ᐅకర్మయోగులు




కర్మయోగులు 

భూమిపైన కోటానుకోట్ల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం ఒక వరం. కర్మ చేయటమే కాదు, అది ఆరంభించటానికి ముందు ఆలోచించి, తెలివిగా చేసే అవకాశం మనిషికి మాత్రమే సాధ్యం. మిగతా జీవరాశులు తమతమ ప్రకృతి ధర్మాలనుబట్టి పని చేసుకుపోతూ ఉంటాయి. ఆహారం, నిద్ర, మైధునం, భయం- ఈ నాలుగూ అన్ని జీవరాశులకు సమానం. ఆలోచించి అడుగు ముందుకు వేయగల జీవి మనిషి ఒక్కడే. పూర్వాపరాలు బేరీజు వేసుకుని ప్రతి మనిషీ తన పని తాను సక్రమంగా చేయగలిగితే, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. వృక్ష, జంతు, మానవ సమాజాలను రక్షించవలసిన బాధ్యతను సృష్టి ఈ మనిషి ద్వారానే నిర్వహిస్తోంది.
కర్మ అంటే పని చేయటం. అందుకోసం అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు- ఈ పదింటినీ అదుపు చేసి ముందుకు సాగటానికి మనసును ప్రకృతి ప్రసాదించింది. చెవులతో వినగలడు, చర్మం ద్వారా స్పర్శ తెలుసుకోగలడు, కళ్ల ద్వారా చూడగలడు, నాలుక ఉపయోగించి రుచి తెలుసుకోగలడు, ముక్కుతో వాసన గ్రహించగలడు. మంచి చెడ్డలు విశ్లేషించుకుని, కర్మేంద్రియాల సహాయంతో పనులు చక్కబెట్టుకోవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిది; ఇచ్చిపుచ్చుకోవటానికి చేతులున్నాయి. ముందు వెనకలు చూసుకొని కదలటానికి కాళ్లున్నాయి. ఇన్ని హంగులు కలిగి ఉండటంవల్ల కర్మ చేయటానికి మనిషికి మూడు మార్గాలున్నాయి. శరీరంతో, మనసుతో, నోటితో ఏ పనైనా చక్కబెట్టగలడు.

కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. జీవన యాత్ర కొనసాగించటానికి తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలి. ఈ విహితకర్మను అవసరాల మేరకే చేపట్టాలి. దురాశకు పాల్పడి ఇతర జీవులకు హాని కలిగించకపోతే చాలు. రెండోది అకర్మ. మొదటిది ప్రవృత్తి ధర్మం, ఈ రెండోది నివృత్తిధర్మం. జనన మరణచక్రంనుంచి శాశ్వతంగా బయటపడటానికి చేయదగ్గ పనుల్ని అకర్మ అంటారు. దానధర్మాలు, యజ్ఞయాగాలు లాంటివి చేపట్టడంవల్ల లోకకల్యాణం జరుగుతుందంటారు. అందుకే అందరూ ఒకే కుటుంబంగా ఐకమత్యంతో సుఖంగా జీవించాలంటున్నది శాస్త్రం. లోకాస్సమస్తా సుఖినోభవంతు.

మూడోది వికర్మ- ఏది చేయకూడదో అది. అదేమిటో శాస్త్రమే చెబుతున్నది. ఒక్కముక్కలో చెప్పాలంటే- ఏ పని చేయటంవల్ల మనకు దుఃఖం కలుగుతుందో, అలాంటిది ఎదుటివాళ్లకు చేయకూడదు. అలా చేస్తే, దానివల్ల రాబోయే ఫలితం ఏమిటో చివరకు మనమే అనుభవిస్తాం. చేసే ప్రతి పనికీ ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచిపని చేస్తే మంచి ఫలితం, చేయకూడనిది చేస్తే చెడు ఫలితం దక్కుతాయి. మంచి పనులు ఫలించి మనల్ని ముందుకు నడిపిస్తాయి. చెడుపనులు వికటించి మనల్ని అగాధంలో పడదోస్తాయి.

ఉదయమే మేత కోసం ఆలమందను అడవికి తోలుతారు. దినమంతా ఆవులు ఒకచోట, లేగలు మరొక చోట మేస్తాయి. చీకటి పడగానే మంద ఊరివైపు బయలుదేరుతుంది. గోధూళి. ఆ మసక వెలుతురులో, దూరంగా మేస్తున్న లేగ పరుగెత్తుకువచ్చి తన తల్లి వెనకాలే తరలి వస్తుంది. ఆ మందలో తల్లిని ఎంత బాగా గుర్తుపట్టి వెన్నాడుతుందో అలాగే కర్మఫలం కూడా వెతికి పట్టుకోగలదన్నది పెద్దల మాట. కర్మజీవిగా పుట్టిన మనిషి కర్మచక్రంనుంచి బయట పడటానికి వీలైన పద్ధతిని ఆ పరమాత్మ తానే చెప్పాడు. 'ఫలితం గురించి ఆలోచించకుండా చిత్తశుద్ధితో కర్మ చెయ్యాలి. దాని ఫలితం నాకు వదిలేసెయ్'. ఎవరైతే తమవంతు పనులు అలా అలా చేసుకుని వెళ్తారో వాళ్లూ- అసలైన మనుషులు. కర్మయోగులంటే వారే!

- వి.రాఘవేంద్రరావు