ᐅమహాత్ముల మనసు
నిజమైన మహాత్ములు నిరాడంబరులు, నిర్వికల్పులై ఉంటారు. సిరిసంపదలతో, భౌతిక సుఖాలతో వారికి పనిలేదు. ఏ లోభమూ వారిని లొంగదీయలేదు.
తమ నగర సమీప ప్రాంతంలో ఒక గొప్ప తపస్సంపన్నుడున్నాడని, ఆయన మహామహిమాన్వితుడనీ రాజుగారు విన్నారు. అనుచరుల్ని, అమాత్యులను వెంటబెట్టుకొని, అశ్వారూఢుడై ఆ మహాత్ముడి సమీపానికి వెళ్లాడు రాజు. ఆ యోగిపుంగవుడి దివ్యతేజస్సు చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఆయన నిశ్చలంగా, కన్నులు మూసుకొని ధ్యాననిష్ఠలో ఉన్నాడు. తన రాకను ఆయన గమనించలేదేమోనని రాజు చిన్నగా దగ్గాడు. ముని చలించలేదు. 'మహాత్మా... తమరి దర్శనార్థం వచ్చాను. మీ కరుణాలేశం నాపై ప్రసరిస్తే, కోరికలన్నీ ఈడేరతాయి అనే ఆశతో ఇక్కడికి వచ్చాను' అన్నాడు రాజు. ముని కనుగుడ్త్డెనా కదల్లేదు. ఆ ముని నిష్ఠాగరిష్ఠత చూసి రాజుకు ఆయనపై మరింత భక్తివిశ్వాసాలు కలిగాయి. వెంటనే భటులను పిలిచి, ఆ మునీశ్వరుడికి ఎండవలనగానీ, వానవలనగానీ ఎట్టి బాధా కలగకుండా పెద్ద మందిరం నిర్మింపజేయమని ఆజ్ఞాపించాడు. అనతికాలంలోనే దివ్యసౌందర్య మందిరం మహామునిచుట్టూ నిర్మితమైంది.
కొంతకాలం తరవాత ఆ మహాత్ముడు ఇహలోకంలోకి వచ్చి కన్నులు తెరిచాడు. ఈ సంగతి తెలిసి మహారాజు పరుగు పరుగున వచ్చి ఆయన పాదాలమీద పడ్డాడు. 'స్వామీ! మీవంటి మహాత్ములకు ఎండా వానా తగలకూడదని ఈ మహామందిరాన్ని నిర్మించాను. నా వాంఛితం ఈడేరుస్తారని ఆశతో ఉన్నాను. నాకు అపార సిరిసంపదలు ప్రసాదించమని వేడుకుంటున్నాను' అని రాజు ప్రార్థించాడు.
ఆ మునీశ్వరుడు తన చుట్టూ నిర్మించిన సుందరమందిరాన్ని నిర్లిప్తంగా పరికించాడు. మంద్రస్వరంతో ఇలా పలికాడు. 'నాయనా! ఈ మందిరం లేనప్పుడు నేను పొందిన బాధ ఏదీలేదు. దీన్ని నిర్మించిన తరవాత నేను పొందిన సౌఖ్యమూ లేదు. దీన్ని నిర్మించిన సంగతీ నాకు పట్టలేదు. ఈశ్వర ధ్యానమే నాకు పరమానందకరం. సర్వ సంపదలనూ అసహ్యించుకొని ఇక్కడకు వచ్చి తపస్సు చేస్తున్న నేను నీకు మరలా వాటినే ఎలా ప్రసాదిస్తాను? ఇక నేను ఇక్కడ ఉండటం తగదు!' అని వెంటనే ఆ మహాత్ముడు అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన నిర్లిప్తతకు, నిర్మోహత్వానికి, ధ్యాననిష్ఠకు రాజు ఆశ్చర్యపోయాడు.
మహాత్ములకు దివ్యశక్తులుంటాయనీ, వారి దర్శనంచేత, స్పర్శనంచేత వ్యాధులు తగ్గుతాయని, కష్టాలు తొలగిపోతాయని, సిరిసంపదలు అబ్బుతాయని అనాదిగా అన్ని దేశాల్లో ప్రజలు కథలు కథలుగా చెప్పుకొంటూనే ఉన్నారు. నిజానికి మహాత్ములు మాత్రం తమ గురించి ప్రజలు గొప్పగా భావించాలనీ, వారికి తమ శక్తులు ప్రదర్శించి చూపాలనీ అనుకోరు. పరమేశ్వర ధ్యానంతో, అలలు లేని కొలనువలె వారి మనసు నిశ్చలంగా, నిర్మలంగా ఉంటుంది. భౌతిక విషయాల వైపు వారి మనసు పోనే పోదు!
ఒకరోజు అక్బర్ తాన్‌సేన్ సంగీతం విని 'నీ గానం అసమానం' అని ప్రశంసించాడు. 'నా గురుదేవుల భిక్ష' అన్నాడు తాన్‌సేన్. 'నీ గురువెవరు?' అని ప్రశ్నించాడు అక్బర్. 'సంత్ హరిదాస్ నా గురుదేవుడు' అని తాన్‌సేన్ చెప్పగా, 'అయితే ఆయన్ని మన ఆస్థానానికి పిలువు' అన్నాడు అక్బర్. 'మా గురువులు బృందావనాన్ని వీడి రారు, మనమే అక్కడకు వెళ్ళాలి!' అని తాన్‌సేన్ చెప్పగా, 'సరే' అని తాన్‌సేన్‌ని వెంటబెట్టుకొని అక్బర్ బృందావనం చేరాడు.
అక్కడ తోటలో కూర్చుని రాళ్ళు కూడా కరిగే విధంగా హరిదాస్ పాడుతూ ఉండగా, విని అక్బర్ పరవశించిపోయాడు. 'నిజమే... తాన్‌సేన్!! నీ సంగీతాన్ని మించి ఉంది మీ గురువులది... ఈ తేడా ఎందువల్ల వచ్చింది?' అని అడిగాడు అక్బర్.
'నేను పాడేది ఢిల్లీశ్వరుని గురించి... మా గురువుగారు పాడేది జగదీశ్వరుని గురించి....' అని జవాబిచ్చాడు తాన్‌సేన్. మాటలోను, పాటలోను, మనసులోను పరమేశ్వరుడుండటమే సంత్ హరిదాస్ గానమాధుర్యానికి కారణమని అక్బర్ గ్రహించాడు.
- పి.భారతి