ᐅఅమృతధార
బాహ్య పూజకు ఏమున్నా లేకపోయినా పత్రం, పుష్పం, ఫలం, తోయం ఉంటే చాలంటారు. ఈ అన్నీ కాకపోయినా, లేకపోయినా ఒక్కటైనా, ఒక్కటున్నా చాలనీ ఆర్యోక్తి. ఒక్క ఉద్ధరిణెడు జలంతో బోళాశంకరుడు సంతోషంతో తలమునకలైపోతాడు. ఒక్క తులసి పత్రంతో అంతోటి శ్రీకృష్ణుడు పారిజాతపు రేకులా తూగిపోతాడు. ఆనందంతో 'తేలి' పోతాడు. అమ్మ స్తోత్రప్రియ, ఒక్క జపాపుష్పం సమర్పించి స్తోత్రం చేస్తే- సమస్తం దయ చేస్తుంది. ఏ దేవుడికి ఫలాన్ని సమర్పించినా మన జీవితమే సఫలం అయిపోతుంది. ఈ అన్నీ కలిసిఉన్న అపురూప వస్తువొకటి మన దగ్గరుంది. అదే... మనసు! మనసు ఓ ఆకుపచ్చని పత్రం. సూర్యరశ్మి అనే భగవత్ స్పర్శతో పత్ర హరితాన్ని సమకూర్చుకుంటుంది. మనసే ఓ పుష్పం. మానవత్వమనే మార్దవాన్ని, సౌమనస్యమనే సౌకుమార్యాన్ని, శుభ్ర జీవనమనే సౌరభాన్ని సమకూర్చుకున్న మనసే ఓ పుష్పం. మనో పుష్పం. మనసు మధురఫలం కూడా. ఫలిత భక్తి పండిన మనసు ఓ అమృతఫలం. ఆర్ద్రత చెందే మనసు మధుర రస స్వరూపం. అదే తోయం. తోయాన్ని చిందే మనసు. తోయాన్ని ఒలికే మనసు. పత్రం, పుష్పం, ఫలం, తోయం... ఈ అన్నింటి సమాహారం, సమగ్ర స్వరూపం- మనసు. ఒక్క మనసును అర్పిస్తే భగవంతునికి సమర్పించవలసినదంతా సమర్పించినట్లే. అదే అమృత ధార, నైవేద్య క్షీర.
మనసునే ఎందుకర్పించాం? ఈ అన్వయాన్ని శరీరానికో, ధనానికో, కీర్తికో కూడా చేసుకోవచ్చు కదా? కాదు. వద్దు. ఆత్మ అనేది ఇంద్రియాలకు, పంచకోశాలకు అందనిది. చెందనిది. ప్రాపంచిక ఉపకరణాలతో, ఉపాయనాలతో పొందనిది. మనసు!? నిజమే... మనసు కూడా ఓ ఇంద్రియమే. పంచకోశాల్లోని ఓ కోశమే. కానీ ఆత్మ వరకూ అన్వేషణ సాగిస్తూ 'నేతి నేతి' అంటూ ఇంద్రియాలనూ, పంచకోశాలనూ పంచీకరణ చేస్తూ, అన్నింటినీ తిరస్కరిస్తూ వెళ్లాల్సి ఉంది. తిరస్కరించేందుకు వస్తు వివేకం, వస్తు విభజన చేయాలంటే మనకు మనసు సహకరిస్తుంది. ఈ అన్నీ వదిలిపోయాక, అన్వేషణ కొంతమేర ఫలించాక మనసును అమనస్కం చేయాల్సి ఉంది. కాలిలోని ముల్లును తీసిన మరో ముల్లును మనం పారవేయవలసి ఉన్నట్లు. అయితే మరి... పత్రం, పుష్పం, ఫలం, తోయం... వీటి అవసరమేమిటి? నిజమే. మనం మనోబుద్ధి స్థాయిలో ఉన్నంతవరకూ ఇంద్రియాకర్షక వస్తువులనే భగవంతునికి అర్పించవలసి ఉంది- కాదు... అర్పిస్తాం. క్రమేణా భగవంతుని అప్రమేయత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని గ్రహించేకొద్దీ ఆయనకు ఏమి అర్పించాలో అర్థమవుతుంది. మనలోని, మన బయటి ఏ వస్తువులూ ఆ అప్రమేయత్వాన్ని అందుకునేంత, దానికి అందించేంత పరిమాణంతోగానీ, ప్రమాణంతోగానీ లేవు. పరిమితమైన ఉపకరణాలతో పరికరాలతో అంతటి సర్వాంతర్యామికి తగిన స్థాయిలో మనం ఏమీ సమర్పించలేం. ముఖ్యంగా బాహ్య వస్తుజాలాన్ని ఏమర్పించినా భగవంతుడు దానికి శతాధికంగా తిరిగి మనకు అందజేస్తాడు. అదే మనసు నర్పిస్తే మాత్రం దాన్ని లుప్తం చేస్తాడు. ఆత్మలో లయం చేస్తాడు. ఆత్మను తెలియజేస్తాడు.
మనసు అమనస్కమైతేనే ఆత్మ అర్థమవుతుంది. ఆత్మ భావన అనుభూతమవుతుంది. అమనస్కం... మనసు లేకుండాపోవటం. ఎలా? నిరంతర ఆలోచనా ప్రవాహమే మనసు. ఆలోచనలను అరికడితే, ఆపేస్తే- అదే అమనస్కం. ఇదెలా సాధ్యం! ఆలోచన లేకుండా జాగృతే లేదుకదా!? ఆలోచనలను ఏకాగ్రపరచినప్పుడు, ఒకే విషయం మీద నిలిపినప్పుడు- ఆలోచనలు (మనసు) ఏకోన్ముఖం అవుతాయి. పరిపరి విధాల పాకులాట ఆగిపోతుంది. ఒకేచోట, ఒక బిందువు కేంద్రంగా ముడివడి, సుడివడి- సుళ్లు తిరిగే నీటి వెల్లువ సుడులు సుడులుగా తిరిగి తిరిగి లోలోపలికి లయమై అంతర్ధానమైపోయినట్లు... ఆలోచనల ప్రవాహమూ ఒకేచోట కేంద్రీకృతమై అక్కడే తిరిగి తిరిగి క్రమంగా లోపలికి జారిపోతూ అసలు అంతర ప్రవాహంతో మమేకమైపోతుంది. అంతా ఒకడే అయినప్పుడు ప్రత్యేక ఉనికి, ఉపాధి, బాధ, వేదన, ద్వైతం, అన్యతా భావం... ఏమీ ఉండవు. ఆ అనంత సాగరపు, ఆ ఆత్మకాసారపు అణువణువులో, కణకణంలో తానూ ఒకటిగా కలగలిసిపోతుంది. అదే అమనస్కం. ఇలాంటి స్థితిని పొందేందుకే యోగులు, ధ్యానులు, సాధకులు- మనసునే పరికరంగా సాధన చేసి, ఆ మనసునే సాగనంపుతారు. పుట్టుక స్థానానికే పట్టుపట్టి అంపకం పెడతారు. ఈ ప్రక్రియకు దోహదపడే ఉద్దేశంతోనే కాబోలు- భగవంతుడు ఆ మనసునే కోరతాడు.
- చక్కిలం విజయలక్ష్మి