ᐅదృక్పథం



దృక్పథం 

'ఏం కనిపిస్తోంది నీకు?' 
'మోడు వారిన చెట్టు స్వామీ!' 
'మరి నీకేం కనిపిస్తోంది?' 
'కొత్తగా చివుర్లు వేస్తోన్న చెట్టు స్వామీ!'
ఆశ్రమ ఆవరణకు ఆవలగా ఉన్నది ఆ ఒక్క చెట్టే. పై ఇరువురి చూపుల్లో, మనో దృక్పథాల్లో ఎంతో తేడా. కేవలం అది బాహ్యదృష్టే కాదు. అంతరంగ కదలికలకూ అద్దంపడుతుంది. ఆశావహ దృక్పథం జీవితానికి చుక్కాని లాంటిది!

అందమైన తోటను పెంచేటప్పుడు తోటమాలి క్షణమైనా వృథా చెయ్యడు. ముందు రోజుల్లో కనువిందు చేసే ఫలపుష్పాదులు ఆవిష్కృతమవుతాయన్న ప్రగాఢ నమ్మకంతో శ్రమిస్తాడు. కలుపు మొక్కలను ఏరి పారేస్తాడు. చుట్టూరా కంచె నిర్మిస్తాడు. మొక్క మొక్కనూ కాపుగాస్తాడు. ఏపుగా పెరిగిపోయే వనసంపదను చూసి మురిసిపోతాడు. తన కృషికి భగవత్కృప తోడైందనుకుంటాడు.

తోటలో విత్తులు నాటేటప్పుడు- ముందు ముందు ఏ విలయాలు తన శ్రమనంతా బుగ్గిపాలు చేస్తాయోనన్న ఆలోచనే దరి చేరనీయడు. అలా ఆలోచిస్తే అడుగుముందుకేయలేడు.

నూరేళ్ల విలువైన జీవితమూ అంతే. జీవితం పూల పాన్పు కాదు. వడ్డించిన విస్తరి అంతకంటే కాదు. జీవన గమనాన్ని మనమే ఏర్పరచుకోవాలి. లక్ష్య సాధన దిశగా మలచుకోవాలి. సానుకూల దృష్టితో ముందడుగు వేయాలి.

దుర్గమారణ్యాల్లో తిరుగాడే జంతువైనా తనకొక రక్షిత స్థలాన్ని, తావును ఏర్పరచుకుంటుంది. తన కదలికలను నియంత్రించుకుంటూ, నిర్దేశించుకుంటూ జీవిస్తుంది. ఎదురయ్యే ప్రతిబంధకాలను అధిగమిస్తుంది.

సన్నగా, పీలగా కాళ్ళు కలిగి ఉండే కొంగకు ఎంత ఓపిక! చేప దొరక్కుండా ఎక్కడికి పోగలదని! ఒంటికాలిపై ఉంటూ కొంగ తన యత్నాన్ని కొనసాగిస్తుంది. పక్కలకు చూడదు. ప్రశాంత ప్రకృతి, పరిసరాలు తనకు తోడు అన్నట్లుగా... అవి తనకు ప్రతిబంధకాలు కావన్నట్లుగా!

చేప దొరికిందా- తన నిరీక్షణ ఫలించిందనుకుంటూ ఆనందంతో రెక్కలు టపటపలాడిస్తుంది.

చేప సర్రున జారిపోయిందా- తిరిగి తన వేటకు ఉపక్రమించే ధ్యానశీలిగా ముద్ర దాలుస్తుంది.

నూరేళ్ల జీవితంలో ప్రతిబంధకాలు, అపజయాలు సహజమే. అసలు అపజయం ఉంటేనే విజయానికి గుర్తింపు.

అపజయాలతో, ఎదురయ్యే అవమానాలతో, న్యూనతాభావం కలిగి ఉంటే- ఎటుచూసినా ప్రతికూల భావనలే ముందస్తుగా మనసు కుంచింపజేస్తాయి. అప్పుడది జీవితమెలా అవుతుంది? భయం ఉన్న చోటనే నిర్భయం, వెనకడుగు ఉన్నచోటనే 'ముందడుగు' ఉంటాయి గదా. జంటగా చెప్పుకొనే మాటలవి. ఒకదానికి గురైనప్పుడు ప్రత్యామ్నాయాన్ని మనసు తర్కించుకోవాలి కదా! అదే దృష్టిపథం. ప్రత్యామ్నాయదిశగా పథాన్ని నిర్దేశించుకుని ముందుకు అడుగేస్తే, నిర్భయం రెక్కలు విప్పుకొన్నట్లే. అప్పుడు విజయకేతనం రెపరెపలాడక తప్పదు.

'ఈ ఆకారం ఏమిటి? పిచ్చివాడిలా తయారయ్యావు' ఆప్యాయంగా అడిగారు గురుపాదులు- దీనంగా కనిపిస్తున్న తన శిష్యుడు సుముఖుణ్ని.

'రాజాస్థానంలో కొలువుకోసం అహోరాత్రాలు శ్రమించి పరీక్షలకు నిలిచినా... సాధించలేకపోయాను స్వామీ! ఇక సాధించే తెలివితేటలు, ఓపికా నాకులేవు'

'నీతో పాటు ఎంతమంది పాల్గొన్నారు'

'అధిక సంఖ్యలోనే స్వామీ!'

'కొలువులో ఉన్న ఖాళీలు ఎన్ని?'

'నాలుగు స్వామీ!'

'అధిక సంఖ్యలో పోటీపడ్డారంటున్నావు. ఎంపిక కాని వారందరూ నీలాగే తయారవుతారా? నిరాశ నిస్పృహలతో జీవితాన్ని పాడుచేసుకుంటున్నారా నీలాగ!'

మౌనం వహించాడు సుముఖుడు.

గురు శిష్యులిద్దరూ సముద్రతీరంలో తడి ఇసుక మీదుగా నడుస్తున్నారు.

'సుముఖా... అదుగో- అటు చూడు'

ఇసుకతో పిచ్చుకగూళ్ళు నిర్మిస్తూ ఆటలాడుకుంటున్నారు పిల్లలు. ఎన్నిసార్లు నిర్మిస్తున్నా... ఒక పక్క నుంచి ఒరిగిపోవడమో, అలల తాకిడికి కుప్పకూలిపోవడమో జరుగుతోంది. పిల్లల ముఖాల్లో సంతోషం లేదు.

ఈ పిల్లలకు దూరంగా మరో జట్టు పిల్లలు ఇసుక గూళ్లు పెద్దవిగా నిర్మించుకుంటూ ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. వీరిని చూసి అలల దగ్గర గూళ్లు నిర్మించే పిల్లలు కూడా వచ్చిచేరారు. వారితో కలిసిపోయారు. ఆనందం వారికీ లభించింది. ఈ దృశ్యాన్ని చూసిన సుముఖుడు గురువుకేసి చూస్తూ నిలబడిపోయాడు.

'జీవితమూ అంతే సుముఖా! ప్రతికూలతలు ఎదురైనప్పుడు- సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. ఆలోచన ఉద్భవించాలి. ఎవరో వచ్చి చెప్పరు ఇవన్నీ!

శాస్త్రాలు చదివావు. విజ్ఞానాన్ని ఆర్జించావు. జీవితాన్ని, లక్ష్యాలను ఒకే కోణంలో చూస్తే ఎలా? జీవితమన్నది ఏదొక లక్ష్య సాధనకేనా! ఆలోచించు. నీ దృక్పథాన్ని మలచుకునే అనుకూల వైఖరిని ఏర్పరచుకో!'

'తత్వం బోధపడింది స్వామీ!' అంటూ విశ్వాసం నిండిన గుండెతో గురువు పాదాలకు నమస్కరించాడు సుముఖుడు.

జీవితంపట్ల, ఏర్పరచుకునే ప్రత్యామ్నాయ సులక్ష్యాల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటే విజయమూ చేతికందుతుంది. జీవితాంతం ఆనందం లభిస్తూనే ఉంటుంది.

- దానం శివప్రసాదరావు