ᐅధర్మవర్తన




ధర్మవర్తన 

సనాతనమైనది భారతీయత! భారతదేశం తొలినుంచీ కర్మభూమిగా వెలుగొంది సత్యానికి, ధర్మానికి పెద్దపీట వేసింది. 'సత్యం వద,' 'ధర్మం చర' అన్న వాక్యాలు భారత ప్రజల జీవన స్రవంతిలో శిరోధార్యమై వెలుగొందుతూ తమ గొప్పదనాన్ని యుగయుగాలుగా చాటుతూనే ఉన్నాయి.
త్రేతాయుగంలో పరమ శివభక్తుడైన రావణాసురుడు శ్రీరాముడి ధర్మపత్ని అయిన సీతను చెరబట్టాడు. ఆమెను అపహరించుకురావడం ధర్మవిరుద్ధం. అది లంకానగరానికి, రావణాసురుడి వినాశనానికి హేతువవుతుందని పెద్దలు, సోదరులు చెప్పినా వినిపించుకోలేదు. శ్రీరామచంద్రుడి పరాక్రమానికి, శౌర్య శౌండీర్యానికి, లంకలోని రాక్షసులందరూ హతులయ్యారు. దశకంఠుడూ నేలకొరిగాడు. ధర్మవిరుద్ధ కార్యానికి పాల్పడినందుకు రావణుడేగాక, అతని అనుచరులూ తగిన మూల్యమే చెల్లించుకున్నారు. అధర్మంగా నడవడం ఎంత తప్పో, అధర్మ వర్తనుడి సాహచర్యం కూడా అంతే ముప్పని మనకు రామాయణం తెలుపుతోంది. రావణుడి ప్రవర్తనను, చేస్తున్న పనులను విభీషణుడు నిరసించాడు. రామరావణ యుద్ధానికి ముందే సోదరుణ్ని విడనాడి రాముని చెంత చేరాడు. తదనంతర కాలంలో లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ దృష్టాంతం- ధర్మవర్తనులుగా ఉండటం ముఖ్యమని ప్రబోధిస్తూనే, దుష్కర్మలు చేసేవారి చెంతనుండటం వివేకవంతుల లక్షణం కాదని తెలియజేస్తుంది.

ధర్మాన్ని పాటించడం అత్యంత ఆవశ్యకమని ఎన్నో చక్కటి ఉదాహరణలతో తెలియజేస్తుంది మహాభారతం! ముఖ్యంగా మనం గుర్తుంచుకోదగిన పాత్రలు- ధర్మరాజు, దుర్యోధనుడు. ధర్మరాజు ధర్మనిరతికీ, శ్రేయోగుణానికీ ప్రతీకగా, దుర్యోధనుడు దుష్ట ఆలోచనలకూ దుర్నీతికీ ఉదాహరణగా మనకు సాక్షాత్కరిస్తారు. ధర్మరాజు తాను ధర్మాన్ని ఆచరించటమేగాక, బాహు పరాక్రమాల్లో సాటిలేని వారైన భీమార్జునులను సైతం ఆ మార్గంలో నడపడం భారతమంతా కనిపిస్తుంది. సోదరుల బలాతిశయాన్ని ప్రశంసిస్తూనే, ధర్మానికి కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని, ఔచిత్యాన్ని ధర్మనందనుడు పదేపదే నొక్కి చెప్పడం అనేకచోట్ల దర్శనమిస్తుంది.

ధర్మాన్ని, సత్యాన్ని కాపాడాలి. అవి అధర్మం ముందు, అసత్యం ముందు వెలాతెలాపోతే సమాజానికి ఎంతో కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. అది జాతి హితానికే ప్రమాదకరం.

ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం- పాపం, అబద్ధం కారణంగా దరిచేరలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే ప్రయత్నం చేయటం ఉత్తముల లక్షణమని భారతం చెబుతోంది. అంతేకాదు, ధర్మవర్తనలో ఉపేక్షించి నిరాసక్తంగా ఉంటే, వారిని నది తన ఒడ్డున పుట్టిన చెట్లను ప్రవాహంతో పెకలించి వేసినట్లుగా, ధర్మం వారిని నిర్మూలిస్తుందనే అద్భుత సత్యాన్ని చరిత్ర పదేపదే నిరూపించింది. ధర్మవర్తనులై ఉండటం, అధర్మం జరుగుతున్నప్పుడు దాన్ని నిరసించటం సకల శుభదాయకం. సదా శ్రేయోదాయకం!

- వెంకట్ గరికపాటి