ᐅసిలువపై సప్త సందేశాలు
ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే ఒక బోధకుడు కాలినడకన వూరికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో అడవి. పట్టపగలే అయినా ఎక్కడా నరసంచారం లేదు. భక్తిగీతాలు పాడుకుంటూ అడుగులు వేస్తున్న అతడికి 'ఆగు!' అనే కేక వినిపించడంతో వెనక్కు తిరిగాడు. అతడి వెనక గుర్రం మీద వస్తున్న ఒక బందిపోటు. ఆ వ్యక్తి గుర్రం దిగి తన నడుముకు తగిలించిన కత్తి తీసి ఆ బోధకుణ్ని భయపెడుతూ 'నీ దగ్గరున్న డబ్బంతా ఇవ్వు...' అన్నాడు. ఆ మాటలకు బోధకుడు ఏమీ చలించకుండా చిరునవ్వుతో 'స్నేహితుడా! నువ్వింత కష్టపడి దారిదోపిడులు సాగిస్తూ పాదచారులనుంచి సంపదను దోచుకుంటున్నావ్, ఇదంతా ఎవరికోసం?!' అన్నాడు.
'నా భార్య, ఎదిగిన ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులు, వీరంతా సుఖంగా జీవించేందుకు ఈ దోపిడి సాగిస్తున్నాను...' అన్నాడు బందిపోటు. 'నీ ప్రాణాలకు తెగించి ఇలా దోపిడి చేస్తున్నావు... నువ్వు ఈ విధంగా మూటగట్టుకుంటున్న పాపభారాన్ని నీవాళ్లు మొయ్యగలరా...' అన్నాడు బోధకుడు.
ఆ మాటలకు అవాక్కయిన బందిపోటు వేగంగా అక్కడినుంచి కదిలాడు. బోధకుడు తన ప్రయాణం కొనసాగించాడు. కొద్దిసేపటి తరవాత ఆ అడవి మార్గంలోనే ఇంకా నడుస్తున్న బోధకుడికి గుర్రపుడెక్కల శబ్దం వినిపించింది. వెనక్కు తిరిగాడు. గుర్రంమీదనుంచి దిగివచ్చిన బందిపోటు అతడికి ఎదురుగా నిలబడి తలొంచుకున్నాడు. అతడి కళ్ళల్లో నీళ్లు. 'మీరన్నది నిజమే... నేనిప్పుడే నా వాళ్ళను కనుక్కున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ప్రాణాంతకమైన దోపిడి వృత్తిని సాగిస్తున్నా... నా కోసం వాళ్ళు ఏ త్యాగానికీ సిద్ధంగా లేరు. ఈ లోకంలోనే కాదు, పైలోకంలోనూ నా పాపఫలితాన్ని భరించేందుకు ఒప్పుకోవడం లేదు...' అన్నాడు దుఃఖపడుతూ. అందుకు ఆ బోధకుడు, 'దిగులుపడకు, నీ నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా నీ పాపభారాన్ని తనపై వేసుకున్న పరమ ప్రభువు గురించి నీకు తెలుసా?' అన్నాడు.
'ఎవరా మహానుభావుడు?' అన్నాడా బందిపోటు.
వెంటనే బోధకుడు- సమస్తజనుల పాపభారాన్ని మోయడానికి సిలువపై మరణించిన క్రీస్తు ప్రభువు బలియాగం గురించి బోధించాడు. యేసు ప్రభువు సిలువపై పరమపదించిన పవిత్రమైన రోజు శుభ శుక్రవారం. ఆయన తిరిగి లేచిన మూడోరోజుగా ఈస్టరు పర్వదినాన్ని భావిస్తారు.
ఇశ్రాయేలీయులు తమ నాలుగువందల ఏళ్ళ బానిస బతుకు నుంచి విముక్తి లభించినందుకు 'పస్కా' అనే పండుగ జరుపుకొనేవారని బైబిలు చెబుతోంది. ఆ పండుగలో ప్రతీ ఇంటి నుంచి ఒక గొర్రెపిల్లను బలి ఇచ్చేవారు. బలికి ఇచ్చే గొర్రెపిల్ల శుద్ధమైనదిగా, దోషరహితంగా ఉండాలి. అలా సమస్త మానవాళిని వారి పాపాలనుంచి విముక్తులను చేసే పరమ ప్రభువైన క్రీస్తు పాపరహితుడిగా, పరిశుద్ధుడిగా సిలువ ఎక్కాడు. సిలువపై వేలాడదీసినప్పుడు ఆయన చెప్పిన ఏడు మాటలు అజరామరంగా నిలిచిపోయే దివ్యమైన సందేశాలు.
తనను సిలువపై మేకులతో కొట్టి వేలాడదీసి, ఎంతో హింస పెట్టినవారిని సైతం క్షమించమంటూ-
'తండ్రీ... వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు' అనేది సిలువపై నుంచి ఆయన మాట్లాడిన మొదటి మాట.
తనతోపాటు సిలువ శిక్షకు గురైన ఒక దొంగ కనబరచిన విశ్వాసంతో ఆయన, 'నేడు నీవు కూడా నాతో పరలోక రాజ్యంలో ఉంటావు' అని చెప్పిన మాట రెండోది.
తన తల్లిని శిష్యులకు అప్పగిస్తూ 'అమ్మా ఇదిగో నీ కుమారుడు... సహోదరా! ఇదిగో నీ తల్లి' అన్నది మూడో మాట.
తన తండ్రి ఆజ్ఞానుసారం సిలువపై బలియాగమై పడుతున్న శ్రమలను భరిస్తూ, 'నా దేవా, నా దేవా నన్నేల చేయి విడిచితివి' అని పలికిన మాట నాలుగోది.
ఆత్మల రక్షణ నిమిత్తం, దాహార్తుడనై ఉన్నాననే అర్థంతో, 'నేను దాహం గొనుచున్నాను' అని సిలువపై పలికిన మాట అయిదోది.
తండ్రి తనకు అప్పగించిన ఆ మహాయజ్ఞాన్ని పూర్తిచేస్తూ ఆయన పలికిన ఆరోమాట 'సమాప్తమైనది'
సిలువపై పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ, మానవాళి పాప పరిహారార్థం చనిపోతూ ఆయన చెప్పిన ఏడో మాట, 'తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను'
ఈ ఏడు మాటలూ సిలువపై నుంచి యేసు మానవాళికి అందించిన సప్తసందేశాలు. ఈ మాటల వలన మనకు ఏం అర్థం అవుతుంది?! హింసించినవారిని సైతం క్షమించిన ఆయన కరుణ మనకు కనబడుతుంది. తనపై నమ్మకం, విశ్వాసం ఉంచిన దొంగను సైతం ఆయన తన అక్కున చేర్చుకున్న విషయం అవగతమవుతుంది. వృద్ధురాలైన తల్లిని తన శిష్యులకు అప్పగించడంలో, ఆయనకు ఆమెపై ఉన్న అవ్యాజ ప్రేమ మనకు తెలుస్తుంది. అలాగే ప్రతి కొడుకూ తండ్రి అప్పగించిన బాధ్యత నెరవేర్చాలని ఆయన సూచనప్రాయంగా పలికిన ఆరోమాటలో తెలియజేస్తాడు.
ఇలా సప్త సందేశాలు అందరూ ఆచరించదగ్గ, అనుసరణీయమార్గాలు. వీటిని అనుసరించే ప్రతి వ్యక్తీ ప్రేమ, కరుణ, క్షమ మూర్తీభవించిన క్రీస్తు ప్రభువులా పునరుత్థానం చెందుతాడనేది శుభశుక్రవార పర్వదినం అందించే శుభ సందేశం.
- డాక్టర్ ఎమ్.సుగుణరావు