ᐅఆనందాన్వేషణ
బజారులో కనిపించే ప్రతి వస్తువును కొనాలనిపిస్తుంది. ఎన్ని కొన్నా తృప్తితీరదు. కాని, తనకంటూ ఏమీ దాచుకోనివాడే నిజమైన ఆనందం కలిగిన వ్యక్తి. అంటే- దాని అర్థం, వస్తువుల్ని ఉపయోగించకూడదనికానీ, కొనరాదనికానీ కాదు. తన చేతికి అందినప్పుడు వాటిని వాడుకోవచ్చు. అవి తనవి కావని, దైవానికి చెందినవని, ఏ కారణంగా వాటిని కోల్పోయినా దుఃఖించకూడదని తెలుసుకోవాలి. అటువంటి వ్యక్తి ఆ వస్తువులున్నా లేకపోయినా సంతోషంగా ఉండగలుగుతాడు.
భగవంతుని కరుణతో బహూకృతిగా అన్నీ లభిస్తాయి. అవి లేని నిరామయస్థితినీ ఆనందించాలి. వస్తువులపై యాజమాన్యపు హక్కు ఉందని భావించినప్పుడు, ఆ వస్తువులను వదులుకోలేం. వాటికి బానిస అవుతాం. కాలప్రవాహంలో వస్తువులు, ఆస్తులు, బంధువులు, స్నేహితులు వస్తూపోతుండటం సహజం. ఉన్నప్పుడు ఆనందించి, అవి దూరమైతే వాటికోసం బాధపడుతూ కూర్చోవడం వివేకవంతుని లక్షణం కాదు.
సత్యం వెలుగులో జీవించడమే అసలు ఆనందం. అనంతమైన దివ్యత్వంతో నిత్యం సంబంధం కలిగి ఉండాలి. సత్యప్రదీప్తమైన జీవితం జీవించాలి. మనల్ని ఏనాటికీ నిరాశపరచని కాంతిలో నడవాలి. ఆనందం అంటే స్వేచ్ఛ. భగవత్ సంకల్పంతో సాయుజ్యం చెందిన స్వేచ్ఛ అది.
భూమి మీద వస్తువులేవీ మనవి కావు అన్న భావన, మనలో భాసించినప్పుడు, మనం విశ్వమంత విశాలంగా ఎదిగిపోతాం.
ఓ నిరుపేద యోగి ఒక పర్ణశాలలో జీవిస్తున్నాడు. ఒక దొంగ రాత్రివేళ ఆ పర్ణశాలలో ప్రవేశించి ఆ యోగికి చెందిన కొద్దిపాటి వస్తువుల్ని అపహరించి వెళ్లబోతుండగా, యోగి నిద్రలేచాడు. దొంగ భయపడి ఆ వస్తువుల్ని అక్కడే పడవేసి పరుగు తీశాడు. యోగి ఆ వస్తువుల్ని ఏరి దొంగ వెనక పరుగుతీశాడు. చివరికి దొంగను పట్టుకుని 'ఈ వస్తువులన్నీ నీవే తీసుకో. నువ్వు ఆ నారాయణుడివే. ఈ వస్తువులు నీవే!' అని అన్నాడు. దొంగ తెల్లబోయాడు.
తరవాత చాలా సంవత్సరాలకు ఒక స్వామీజీ హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు జ్ఞానంతో వెలుగులీనుతున్న ఒక సాధువును గమనించాడు. స్వామీజీ ఆ సాధువుతో మాట్లాడాడు. అతను జ్ఞానసంపన్నుడని గ్రహించాడు. మాటల సందర్భంలో ఆ సాధువు 'నేను ఒకసారి ఒక యోగి ఇంటిలో దొంగతనం చేయడానికి ప్రయత్నించాను. తనకు చెందినవన్నీ ఆ యోగి నాకు ఇస్తూ నన్ను 'నారాయణ' అని సంబోధించాడు. నాకు ఆనాడు జ్ఞానోదయమైంది. నేనెంతటి నీచుడినో, ఎంత ఘోరమైన నేరం చేశానో గ్రహించాను. అప్పటినుంచి భౌతిక సంపదల్ని విడనాడి, నిత్యమైన ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని అన్వేషించసాగాను' అని స్వామీజీతో చెప్పాడు. సత్యం, జ్ఞానం ఏనాడూ దుఃఖాన్ని ఇవ్వవు. మన జీవితాలను పునీతం చేసే ఆనంద అమృతధారలవి!
- కె.యజ్ఞన్న