ᐅశంకరా... శుభంకరా



శంకరా... శుభంకరా! 

సకల సాధనల పరమలక్ష్యం మనసును మహేశ్వరుడిపై నిలపడం. ఇంద్రియాలను, మనసును నిగ్రహించిన భక్తులు ఈశ్వరకృపకు పాత్రులవుతారన్నది పెద్దలు చెప్పే మాట. 'కర్మఫల ప్రదాత అయిన నీలకంఠుడు తన మూర్తిమత్వం ద్వారానే ఎన్నో సద్గుణాలు ప్రసాదించాడు. భక్తులను భవ్యమైన దివ్యమార్గంలో ముందుకు నడిపిస్తున్నాడు. వారి యోగక్షేమాల్ని, శ్రేయాన్నీ తానే వహిస్తూ, వారికి సుఖాల్నీ శుభాల్నీ పొందే మార్గాల్ని కూడా తానే నేర్పుతాడు'- అని శివానంద లహరిలో జగద్గురువు ఆదిశంకరులు పేర్కొన్నారు. సర్వేశ్వరుడికి రుద్రుడని పేరు. 'రుద్' అంటే దుఃఖం. సకల దుఃఖాల్నీ, ఆ దుఃఖాలకు కారణాల్ని నివారిస్తాడు కనుక శివుడికి రుద్రుడనే నామం స్థిరపడింది. రుద్రం, రుద్రుణ్ని 'మీఢుష్టమ' అని స్తుతించింది. అష్టమూర్తి స్వరూపుడిగా పరమేశ్వరుడు సకల సృష్టికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తున్నాడంటారు. సూర్యరూపంలో ఆరోగ్యాన్నీ, పర్జన్య రూపంలో జలాన్నీ, ఇంద్రరూపంలో ఆహారాన్నీ, దక్షిణామూర్తి స్వరూపంలో సకల విద్యల్నీ, ఈశ్వర రూపంలో ఐశ్వర్యాన్నీ రుద్రుడు అనుగ్రహిస్తున్నాడని చెబుతారు. ఇహలోక ప్రయోజనాలతో పాటు పరలోక ఫలాల్ని సైతం అందించే ఆ ఆదిదేవుడు సర్వవ్యాపి. సర్వభూతాంతరాత్ముడు.
ఐహిక, ఆముష్మిక సుఖాలు, అభ్యుదయ, నిశ్శేయాలు ఎవరి వల్ల సిద్ధిస్తాయో ఆయనే శంభువు. సకల జగత్తుకు శంభువు శుభ పరంపరను అనుగ్రహిస్తాడు. అందుకే మంత్రపుష్పం ఆ సర్వేశ్వరుణ్ని 'విశ్వాక్షం విశ్వశంభువమ్' అని కీర్తించింది. ఎవరి శక్తి విజృంభిస్తే జగత్తు అనే చక్రం ఏర్పడిందో అతనే విశ్వనాథుడని కైలాస సంహిత చెబుతోంది. సృష్టి, స్థితి, లయ, తిరోభారం, అనుగ్రహం అనే అయిదు అంశాల్ని పంచార చక్రంగా వ్యవహరిస్తారు. ఈ చక్రాన్ని సర్వకాల సర్వావస్థల్లో సదాశివుడు తన ఆధీనంలో ఉంచుకుంటాడంటారు.

సాక్షాత్తు శివ స్వరూపమే ఎన్నో సందేశాల సమాహారం. పరమేశ్వరుని గళసీమను అలంకరించిన సర్పానికి అయిదు పడగలు, రెండు కోరలుంటాయి. పంచపడగలు పంచేంద్రియాలకు ప్రతీకగా, కోరల్ని రాగద్వేషాలకు సూచికగా చెబుతారు. శివుణ్ని హరించడానికి అసురులు పదునైన కొమ్ములు గల ఓ జింకను హరునిపై ప్రయోగించారు. దాన్ని అంబికాపతి తన ఎడమ చేత్తో ఒడిసిపట్టి, స్వాధీనం చేసుకున్నాడంటారు. లేడి చంచలమైన మనసుకు ప్రతిబింబం. లేడిని ఈశ్వరుడు చేతిలో ధరించాడంటే మనసును స్వాధీనం చేసుకున్నాడని భావం. తన భక్తులందరూ మనసును నిగ్రహించుకుని, సావధాన చిత్తులై తనవైపు దృష్టి సారించాలని విశ్వేశ్వరుడు సందేశమిచ్చాడు. శివ సందేశాల్ని మన జీవనానికి అన్వయించుకుందాం. శుభంకరుడైన శంకరుని అనుగ్రహాన్ని అందుకుందాం.


- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్