ᐅత్యాగరాజ ఆరాధన



ᐅత్యాగరాజ ఆరాధన

కీర్తనలో ఉండే సాహిత్యానికి వాక్కు అనీ, స్వర రచనకు గేయమనీ పేర్లు. వాక్కునూ గేయాన్నీ స్వయంగా సమకూర్చగల వారిని వాగ్గేయకారులంటారు. మన తెలుగు వాగ్గేయకారుల్లో ప్రప్రథమంగా లెక్కించదగినవాడు త్యాగరాజు.త్యాగరాజు కీర్తనలు ఆయన వ్యక్తిత్వానికి నిలువుటద్దాలు. ఆయన వేదాంతచర్చలో వ్యాసుడు, మృదుమధురమైన కవితా రచనలో వాల్మీకి, వైరాగ్యంలో శుకుడు, భక్తిలో ప్రహ్లాదుడు, సాహిత్యంలో బ్రహ్మ, సంగీతంలో నారదుడు, రామభక్తి తత్పరతకు వచ్చేసరికి పరమేశ్వరుడిని మించినవాడు. ఈ లక్షణాలన్నీ అతని కీర్తనలలో కనిపిస్తున్నాయి.
త్యాగరాజు ముత్తాత పంచనదబ్రహ్మం నేటి ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామ వాస్తవ్యుడు. కారణాంతరాల వలన తంజావూరు మండలంలోని తిరువారూర్ గ్రామానికి సకుటుంబంగా వలస వెళ్లాడు. సర్వజిత్ నామ సంవత్సర చైత్ర బహుళదశమి సోమవారం (4-5-1767) నాడు ఆ ఊళ్లోనే త్యాగరాజు జన్మించాడు. తల్లి సీతమ్మ, తండ్రి రామబ్రహ్మం.

త్యాగరాజుకు బాల్యంలోనే సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. శొంఠి వేంకట రమణయ్య వద్ద ఆయన సంగీత పాఠాలను ప్రారంభించాడు. నారదానుగ్రహం వలన ఆయన ఆ విద్యలో నిష్ణాతుడై గొప్ప వాగ్గేయకారుడయ్యాడు.

త్యాగరాజు 24,000 కీర్తనలు రాశాడని కొందరన్నారు. కానీ, ప్రస్తుతం మనకు 711 మాత్రమే లభిస్తున్నాయి. నగుమోము గనలేని, సామజవరగమనా, ఏతావునరా?, వందనము రఘునందనా, నిధి చాలా సుఖమా, బంటురీతి కొలువు, ఏలా నీ దయ రాదూ- మొదలైనవన్నీ మనకు బాగా తెలిసినవే!

త్యాగరాజు కీర్తనలన్నీ ఆయన స్వయంగా చేసిన రాగతాళ నిర్దేశంతోనే, స్వరరచనతోనే మనకు లభించాయి. అతని శిష్య పరంపర ఈనాటి వరకూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. అందుకే మనం అందరమూ వాటిని ఒకే విధంగానే పాడుకొని ఆనందిస్తున్నాం!

జగదానంద కారకా, దుడుకు గల నన్ను, సాధించెనే, కనకన రుచిరా, ఎందరో మహానుభావులు- అనేవి ఆయన ఘనరాగ పంచరత్న కీర్తనలు. మన కర్ణాటసంగీత సముద్రం నుంచి ఉద్భవించిన అనర్ఘరత్నాలివి.

త్యాగరాజు పుదుక్కోటై సంస్థానంలో జ్యోతిస్స్వరూపిణి రాగాన్ని ఆలపిస్తే ప్రమిదలోని వత్తి వెలిగిందట. బిలహరి రాగంలో 'నా జీవాధారా...' అనే కీర్తన పాడితే మరణించిన వ్యక్తి బతికాడంటారు. తిరుపతిలో 'తెరతీయగరాదా...' అనే కీర్తనను గానం చేస్తే వేంకటేశ్వరస్వామి వారి గర్భాలయ ద్వారానికి వేసిన తెర జారి కిందపడిందని చెబుతారు. 'ముందు వెనుక...' అనే కీర్తననాలపిస్తే రామలక్ష్మణులిద్దరూ ధనుర్బాణాలు ధరించి వచ్చి త్యాగరాజు కూర్చున్న పల్లకిని అటకాయించిన దొంగలను పారదోలారని చెప్పుకొంటారు.

నిధి కన్నా రాముని సన్నిధే సుఖమన్నాడు త్యాగరాజు. శాంతము లేక సౌఖ్యము లేదన్నాడు. మనసు స్వాధీనమైన ఘనుడికి మంత్రతంత్రాలతో పనిలేదన్నాడు. సంగీత జ్ఞానము, భక్తి వినా సన్మార్గము కలదా అని ప్రశ్నించాడు. ఆ సంగీత మార్గంలోనే ప్రయాణించాడు. ఇదంతా త్యాగరాజు సూక్తిసుధ.

పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి నాడు (6-1-1847) త్యాగరాజు నిర్యాణం చెందాడు.
 
త్యాగరాజు గురించి ముచ్చటించుకొంటున్న సమయంలో బెంగుళూరి నాగరత్నమ్మ త్యాగరాజు శిష్యపరంపరలోని సంగీత విద్వాంసురాలు. ఆమె సాహిత్యాభినివేశమూ గొప్పదే! ఆమె త్యాగరాజు స్వామి సమాధి మీద ఒక మంటపాన్ని నిర్మించారు. దానిని బృందావనమంటారు. ఆమె తన ఆస్తినంతటినీ ఈ బృందావన నిర్మాణం కోసం, త్యాగరాజు కీర్తనల ప్రచారం కోసమే వెచ్చించారు. ఇప్పటికీ ఏటా తిరువైయార్‌లోని ఆ బృందావనం వద్ద త్యాగరాజు వర్ధంతి, పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజు ఆరాధనోత్సనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కర్ణాటక సంగీతమంటే త్యాగరాజే! 

 - డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి