ᐅభీష్మపంచకం




భీష్మపంచకం 

మనదేశంలో తమ తాతముత్తాతల పేర్లు తెలియనివారికి సైతం- దశరథుడు, భీష్ముడు తదితరుల పేర్లు బాగా తెలిసే ఉంటాయి. రామాయణ భారతాలకు ఇక్కడున్న ప్రాచుర్యం దానికి కారణం. లోకంలో ఎవరైనా భీషణమైన శపథం చేస్తే, దాన్ని 'భీష్మ ప్రతిజ్ఞ'గా అభివర్ణించటం ఇప్పటికీ ఉంది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడి బాణాలకు నేలకొరిగినా, అది దక్షిణాయనం కనుక, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంతవరకు అంపశయ్యపై పవళించి, తన ఇచ్ఛ ప్రకారం తనువు చాలించిన స్వచ్ఛందమరణ వరపుత్రుడు భీష్ముడు! ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతం పాటించిన కారణజన్ముడు. కురువంశపు మణిపూస భీష్మాచార్యుడు. కృష్ణుణ్ని అవతారమూర్తిగా దర్శించిన ఆనాటి అతికొద్దిమందిలో ఆయన ఒకడు.
భీష్ముడు శరతల్పగతుడయ్యాక, కృష్ణుడు ధర్మజుడితోసహా వచ్చి, 'ఓ కురువీరుడా! నీ జీవితశేషం ఇక ఏభై ఆరుదినాలు' అని చెప్పినట్లు వ్యాసభారతం శాంతిపర్వంలో ఉంది. మొత్తం మీద భీష్ముడు 170 సంవత్సరాలు జీవించాడని పరిశోధకులు తేల్చారు.

మాఘ శుద్ధ సప్తమి మొదలు ఏకాదశి వరకు అయిదు రోజులను 'భీష్మపంచకం' అంటారు. మాఘ శుక్ల ఏకాదశికి 'భీష్మ ఏకాదశి'గా పేరు వచ్చింది. దీన్నే కొన్ని గ్రంథాలు 'జయ ఏకాదశి'గా పేర్కొన్నాయి. గోదావరీనది సముద్రుడితో సంగమించే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది క్షేత్రంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవం- భీష్మ ఏకాదశి నాటి గొప్ప వేడుక.

భీష్ముడు తన పంచప్రాణాల్లో మొదటిదాన్ని సప్తమినాడు, రెండోదాన్ని అష్టమిరోజు, మూడో ప్రాణం నవమి తిథిలో, నాలుగోదాన్ని దశమిపూట, ఆఖరి ప్రాణాన్ని ఏకాదశినాడు విడిచిపెట్టాడని ప్రతీతి. అందుకే ఈ అయిదు రోజులను 'భీష్మపంచకం'గా చెబుతారు. కాలనిర్ణయచంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, కాలమాధవీయం... లాంటి గ్రంథాలన్నీ మాఘ శుద్ధ అష్టమినే భీష్మ నిర్యాణదినంగా స్పష్టం చేశాయి. దాన్ని 'భీష్మ అష్టమి'గా వర్ణించాయి. భీష్ముడికి ఆ రోజునే తర్పణాలు విడిచిపెట్టాలని ప్రకటించాయి. ముఖ్యంగా సంతానం కోరేవారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. భీష్మాష్టమినాడు తిలాంజలి సమర్పించి, భీష్ముడిని స్మరించేవారికి సంతానప్రాప్తి కలుగుతుందని హేమాద్రి పండితుడు వర్ణించాడు. దీన్ని 'భీష్మ పంచక వ్రతం'గా ఆయన పేర్కొన్నాడు. భీష్ముడికి తర్పణం ఆచరించి అష్టమినాడు శ్రాద్ధం పెడితే సంతానం కలుగుతుందని పద్మపురాణం చెబుతోంది. సంవత్సర పాపం తొలగిపోవాలంటే ఆనాడు భీష్ముడికి జలాంజలి సమర్పించాలని భారతం పేర్కొంది.

ఏది ఏమైనా, ఒక ఏకాదశి పర్వదినాన్ని తన పేరుతో ముడివడేలా చేసుకున్న ధన్యజీవిగా మనం భీష్మ పితామహుణ్ని మనసారా స్మరించవలసి ఉంది.

- ఎర్రాప్రగడ రామకృష్ణ