ᐅకృత్యమే అర్చన




 ᐅకృత్యమే అర్చన 

పనులు అనేక రకాలు. కాలాన్ని బట్టి చేసేవి, వయసును బట్టి చేసేవి, సమయానుకూలంగా చేసేవి. ఇలా... ఆయా పనులు, ఆయా నియమిత సమయంలోనే చేయాలి. వాటిమీద పూర్తి ధ్యాస ఉంచాలి. పవిత్రంగా, ఒక తపస్సులా భావించిననాడే అది సత్ఫలితాలనిస్తూ నెరవేరుతుంది. అందుకే 'కార్యమే దేవతార్చన' అనే నానుడి పుట్టింది.
సాధకుడు అనేవాడు తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. తదేకదీక్షతో ఉన్న అతడి దగ్గరకు చోరకుడు అనేవాడు వచ్చి పలకరించాడు. తన చేతిలో ఉన్న పదార్థాన్ని సాధకునికి ఇస్తూ 'ఇంద! ఇది దేవుని ప్రసాదం. తిను' అన్నాడు. సాధకుడు 'నేను పనిలో ఉన్నాను. దాన్ని అక్కడ పెట్టు, తరవాత తీసుకుంటాను' అన్నాడు. అందుకు చోరకుడు 'ఇది కాస్తంతే ఉంది కదా! నీ రెండో చెయ్యి ఖాళీగానే ఉంది. ఈ కాస్త నోటిలో వేసుకుని నీ పనిచేసుకో' అన్నాడు. ఆ మాటకు సాధకుడు 'నేను ఏ పనిచేస్తున్నానో అదే నా దృష్టిలో భగవదర్చన. నేనిప్పుడు ఆ అర్చనలోనే ఉన్నాను. ఆ పని సక్రమంగా పూర్తయితే అదే భగవత్ప్రసాదంగా భావిస్తాను. అలా అయితేనే నేను నిశ్చలభక్తి కలిగి ఉన్నట్టు. ఇక నువ్విచ్చిన ప్రసాదం... నీ దృష్టిలో అత్యంత పవిత్రమైనది. అందుకే దాన్ని అంతే పవిత్రమైన మనసుతో నేను స్వీకరించాలి. అలాగైతేనే ఆ ప్రసాదాన్ని, తద్వారా నిన్నూ గౌరవించినట్టు అవుతుంది. ఆ గౌరవం మీకు దక్కాలంటే ముందుగా ఈ పని పూర్తికావాలి' అని వివరించాడు.

అందుకే రవీంద్రుడు 'స్వామీ! (భగవంతుడా) నీవు గుడిలో కాదు, జనులు చేసే పనిలో కొలువై ఉండు. అలా అయితే నిరంతరం నిన్ను ప్రత్యక్షంగా కొలుచుకునే అవకాశం కలుగుతుంది' అంటాడు తన రచనల్లో ఒకచోట.

పని పవిత్రమైనది కావాలంటే- 'ఏది ఎక్కువ ప్రాధాన్యం కలిగింది, ఏది ప్రాధాన్యం కలిగిందని ముందుగానే వర్గీకరించుకోవాలి. అలాగైతేనే ఆ పని ఎలాంటిదైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా తప్పక చేయగలుగుతాం. ఆ వర్గీకరణలోను, ఆయా పనులు నెరవేర్చడంలోనూ నిజాయతీ చూపాలి. అలా కాకపోతే అత్యంత ప్రధానమైన పని చేయవలసి ఉన్నా, అది కష్టమైనదైతే దాన్ని వెనక్కి పెట్టి, సులువైన పనులే చేయడం జరుగుతుంది. అలా చేయడాన్ని గురించి రామకృష్ణ పరమహంస 'చేదుగా ఉందని శరీరానికి మేలు చేసే మాత్రని కాదని, తియ్యగా ఉందని చెడుపు చేసే మిఠాయి తిన్నట్టు' అంటారు. కాబట్టి ఇంద్రియాలన్నింటినీ నియంత్రించుకుని- చేసే పనిమీద మనసు లగ్నం చేస్తే, ఎలాంటి కష్టమైన పని అయినా అవలీలగా జరుగుతుంది.

మత్స్యయంత్రం ఛేదించినప్పుడు అర్జునుడు రెండు కళ్ళనీ, రెండు చేతులనీ ఆ యంత్రం మీదే లగ్నం చేశాడు. అందువల్లనే సులభంగా ఛేదించగలిగాడు. 'దేశానికి స్వాతంత్య్రం సంపాదించాలి' అనే కాంక్ష ఉండటంతోపాటు, ఆ దిశగా ఆ నాయకులంతా తదేక ధ్యాసతో కృషి చేశారు. కాబట్టే అది సిద్ధించింది. తండ్రిని సేవిస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ పాండురంగడే వచ్చి పలకరించినా, అతడిని పక్కన నిలబడమన్నాడు పుండరీకుడు. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలు కట్టినప్పుడు, అద్భుతమైన శిల్పాలను చెక్కినప్పుడు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నిర్మాణాలు నిర్మించినప్పుడు ఆయా కార్మికులు పాటించినది ఈ ధ్యానమే. ఒక్కమాటలో చెప్పాలంటే- సాధారణస్థాయినుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన అందరి విజయరహస్యం ఇదే. వేదాలు, పురాణాలు, చరిత్ర, ఆధునిక సాహిత్యం... వీటన్నింటిలోనూ ఈ విషయమై ఎన్నో దృష్టాంతాలున్నాయి.

ఒక న్యాయవాది నిందితుడి తరఫున వాదిస్తున్నాడు. ఆ రోజు జరిగే వాదనాపటిమ మీదే ఆ నిందితుడి భవిత ఆధారపడి ఉంది. శిక్ష పడేదీ లేదా విడుదల అయ్యేదీ తేలేది ఆ వాదన పూర్తయితేనే. నిజానికి ఆ నిందితుడు నిర్దోషి. అది నిరూపించాలనే న్యాయవాది తాపత్రయం. ఆ వాదనలో కొద్ది విరామం దొరికింది. ఆ సమయంలో అతడి సహాయకుడు ఒక తంతి (టెలిగ్రామ్)ని అందించాడు. దాన్ని చదివేసరికి ఆ విరామం పూర్తయింది. ఆయన ఆ కాగితాన్ని జేబులో పెట్టుకున్నాడు. వాదన కొనసాగించాడు, నెగ్గాడు. ఆ నిందితుడు నిర్దోషిగా విడుదల అయ్యాడు. న్యాయవాదికి అది సంతోషించవలసిన సమయం. కానీ దానికి విరుద్ధంగా అతడు అక్కడున్న కుర్చీలో అమాంతం కూలబడిపోయాడు. ముఖంలో విచారం, బాధ స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. అక్కడ ఉన్నవారు ఏమైందో అడిగి విషయం కనుక్కున్నారు. అప్పుడు తెలిసింది. తంతిలోని సారాంశం- 'న్యాయవాది భార్య మరణించింది' అని. అంతటి బాధాకరమైన వార్త తెలిసినప్పటికీ వాదన ఆపకుండా, తాను చేస్తున్న పనికే ప్రాధాన్యమిచ్చిన ఆ న్యాయవాది పేరు సర్దార్ వల్లభభాయిపటేల్. అందుకే ఆయనకు 'ఉక్కుమనిషి' అని పేరు వచ్చింది. పనిలో అంతటి నిబద్ధత కలవాడు కాబట్టే స్వతంత్ర భారతదేశానికి తొలి 'ఉపప్రధాని' కాగలిగాడు. అదే... నిబద్ధత అంటే.

- అయ్యగారి శ్రీనివాసరావు