ᐅఆది యోగం



ఆది యోగం 

దేనికైనా అవగాహన ముఖ్యం. సాధన గురించిన అపోహలతోనే మనం సమయాన్ని వృథా చేసుకుంటాం. ఏది సాధన, ఎక్కడినుంచి ప్రారంభించాలి, దేనితో ప్రారంభించాలి? పూజలా, నోములు, వ్రతాలా? దీక్షలు, పారాయణలా? జపధ్యానాలా, క్రియలా? నిజాయతీగల గురువులెవరు? ఉన్నా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవారెవరు? ఈ విచికిత్సలతో, సందేహమానసంతో వ్యక్తి కకావికలం అయిపోతాడు, కల్లోల పడిపోతాడు. నిజమే, ఆధ్యాత్మిక జీవితాన్ని అందిపుచ్చుకోవాలనే జిజ్ఞాస ప్రారంభమయ్యాక మనిషి ఆగలేడు. ఏదో చేయాలి. ఏదో పొందాలి. ఏదేదో అయిపోవాలనే తొందర నిలిచి నీళ్లు తాగనివ్వదు. కానీ... ఏది సరైన మార్గం? ఇది కచ్చితంగా చెప్పడం కుదరదు. ఎందుకంటే ఎన్నెన్నో మార్గాలు... శ్రీ రామకృష్ణులు చెప్పినట్లు- ఎన్ని మతాలో అన్ని మార్గాలు. గమ్యం మాత్రం ఒకటే. సత్యం మాత్రం ఒకటే. మతాలే కాదు. సంస్థలు, వ్యవస్థలు, సంప్రదాయాలు... ప్రతిదానిదీ ఒకో మార్గం, ఒక్కో పద్ధతి. ఎన్నుకోవలసిన వ్యక్తికి జుట్టు పీక్కోవలసిన పరిస్థితి. ఈ అన్నింటికీ ఒక పరిష్కారమార్గం ఉంది. అదే పతంజలి మహర్షి అష్టాంగయోగం. గురువు లేకుండా, గురువు మార్గదర్శకత్వం లేకుండా ఆ యోగం మాత్రం మనను ఉద్ధరిస్తుందా, గమ్యం చేరుస్తుందా? లేదు. చేర్చదు... తొంభై తొమ్మిది శాతం. ఆ ఒక్క శాతం వ్యక్తులు అలా గురువు లేకుండానే గమ్యాన్ని చేరుకోగలిగే అవకాశం ఉంటే ఉండవచ్చు. 'గురువులేని విద్య గుడ్డి విద్య'. ప్రాపంచిక విద్యలకే ఇది వర్తించినప్పుడు అత్యంత గహనం, గుహ్యం అయిన బ్రహ్మవిద్య గురువు లేకుండా ఫలించడం మరింత కష్టసాధ్యం. అవతార పురుషులైన రామ, కృష్ణులకు, రామకృష్ణులకే గురువును స్వీకరించక తప్పలేదు.
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి... ఇవీ అష్టాంగ యోగంలోని ఎనిమిది అంగాలు. ఒక్కో అంగాన్నీ నిష్ఠగా, నిదానంగా క్రమసాధన చేస్తూ, ప్రతి అంగాన్నీ అధిగమిస్తూ ముందుకెళ్లాలి. పైకి వెళ్లాలి. అయితే ఈ మధ్యలోనే మనకు సద్గురువు తారసపడతాడు. ఎందుకంటే సొంత సాధనతో, ఆర్తితో మనం అర్హత సాధించే దిశగా పయనం సాగిస్తూ ఉంటాం. ప్రాథమిక అర్హత లభించిన వెంటనే ఇక ముందుకు, క్లిష్టమైన దశకు మార్గనిర్దేశం చేయడానికి గురువు ప్రత్యక్షమవుతాడు.

ప్రారంభ సాధకుడికి మొదటి అంగాలైన యమ, నియమాలు అత్యంత ప్రధానమైనవి. ఆ రెంటినీ సాధన చేయనిది, సాధించనిది ఆసనం మీద ఆశీనమయ్యే యోగ్యత లభించదు. అది లేక, పొందక తొందరపడి కూర్చున్నవారే- ఎంత కాలానికీ ఆసన సిద్ధి కాలేదని, ధ్యానం కుదరలేదని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. అలా అని ఆసనం మీద కూర్చోనేరాదని కాదు. ఆసనం మీద కూర్చోనిదే ఏ సాధనా, ఏ అంగమూ ప్రారంభించలేం. అయితే నిజమైన అర్హత లభించదని, నిజమైన అధికారి కాలేదని. అయినా... మరి తప్పదు. దొరికీ దొరకని అధికారంతో దొరతనాన్ని సంపాదించాలి. వేలు పెట్టే సందు తీసుకుని కాలు పెట్టేయాలి. ఈ చిలిపితనాన్ని దేవుడైనా అంగీకరిస్తాడు... పిల్లాటగా చూసి ముసిముసిగా నవ్వుకుంటూ.

ఏమిటీ యమ నియమాలు? యమ: అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. నియమ: శుచి, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిదానం. శారీరక (బాహ్య), మానసిక (అంతర) సంస్కారాలు. సంస్కరణలు. శుద్ధి కార్యక్రమాలు. బంగారానికి పుటం పెడితేగానీ ఆభరణం చేయటం కుదరదు. ఇంటిని శుభ్రం చేస్తేగానీ అలంకరణ సాధ్యం కాదు. పాత్రశుద్ధి ఉంటేగానీ పాలు కాచలేం. పవిత్రమైన పరమపదాన్ని చేరేమార్గంలో భౌతిక బురద నంటించుకున్న పాదాలతో అడుగుపెట్టలేం. ఎప్పటికప్పుడు పాదాలను శుభ్రం చేసుకుంటూనే అడుగులు ముందుకు వేయవలసి ఉంటుంది. పరమ పావనుడైన పరమాత్మను మాలిన్యంతో నిండిన దేహాంతర్గతమైన హృదయంలోకి ఆహ్వానించలేం. మనోశరీరాలను పరిశుద్ధం చేసుకోవలసి ఉంటుంది.

- చక్కిలం విజయలక్ష్మి