ᐅజీవన యజ్ఞం




జీవన యజ్ఞం 

భారతీయులు జీవితాన్ని ఆషామాషీగా తీసుకోరు. జీవితం కేవలం సుఖ లాలసల నడుమ భోగాలతో జీవించడానికి కాదు. దీనికొక ఉద్దేశం ఉంది. ఒక నియతి ఉంది. ఒక సాధన, ఒక సార్థకత ఉన్నాయి. జీవితం ఒక ప్రేమ, జీవితం ఒక పూజ. జీవితం ఒక సేవ. ఒక బాధ్యత. ఒక త్యాగం. ఒక యోగం. అంతేకాదు. జీవితం ఒక యజ్ఞం. ఔను... జీవితాన్ని యజ్ఞ సమంగా భావించడం, అలా జీవించడం భారతీయులకే చెల్లు. వారు జీవితాన్ని యజ్ఞ భావనతో వినియోగిస్తున్నారు. జీవన యజ్ఞం చేస్తున్నారు. మనిషి శ్వాస అనే హంసారూఢుడై పరమాత్మ సన్నిధానానికి వూర్ధ్వ ముఖంగా ప్రయాణం చేస్తున్నాడు. దానికి ఇంధనంగా జీవనయజ్ఞం చేస్తూ, ఉత్పత్తి అయిన యజ్ఞఫలాన్ని వినియోగిస్తున్నాడు.
ఆటవికంగా, పశు సమానంగా జీవించే మనిషికి, కేవలం పశు ప్రవృత్తితో ఆహార నిద్రాభయమైథునాలతో ఆషామాషీగా జీవించే మనిషికి- మానవ జన్మ ఉద్దేశాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసినవారు పూర్వరుషులు. మనలో స్ఫూర్తి రగిలించినవారు మాననీయ మహర్షులు. వారి శరీరాన్నే పరిశోధనాలయంగా, అంతరంగాన్నే పరిశోధనా పరికరంగా అంతర్ముఖులై, వారి జీవితాన్ని ధారవోసి వేదాల్ని గ్రహించి వీక్షించి, ఆలకించి 'తత్వమసి', 'అహంబ్రహ్మాస్మి' వంటి మహా వాక్య నిరూపణకు ఆధారాలు కనుగొన్నారు. శ్రుతుల్ని కరతలామలకం చేసుకుని, ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞాన బీజాల్ని ప్రపంచ క్షేత్రంలో ప్రేమతో వెదజల్లారు. శ్రుతి... పక్వమైన ఫలితజ్ఞానాన్ని మౌఖిక బోధద్వారా, శిష్యులు అనే సస్యం ఎల్లెడలా పంట పండి ఆ పక్వ ధాన్యాన్ని, మధుర ఫలాల్ని ప్రపంచానికి వితరణ చేసింది. వారు, పరంపరాగతమైన రుషి శ్రేష్ఠులు పెట్టిన భిక్షతో భారతీయులు జీవితాన్ని యజ్ఞకుండంగా మలచుకుని 'ప్రతిక్షణాన్ని' ఆధ్యాత్మిక కల్యాణ గుణవస్తురాసితో అలంకరించి సమిధగా అర్పణ చేస్తున్నారు. తర్పణ చేస్తున్నారు. జీవన యజ్ఞం చేస్తున్నారు.

భారతీయులంటే మరి వారే కాదు. మిగిలినవారు కూడా. ఔను. మిగిలినవారు కూడా అదే భావ సముదాయంతో నిండివున్నవారే. భారతీయ ఆత్మ గతమైన ఆధ్యాత్మిక భావ సరళి అందరిలో ప్రతిఒక్కరిలో బీజప్రాయమై ఉంది. అందుకే శాంతి, సహనం, త్యాగం, వైరాగ్యం వారి రక్తమై ప్రవహిస్తున్నాయి. గుండెగా నినదిస్తున్నాయి. శ్వాసగా వూపిరి తీస్తున్నాయి. మనిషిని మెత్తగా శాసిస్తున్నాయి. అది కేవలం రక్తగతమైన గుణ సంపుటి. వివేకంతో కూడిన జ్ఞానం కావాలి. విచక్షణతో కూడిన జ్ఞానం కావాలి. ఎందుకంటే- ఫలితం ఎప్పుడూ భావ ప్రధానం. తెలిసి భావంతో చేయాలి. అప్పుడే పూర్ణఫలితం లభిస్తుంది. అందుకే మనం జీవితం ఏమిటో తెలుసుకుందాం. మానవ జన్మోద్దేశాన్ని గ్రహిద్దాం. దానికి అకనుగుణంగా జీవిద్దాం. జీవితాన్ని సంప్రదాయబద్ధంగా, ఆచార వ్యవహారంగా, వంశ పారంపరిక విధానమనే యథావిధితో కాకుండా 'ఎరుక' కలిగి జీవిద్దాం. వివేకం ఆధారంగా జ్ఞాన మార్గంలో పయనిద్దాం. అసలు గమ్యానికి చేరుదాం!

- చక్కిలం విజయలక్ష్మి