ᐅమీలాదున్నబి




మీలాదున్నబి 

మానవుల మనోమాలిన్యాన్ని కడిగి వారిని నీతిమంతులుగా, మనీషులుగా రూపుదిద్దడానికి తన జీవిత సర్వస్వాన్ని అర్పించినవారిని భూమిపై అగ్రశ్రేణికి చెందినవారిగా పరిగణిస్తారు. సామాజిక రుగ్మతల్ని ఛేదించగల వైద్యుడతడు. సర్వప్రాణి కోటిపట్ల ప్రేమానురాగాల్ని పెంపొందింపజేసి లోకహితం కోసం తనకెదురైన కొండంత కష్టాన్ని దాటగల అసమాన ధీరుడు. చిరునవ్వు చిలికించే ఆనందభావ సముపేతుడు. ఓ అనాథ బాలుడిగా అతడు జీవితం ప్రారంభించి బహిష్కృత శరణార్థి అయి తత్త్వవేత్తగా, సర్వసత్తాక ప్రభువుగా ఎదిగితే- పుడమిపై అంతకు మించిన ఆశ్చర్యం ఏముంది? ఆయనే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సత్యం, సదాచారాల పరిపూర్ణరూపం. మూర్తీభవించిన కారుణ్యం. దేవుని అంతిమ దూత. దైవ సందేశహరుడు. ఇంకా- ఆయన పవిత్ర ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆచరణలు, ఘనకార్యాలు- అన్నీ ఆయన దైవదౌత్యానికి నిదర్శనాలు.
ముహమ్మద్ ప్రవక్త రబీ ఉల్ అవ్వల్ మాసం 12 తేదీ (క్రీ.శ. 571 ఏప్రిల్ 20)న మక్కాలో జన్మించారు. మీలాద్ అంటే జన్మదినం. నబీ అంటే ప్రవక్త. మీలాద్-ఉన్-నబి అంటే ప్రవక్త జన్మదినం. ముస్లిములు మీలాదున్నబిని సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ప్రవక్త పుట్టక ముందే తండ్రి అబ్దుల్లా గతించడం, పుట్టిన ఆరేళ్లకు తల్లి అమీనా సైతం అసువులు కోల్పోవడంవల్ల ఆయన జీవితం విషాద భరితం అయింది. అన్ని కష్టాల్ని, అవరోధాల్ని ఛేదించుకొని మానవలోక మహోపకారం కోసం ప్రవక్త జీవితం గడిపారు.

ఆయన పుట్టిన అరబ్ దేశం ఆ సమయంలో సకల దురాచారాలకు ఆలవాలమైంది. మూఢ భావాలు, మూర్ఖ విశ్వాసాలు ప్రబలిపోయాయి. సమాజం చెడును మంచిగా, మంచిని చెడుగా పరిగణించింది. అశాంతి, అలజడి, దౌర్జన్యం, దురాగతం వంటి క్రూర భావాలు రెక్కలు విప్పుకొన్నాయి. ఏ మానవుడికైనా పుట్టుక వల్ల, కులం వల్ల, కుటుంబం వల్ల లేదా ధనం, అధికారం వంటి వాటివల్ల ఏ ఘనతా దక్కదని ప్రవక్త అనేవారు. బీదలు, బానిసల్లో హేతుబద్ధ ఆలోచన మెరిసింది. ఇన్నాళ్లూ తమను వెంటాడిన భీతిని తొలగించుకొన్నారు. ప్రవక్త మాటలు, బోధనలు స్వార్థపరులకు, పెత్తందారులకు సహించరాని వ్యధ, భరించలేని నష్టం కలిగించాయి. ఈ కారణంగా ప్రవక్తకు శత్రువు లేర్పడ్డారు. క్రీ.శ. 622వ సంవత్సరం యస్‌రబ్ పట్టణానికి ఆయన వలస వెళ్లారు. ఇదే ఇస్లామ్ శకారంభ సంవత్సరం. మక్కాలోని విరోధులు ప్రవక్తను, ఇస్లామ్‌ను పుడమి వీడేలా చేయాలని ఆయనపై పలు విధాల దాడి చేశారు. మంచిని గ్రహించని శత్రువుల వల్ల యుద్ధాలు జరగడం అనివార్యమైంది. విజయ పరంపరలు ప్రవక్త వశమయ్యాయి. రణభూమికే ఆయన మానవత్వం నేర్పారు.

మక్కాను జయించక ముందు అక్కడి శత్రువులు ప్రవక్త అనుయాయుల్ని తీవ్ర బాధలకు గురిచేశారు. ఆయన 200 మైళ్ల దూరం వలస వెళ్లారు. అయినా వదలకుండా నిరంతరం విరోధులు వేధించారు. ఆ మహానగరం తన పాదాల కింద చేరింది. తాను శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. కాని ప్రవక్త హృదయం ప్రేమానురాగాలతో కరుణ, అనుగ్రహాలతో నిండింది. ఆయన శత్రువులతో అన్నారు- మీపై ఎలాంటి ప్రతీకారం ఉండదు. నిందలేదు. మీ అందరికి విముక్తి కలగజేశామంటూ క్షమా సౌరభాన్ని వెదజల్లారు. ప్రవక్త సమకాలీనులు, మిత్రులు, శత్రువులు ఆయనలోని సమున్నత గుణాల్ని గుర్తించారు. అరేబియా స్థితిగతుల్ని ప్రవక్త మార్చారు. సుస్థిర శాంతి పరిఢవిల్లింది. సుపరిపాలన వర్ధిల్లేలా నైతిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంస్కరణలు నెలకొల్పారు. దైవ ప్రాతినిధ్య భావనల ఆధారంగా సాంఘిక వ్యవస్థను తీర్చిదిద్దారు. అరబ్ ద్వీపకల్పం ఆయన వశమైంది. ఎవరికి ఏ రూపంలో ఎలాంటి హోదా, అధికారాలు లభించినా అవన్నీ దైవం ప్రసాదించినవని విశదపరచేవారు. వీటి విషయంలో వారు దైవానికి సమాధానం చెప్పుకోవడం తప్పనిసరి అనే ఆలోచన కలగజేశారు. అరబ్బులకు వివేచనా మార్గం బోధించి మహోపకారి అయ్యారు.

రాజాధిరాజై కూడా ఒక పేదవాడుగా, సర్వస్వం త్యజించినవాడిగా ఒక పూరి గుడిసెను నివాసంగా చేసుకొన్నారు. గృహస్థుగా ఉండి సంసార జీవితం గడిపారు. సామాన్య మానవుడిలా అందరితో మెలగుతూ వారి సుఖదుఃఖాల్ని పంచుకొనేవారు. మత విషయంలో నిర్బంధం, బలప్రయోగం ఇస్లామ్ ఎంతమాత్రం అంగీకరించదని ఆయన తేల్చిచెప్పారు. ఒకేదైవం, దానధర్మాలు, పరులక్షేమం, దుర్మార్గం నుంచి విమోచనం- వీటిని సార్వజనీన అంశాలుగా రూపుదిద్దారు. ప్రజల ప్రశాంత జీవనాన్ని నిస్తేజపరచే మానవ రూపమృగాల దుశ్చర్యల్ని విధిలేని పరిస్థితిలో అడ్డుకోవడానికి మాత్రమే ధర్మబలంతో విక్రమించి యుద్ధభూమికి నడిచారు.

పరస్పర వైషమ్యాలకు స్వస్తి పలికి- అందరిలోనూ విశ్వమానవ సౌభ్రాత్రం, ఉదార భావనా పటిమ వికాసమొందాలని మీలాదున్నబి ఆకాంక్షిస్తోంది.

- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా