ᐅసేవాప్రవృత్తి
ఈ లోకంలో సేవాధర్మంకన్న మించిన ధర్మం లేదు. సృష్టి అంతా సేవలోనే నిబిడీకృతమె ఉంది. చెట్టు, చేమ, గుట్ట, పుట్ట... అన్నీ సేవాధర్మాన్ని ఎవ్వరూ గుర్తుచేయకుండానే నిర్వర్తిస్తున్నాయి. పశుపక్ష్యాదులూ తమకు చేతనైన సేవచేస్తూ మానవుణ్ని తృప్తిపరుస్తున్నాయి. ఎటొచ్చీ శ్రేష్ఠమైన జన్మపొంది, గొప్ప హృదయాన్ని, బుద్ధిని పొందిఉన్న మానవుడే సేవాధర్మం విస్మరిస్తున్నాడు లేదా అలక్ష్యం చేస్తున్నాడు. సేవాప్రవృత్తిని స్వార్థచింతన కబళించేస్తోంది. అహంకారం దహించివేస్తోంది. చదివినకొద్దీ, వివేకం పెరిగినకొద్దీ మనిషి ఇతరులనుంచి సేవను అపేక్షిస్తూనే ఉన్నాడు కాని- తాను సేవచేయాల్సింది విస్మరిస్తున్నాడు. ఇది ఎంతటి హేయమైన విషయం? ఏదైనా పొందాలంటే- ముందు ఇవ్వడానికి సంసిద్ధులం కావాలి! 'ఇస్తేనే వస్తుంది' అన్నది సామాన్య సూత్రం.
సేవచేయటంలో ఉన్న ఆత్మానందం, సంతృప్తీ, సంతోషం అనిర్వచనీయమైనవి. శక్తివంచన లేకుండా నిస్సహాయులకు, అనాధలకు, ఆర్తినిండిన కళ్లతో నిరీక్షిస్తున్న వాళ్లకు సహాయపడితే కలిగే ఆనందానికి సాటి లేదు. 'దరిద్రులు, దుఃఖితులు, దుర్మార్గులే నా ఆరాధ్య దైవాలు. ఇతరులకు ఏ కొద్దిపాటి సేవచేసినా అది మనలో ఉన్న శక్తిని జాగృతం చేస్తుంది. క్రమంగా అది మన హృదయంలో సింహసదృశమైన బలాన్ని నింపుతుంది' అంటారు స్వామి వివేకానంద. ఇతరులకు సేవ చేయటంవల్ల జాగృతమయ్యే అంతశ్శక్తితో మనం ఎంతటి విషమ సమస్యలనైనా అవలీలగా ఎదుర్కోగలం. పగలంతా పొలంలో పనిచేయటంవల్ల కలిగే అలసటకన్న ఒక్క గంట ఇతరుల్ని ద్వేషిస్తూ దూషిస్తూ పొందే అలసట దేహానికీ, హృదయానికీ మహాప్రమాదకరమైనదంటారు. ఆ అలసటలో ఆనందం ఉంది, తృప్తి ఉంది. ఈ అలసటలో మాలిన్యం ఉంది, పతనం ఉంది.
మనకు కలిగే కొన్ని చేదు అనుభవాల ఆధారంగా సమాజంలోని మానవులంతా స్వార్థపరులేననుకోవడం పొరపాటు. వెలుగునీడల్లాగే మంచీచెడులూ సహజం. దీర్ఘవ్యాధిగ్రస్తుడై మరణశయ్యపై పడి వున్న రోగిని చూసే వందమందిలో ఒకరిద్దరు కరుణాహృదయులూ ఉంటారు. దాహార్తితో విలవిల్లాడుతున్న బాటసారిని చూస్తూ చాలామంది వెళ్లిపోయినా, గుక్కెడు నీళ్లు పోసి కాపాడే మహానుభావులు ఎవరో ఒకరుంటారు. కొద్దిమంది స్వార్థపరుల్ని, దుర్మార్గుల్ని చూసి సమాజమంతా ఇలాగే ఉంటుందనుకోవడం పుట్టుమచ్చను చూసి పర్వతమని వూహించుకోవడంలాంటిది. అనాదిగా మానవజాతిలో ఎందరో మహాత్ములు అవతరించి, నిరంతర సేవాధర్మపరాయణులై జాతిని జాగృతం చేస్తూనే ఉన్నారు. ఇతరులకు సేవ చేయడమంటే మనకు మనం సేవచేసుకోవడమేనన్న మహత్తర సందేశాన్నిచ్చే పాత్రలెన్నో!
ఆర్తితో అలమటిస్తున్నవారికి కావలసింది ఓ చిన్న పలకరింపు. ఓ ప్రేమ చిలకరింపు. కనీసం అదైనా మనం చేయలేకపోతే- మానవజన్మే వ్యర్థం. బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, మదర్‌థెరెసా, మార్గరెట్ ఎలిజబెత్, అబ్రహాం లింకన్ వంటి మహనీయుల సేవాదృక్పథం మనం మరువగలమా? నిజమైన సేవకుడికి కులం, మతం, వర్గం, ప్రాంతం, సమయం-ఇవేమీ అడ్డుకావు. అలాగే మనిషి, పక్షి, పశువు- ఇలాంటి తారతమ్యాలు కూడా చూడడు. ఒక్క అన్నం ముద్దవేస్తే తిన్న కుక్క మన లోగిలిలోనే ఎంత విశ్వాసంగా పడి ఉంటుంది? ఒక అద్భుతమైన సుగుణం చాలు- మనిషిని మనీషిగా తీర్చిదిద్దేందుకు! శక్తి, వనరులు, అవకాశాలు, వివేకం, విచక్షణ- అన్నీ ఉండి కూడా ఈ జీవితాన్ని దీనజన సేవకు కొంతలో కొంతయినా వినియోగించలేకపోతే ఇంక ఈ జన్మకు అర్థమే లేదు. పరమార్థం అంతకన్నా లేదు. మనసు, మాట, విద్య, విత్తం, ఆహారం... ఏ రూపేణా అయినా సేవచేసి ఆదుకోవచ్చు. సంకల్పం ఉండాలేకాని, సేవా పరాయణత్వానికి ఎన్నో మార్గాలు. ఈ సత్యం తెలుసుకుని మన జీవితాన్ని సేవామయంగా విరాజిల్లజేసుకుందాం!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి