణంలో వనవాస దీక్షలో ఉన్న సీత దండకారణ్యం దారిలో రాముడికి రసరమ్యంగా వివరిస్తుంది. మనిషికి అత్యంత ప్రమాదకరమైన వ్యసనాలు మూడున్నాయనీ... అవి అసత్యవాక్యం, పరస్త్రీ గమనం, అకారణ హింసగా ఆమె వర్ణిస్తుంది. 'రామా, నీవు మొదటి రెండూ ఎరుగవు. మూడోది, పరుల ప్రాణాలు తియ్యడం. అజ్ఞానంవల్ల పామరులు ఈ పని చేస్తారు. సర్వశాస్త్రాలు తెలిసిన నీవంటివాడు ఇలా హింసకు పాల్పడటం సమర్థనీయమా?' అని ప్రశ్నిస్తుంది. అంతటితో ఆగక, గతంలో పరమ భాగవతోత్తముడైన ఒక ముని ఘోర తపస్సును భంగం చేయడానికి దేవేంద్రుడు ఎలా ఈ ఆయుధాన్ని ఉపయోగించుకున్నాడన్న కథ ఒకటి చెబుతుంది. సత్యభాషి, ధర్మపరాయణుడైన ఓ ముని దృఢదీక్షతో అరణ్యంలో ఎనలేని ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అది సహించలేని దేవేంద్రుడు వేటగాడి రూపంలో వచ్చి 'మహాత్మా, నేను కార్యార్థినై దూరతీరం వెళ్తున్నాను. పదునైన ఈ ఖడ్గాన్ని మీ వద్ద భద్రంగా ఉంచండి. మళ్లీ వచ్చి తీసుకుంటాను' అని నమ్మబలుకుతాడు.

ఆ ముని, ఖడ్గాన్ని తన ఆశ్రమంలో ఉంచుతాడు. అడవిలోకి వెళ్లేటప్పుడు తనతో ఆ కత్తిని కూడా తీసుకెళ్ళేవాడు. కొన్నాళ్లు పోయాక ఆ ఖడ్గంతో జంతువులను, ఆపై మనుషులనూ చంపడం ప్రారంభించి ఘోరకృత్యాలు చేసి భ్రష్టుడవుతాడు. ఇదంతా అతడి దగ్గరున్న ఆయుధం వల్లనే జరిగిందని సీతామాత చెబుతుంది. దానికి రాముడు బదులిస్తూ శిష్టరక్షణ కోసం దుష్టశిక్షణ అనివార్యమని అంటాడు. తన లక్ష్యసాధనలో రాక్షస సంహారం తప్పదని పేర్కొంటాడు. 'కరణేషు మంత్రి'గా ఈ సలహా చాలా గొప్పగా ఉందనీ ఆమెను అభినందిస్తాడు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం వంటి లక్షణాలున్న వ్యక్తికి అపజయమన్నదే లేదని రాముడు అభిప్రాయపడతాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసల వల్లనే చిరకాల యశస్సు పొందగలమనీ, మన వ్యక్తిత్వ రక్షణకు అవే 'అసలైన ఆయుధాలు'గా రఘురాముడు వివరిస్తాడు.

- కిల్లాన మోహన్‌బాబు