ᐅఏ దేశమేగినా





ఏ దేశమేగినా... 

వివేకానందస్వామి గొప్ప దేశభక్తుడు. ఆధ్యాత్మికశక్తితోపాటు ఆయనలోని దేశభక్తి దేశప్రజలపట్ల అత్యంత ఆర్ద్రతను కలిగించింది. బాధ్యునిగా చేసింది. ఆయన విదేశీపర్యటన తరవాత ఎవరో ప్రశ్నించారు- 'భారతదేశం పట్ల మీకు గొప్ప భక్తి, గౌరవం. మరి సకల సౌకర్యాలతో, సుఖభోగాలతో ఓలలాడే దేశాలు చూశాక ఇప్పుడు భారతదేశం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?' అని. 'ఇదివరకటికంటే ఇప్పుడు నా దేశం పట్ల నాకు మరింత ఆరాధన, పూజ్యభావన పెరిగాయి' అన్నది ఆయన సమాధానం.
చాలామంది అడిగే ప్రశ్న- 'ఏమిటి భారతదేశం గొప్పదనం? పేదరికం, అనాగరికం, మూఢవిశ్వాసాలు... ఇవేగా?' అని. స్థూలదృష్టితో చూస్తే అలాగైనా, ఎలాగైనా కనిపించవచ్చు. కానీ, భారతీయులది అంతర్‌నేత్రం. జ్ఞానదృష్టితో చూస్తే, భారతం ఒక ఆధ్యాత్మిక దేశం. సాత్విక దేశం. సర్వశ్రేష్ఠదేశం. మనిషి జన్మరహస్యాన్ని తెరిచే తాళం చెవి ఇక్కడుంది. ధనం, సుఖభోగాలు, సౌందర్యపోషణ, ఆహారం, అధికారం, ఆర్భాటం... ఇవి కాదు- మానవ జన్మ ఉద్దేశం. నిరంతర పర శ్రేయోకామన, వైరాగ్యం, యజ్ఞభావనా జీవితం, ఆత్మసాక్షాత్కారం, పరమపదప్రాప్తి... ఇవి. ఇదీ మానవ జన్మోద్దేశం. వీటి సాధనకు భారతదేశం వాకిళ్లు తెరుస్తుంది. పూలబాట పరుస్తుంది. ఉత్తమోత్తమ జీవిక గమనానికి, ఉత్కృష్ట జీవన గమ్యసాధనకు భారతాన్ని మించిన దేశం భూతలంమీదే లేదు. ఇది వేదాలు పుట్టిన దేశం. ముక్కోటి దేవతల నిలయమైన గోవులు అలరారే దేశం. అష్టాదశ శక్తిపీఠాలతో ద్వాదశ జ్యోతిర్లింగాలతో తానే పరమాత్మ పీఠమై పునీతమైన దేశం. హరిపాదాల పుట్టిన గంగ, ఆయన పాదాలు కడిగి తాను మొత్తం పావనమైపోయిన గంగ, ఆ పుణ్యజలాల ప్రవాహాలతో భారతం మొత్తాన్ని నిత్యపుణ్యావచనం చేస్తోంది. పంచభూత సమన్వితమైన ఈ సృష్టికి ప్రతీకగా ఆకాశలింగం (చిదంబరం), వాయులింగం (శ్రీకాళహస్తి), అగ్నిలింగం (అరుణాచలం), జలలింగం (జంబుకేశ్వరం), పృధ్వీలింగం (శ్రీశైలం) రూపంలో వెలసి తనకు, ఈ చరాచర సృష్టికీ అభేదభావాన్ని స్పష్టంచేశాడు భగవంతుడు. ఆ లింగాలతో ఈ దేశం కైలాసమే అయింది. ఇంకా కాశీ, రామేశ్వరం, పూరి, కేదారనాథ్, బదరీనాథ్ వంటి పవిత్ర క్షేత్రాలు, దేవాలయాలు, పుణ్యతీర్థాలు... భారతం సర్వం దేవతామయం. హిమాలయాలు, వింధ్య, మేరు... పర్వతాలే ధ్యానమూర్తులుగా తపోదీక్షలో మునిగిపోయిన దేశం ఇది. ఔను. ఇక్కడ నదులు, పర్వతాలు, ప్రకృతి ధ్యానం చేస్తాయి. సదా తపోనిష్ఠలో ఉంటాయి. పురుగును కూడా పుణ్యజీవిగా ఆరాధించే దేశం. ఇంతకంటే గొప్పదేశం ఎక్కడుంది? ముక్కులో కదలాడే గాలి ముక్కంటివరకు తీసుకువెళ్తుందనే రహస్యాన్ని కనుగొన్న దేశం. అప్రమేయుడైన పరమాత్మ మన ఆంతర్యంలో, పిడికెడంత హృదయమధ్యంలో విరాజమానుడై ఉన్నాడనే పరమసత్యాన్ని లోకానికి చాటిన దేశం. ఇదీ భారతదేశం!

బ్రాహ్మీముహూర్తం సాధనకు ఉపయుక్తమైన కాలం. భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన సమయం. చాలాదేశాల్లో ఆ సమయం నిద్రలేచేందుకు కాదు. కనీసం కదిలేందుక్కూడా వీలుకానంత శీతలత్వంతో ముణగదీసుకుని ఉంటుంది. అక్కడ నదీస్నానాలు, నదీతీర సాధనలు... ఊహకు కూడా అందని విషయం. మాఘస్నానాలు, ఏకాదశి, శివరాత్రుల పవిత్రస్నానాలు, పుష్కర పుణ్యస్నానాలు... భారతీయుల జీవితంలో మమేకమైన అంశాలు. మన జీవిత ప్రవాహాలు, నదీప్రవాహాలు సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. సూర్యభగవానుడు మన ప్రత్యక్షదైవం. సూర్యనమస్కారాలు చేయాలన్నా, గాయత్రి జపించాలన్నా, సంధ్యావందన విధులు నిర్వహించాలన్నా సూర్యదర్శనం కావాలి. ఆ దేశాల్లో ఆ సమయాల్లో ఏడీ సూర్యుడు? కొన్ని దేశాల్లో అయితే ఆరు నెలలు సూర్యుడే కనిపించడు. మరికొన్ని దేశాల్లో మధ్యాహ్నానికిగానీ ఆదిత్య దర్శనం కాదు. సాధనకేం కావాలో, ఏది అవసరమో పువ్వుల్లో పెట్టి అందించే దేశం ఇది. అజ్ఞానిని అనంతుని వరకు చేయిపట్టి నడిపించే గురువులు. సాధనకు అనుకూలమైన ఆశ్రమాలు, అరణ్యాలు, పాము పుట్టలు, పంచవటులు...! అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు పరమపద మార్గాన్ని వ్యాసపీఠంమీద పెట్టి అందించిన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఉద్గ్రంథాలు... ఎన్ని! ఎన్నని!

మనిషి రుషిగా జీవించేందుకు, ఆరుషిగా నిష్క్రమించేందుకు పెద్దపీట వేసిన భారతదేశం ఇది. రుషికానివాడు అద్వైతాన్ని అనుభూతించలేడు మరి. ఎంతో, మరెంతో, ఇంకెంతో, అంతులేనంత ఉంది భారతదేశ చరిత, ఘనత, విమలత. దీన్ని అర్థం చేసుకోవాలంటే- ఎంతో కొంత మనలో కూడా ఉండాలిమరి.

- చక్కిలం విజయలక్ష్మి