ᐅఎవరు గొప్ప?



ఎవరు గొప్ప? 

లోకంలో నిజమైన గొప్పవాణ్ని నిజమైన గొప్పవాడే గుర్తిస్తాడు. గొప్పతనాన్ని తమలో ఆపాదించుకున్న నీచులు నిజమైన గొప్పవాణ్ని గుర్తించరు. శివుడు త్రిలోకనాథుడు. సర్వేశ్వరుడు. అఖిలారాధ్యుడు. అతడు అంత గొప్పవాడు కనుకనే కళానిధి అయిన చంద్రుని గొప్పతనాన్ని గుర్తించి, తన తలపైకి ఎత్తుకొన్నాడు. అంత గొప్పవాడైన చంద్రుణ్ని దొంగతనంగా అమృతం తాగిన రాహువు మాత్రం కబళించాలనుకొన్నాడు. రాహువులోని కుటిలత్వమే గొప్పతనానికి విరోధమై అతణ్ని మింగేసే గ్రహంలా మార్చివేసింది. చంద్రునిలోని అమృతత్వాన్ని గ్రహించిన పరమేశ్వరుడు ఎప్పుడూ గొప్పవాడే. సకల లోకారాధ్యుడే.
పాపాన్ని పోగొట్టే నిర్మల జలవాహిని పుణ్యనది గంగ. చల్లని వెన్నెలలతో హృదయతాపాన్ని పోగొట్టేవాడు చంద్రుడు. అడిగినవన్నీ అనుగ్రహించడంద్వారా దైన్యాన్ని పోగొట్టేది కల్పవృక్షం. ఈ మూడువిధాలైన గుణాలను ఏకకాలంలో ప్రసాదించేవాడు సజ్జనుడు. కనుక అతడే గొప్పవాడు.

జననాన్ని ఉదయమనీ, మరణాన్ని అస్తమయమనీ వ్యవహరించడం లోకంలో పరిపాటి. సూర్యుడికి ప్రతిదినం ఉదయాస్తమయాలు సంభవిస్తుంటాయి. కానీ ఏనాడైనా సూర్యుడు ఉదయిస్తే పొంగిపోవడంకానీ, అస్తమిస్తే దిగులుపడటంకానీ చేస్తాడా? గొప్పవాడు కూడా సంపదల్లో పొంగిపోయి కన్నుమిన్ను కానకుండా ఉండడు. ఆపదలు వచ్చినప్పుడు ఏమాత్రం కుంగిపోకుండా ధైర్యంగా నిలబడతాడు. అందుకే గొప్పవాడు ఎప్పుడూ స్థితప్రజ్ఞుడేకానీ, చలస్వభావి కానేకాడనేది సత్యం.

కస్తూరీమృగానికి నాభిలోనే సహజంగా పరిమళద్రవ్యం అయిన 'కస్తూరి' ఉద్భవిస్తుంది. కృత్రిమంగా రూపొందిస్తే రాదు. అలాగే సజ్జనుల్లో సద్గుణాలు సహజంగానే ఏర్పడతాయి కానీ ఎవరో ఆపాదిస్తే రావు. సహజగుణ సౌందర్యం ఉన్నవాడే గొప్పవాడు.

గొప్ప మనస్సుగలవాడు పరిస్థితులు తారుమారు అయినప్పుడు ఇబ్బందులకు లోనై కిందపడినా, బంతిలా మళ్లీ పైకి ఎగురుతాడేగానీ నేలకు అతుక్కొని ఉండిపోడు. నీచుడు మాత్రం పతనమైతే మట్టిముద్దలా నేలలోనే కూరుకొనిపోతాడు. కనుక బంతిలా ఉండడానికి మానవుడు ప్రయత్నించాలేగానీ, మట్టిముద్దలా పడి ఉండాలని భావించకూడదు.

గొప్పవాడు ఎప్పుడూ ఏ పనిని అయినా చిన్నగానే ప్రారంభించి, క్రమంగా 'ఇంతింతై వటుడింతయై' అన్నట్లు ఎదుగుతూ- మొదట వామనుడివలె ఉండి, చివరికి త్రివిక్రముడై విశ్వమంతా వ్యాపిస్తాడు. నీచుడు మాత్రం అట్టహాసాలతో, ఆర్భాటాలతో గొప్పలకుపోయి అరుపులతో ప్రారంభించి, చివరికి చతికిలపడతాడు.

ఇతరులకు నీతులను ఉపదేశించే పాండిత్యం ఎంతైనా ఉండవచ్చు. ఆ ఉపదేశించే విషయాలను తాము ముందు ఆచరించాలని చాలామంది అనుకోరు. నిజంగా గొప్పవాడు మాత్రం తాను ఆచరించే నీతులనే ఇతరులకు చెప్పాలనీ, ఇతరులకు చెప్పినవన్నీ తాను కూడా ఆచరించాలనీ దృఢంగా భావిస్తాడు.

విషాన్ని ఎదుటివాళ్లమీద ఎగజిమ్మి, తాను ఆనందించేవాడు గొప్పవాడెలా అవుతాడు? ఎన్నటికీ కానేకాడు. నిజమైన గొప్పవాడంటే పరమశివుడే. విషాన్ని కంఠంలో దాచుకొని, లోకానికి అనుగ్రహామృతాన్ని పంచుతున్నాడు. అందువల్ల గొప్పవాడు శివునిలా ఉండాలి.

సంపదలుకానీ, ఆపదలుకానీ గొప్పవాడికే లభిస్తాయి. అల్పులకు అంతగా లభించవు. అయినా గొప్పవాడు తొణకడు, బెణకడు. వృద్ధిక్షయాలు చంద్రునికేగానీ, నక్షత్రాలకు సంభవించవు కదా! కృష్ణపక్షంలో క్షీణించిపోయే చంద్రుడు తన క్షీణతకు ఎంతమాత్రం బాధపడడు. శుక్లపక్షం రాగానే రోజుకొక్క కళతో వృద్ధి చెందుతాడు. చంద్రునిలాంటి స్వభావాన్ని అలవరచుకొన్నవాడే గొప్పవాడు.

గొప్పతనం అనేది డబ్బుతో కొనేది కాదు. ఒకరు ఇచ్చేది అంతకంటే కాదు. సత్ప్రవర్తనద్వారా, సదాశయాల ద్వారా కృషితో సాధించవలసిన అమూల్య విషయం. ఎవరికి వారు తామే గొప్పవారమని అనుకుంటూ ఉంటారు కానీ ఇతరులు ప్రశంసించినా నిర్లిప్తంగా ఉంటూ, సమభావంతో ముందుకు సాగేవాడే గొప్పవాడు.

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ