ᐅశాస్త్ర విధేయత



శాస్త్ర విధేయత 

గంగా శంతనులకు జన్మించినవాడు దేవవ్రతుడు. అతనే కాలాంతరంలో భీష్ముడిగా, సర్వ విద్యా విశారదుడిగా, సర్వ ధర్మజ్ఞుడిగా, మహారథుడిగా, కురుపితామహుడిగా ప్రఖ్యాతిచెందాడు. జీవితంలో ఒక్క క్షణమైనా సుఖపడలేదు. శాంతిని అనుభవించలేదు. యువరాజై రాజ్యాధికారాన్ని శాశ్వతంగా వదులుకోవలసి వచ్చింది. తమ కన్నవారు లేకపోయినా తన తమ్ముల మనవల్ని నూట అయిదుగురు రాకుమారులను పెంచవలసిన బాధ్యత ఆయనపై పడింది. వారిలో అయిదుగురు మాత్రమే ఆయన మాట వినేవారు. మిగతావారు ఆయన్ని స్వార్థానికి ఉపయోగించుకున్న అధర్మమూర్తులు, దుర్యోధనాదులు. వారికి ధర్మ ప్రబోధం చేసినా అంతా విఫలమైంది. ధర్మాధర్మ స్వరూపాల నడుమ భీషణ సంగ్రామం చెలరేగినప్పుడు అధర్మపరుల అన్నం తిన్న పాపానికి ధర్మపరులను ఎదిరించాడు. తనపై ప్రాణాలు తీసే బాణాలు వదిలినా, తాను పెంచిపోషించినవారిని నిర్జించడం ఆత్మహత్యా సదృశమని ఆయన భావించాడు. అంతిమ క్షణాల్లో అయినా ఆయన సుఖం పొందలేదు. బాణాలే శయ్యగా, తలగడగా అయ్యాయి. అదీ ఆయన అదృష్టం. పూర్వజన్మలో ఆయన అష్టవసువుల్లో పెద్దవాడిగా ఉండి, వసిష్ఠ మహర్షి పట్ల, ఆయనకు చెందిన నందినీ ధేనువు పట్ల చేసిన అపచారం ఫలితంగా పొందిన శాపం ఆజన్మాంతం కష్టపరంపరగా మారిందని చెబుతారు.
భీష్ముడికి శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడేనన్న అచంచల విశ్వాసం ఉంది. కృష్ణుడిలో విశ్వమంతటినీ ప్రత్యక్షంగా చూశాడు. శ్రీకృష్ణుడి తేజస్సును అనుక్షణం దర్శిస్తూనే ఉన్నాడు. సహనానికి ఫలితం శాంతి. అది పరమానంద రూపంలో ప్రాప్తిస్తుంది. చివరి క్షణంలో భీష్ముడు త్రికరణశుద్ధిగా స్తుతించడంతో శ్రీకృష్ణుడు సాక్షాత్కరించాడు.

భీష్ముడు రెండు అతిభయంకరమైన ప్రతిజ్ఞలు చేశాడు. ఒకటి- తన తండ్రి శంతన మహారాజుకు, సత్యవతికి పుట్టిన పుత్రుడికే రాజ్యం మొత్తం ధారాదత్తం అవుతుంది. రెండు- తన తండ్రికి సత్యవతి ద్వారా పుత్రుడు కలిగినా, ఒకవేళ తనకు వివాహమైన పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అసలు తాను వివాహమే చేసుకోను అని రెండు భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. తండ్రివల్ల ఇచ్ఛామరణ వరాన్ని పొంది ఆజన్మాంతం ప్రతిజ్ఞను నిలబెట్టుకున్న ఆదర్శ పుణ్యపురుషుడు, ధర్మవర్తనుడు కాబట్టి భీష్మాచార్యులు అయ్యాడు.

భీష్ముడు మనకు అందించిన విష్ణు సహస్రనామం భగవద్గీతకున్న మహత్యం కలిగి ఉందంటారు. గీతను బోధించిన కృష్ణుడు విష్ణు సహస్ర నామాన్ని స్వయంగా విన్నాడని మనం చదువుకున్నాం. ఎంతటి పండితుడైనా, ఎంత వినమ్రుడైనా మరొక పండితుని ప్రవచనాలు గొప్పవని అంగీకరించడు. శ్రీకృష్ణుడు అటువంటి విద్వన్మణి కాదు. భీష్ముడి బోధను ఆయన ఆసక్తితో ఆలకించాడు. చాలామంది రుషులు విన్నారు. భీష్ముడి మాటల్లో ప్రత్యేకత ఏమిటి? ఒక ఆధ్యాత్మిక గురువు అంతటి స్థానాన్ని ఆయన ఎలా పొందగలిగారు? ఆయన ఏనాడూ శాస్త్రాలనుఖండించలేదు. ప్రతిపనినీ శాస్త్రసమ్మతంగా చేశాడు. దీనికొక కథ చెబుతారు.

ఒకసారి భీష్ముడు తన తండ్రికి పితృకర్మ తలపెట్టాడు. పరమనిష్ఠతో పితృకర్మలు సమర్పిస్తున్న కుమారుడి శాస్త్రబద్ధతకు మురిసిన ఆయన తండ్రి శంతనుడు స్వయంగా పిండాన్ని అందుకోవడానికి దిగివచ్చాడు. పిండాన్ని తనకు ఇవ్వమని కుమారుడిని అడిగాడు. 'శాస్త్రాలు ఒప్పుకోనందున నేను పిండాన్ని నీ చేతుల్లో పెట్టలేను' అని భీష్ముడు అన్నాడు. పిండాలను భూమిమీదనే పెట్టాలని శాస్త్రాలు నియమాన్ని విధించాయి. భీష్ముడు ఏనాడూ శాస్త్రాలను ఉల్లంఘించలేదు.

భీష్ముడు రుషులకు సైతం ప్రబోధించడానికి తగిన అర్హత కలవాడైతే, ఆయన అంపశయ్య చేరేవరకు ఎందుకు నిరీక్షించారు? అప్పటిదాకా భీష్ముడు దుర్యోధనుడు పెట్టిన అన్నం తిన్నాడు. అందువల్ల ఆయన రక్తం కలుషితమైంది. అర్జునుడు ప్రయోగించిన అస్త్రాల వల్ల ఆ చెడు రక్తం బయటకు ప్రవహించింది. అప్పుడు ఆయన పవిత్రుడయ్యాడు. ఇతరులకు ప్రబోధించడానికి రెండింతల అర్హత సంపాదించాడు. తన ఆదర్శ ప్రవర్తనతో భీష్ముడు అందరి మన్ననలు పొందాడు. అందుకే శ్రీకృష్ణుడు సైతం ఆయన మాటలు శ్రద్ధగా విని మంత్రముగ్ధుడయ్యాడు.

మాఘశుద్ధ ఏకాదశి గొప్ప ఏకాదశ పర్వాల్లో ఒకటి. ఈ ఏకాదశికి ముందే వచ్చే అష్టమి నాడు భీష్మాచార్యుల వారు కైవల్యం పొందారు. ఆ పరమ భాగవతోత్తముణ్ని స్మరిస్తూ ఈ ఏకాదశికి భీష్ముని పేరు ఉంచారు. భీష్ముని చరిత్ర దివ్య మహోజ్జ్వలమైనది. ఆయనవల్ల అనేక ధర్మాలు తెలుసుకున్నాడు ధర్మరాజు. విష్ణుసహస్రం, భీష్మస్తవరాజం వంటి దివ్యస్తోత్ర మాణిక్యాలను అనుగ్రహించినది భీష్మాచార్యులే. ఈ ఏకాదశినాడు విష్ణుపూజ, ఉపవాసం, విష్ణుసహస్రనామ పారాయణం అత్యంత ఫలప్రదమని చెబుతారు.

- కె.యజ్ఞన్న