ᐅకాలాయనమః





కాలాయనమః 

అనంత కాలార్ణవంలో మరో తరంగం... ఉగాది చేరువైంది. వసంత సుధామాధుర్యాలతో, మనోహర కోయిల కూజితాలతో, చలచల్లని నునువెచ్చని చిరుగాలుల సరాగాలతో. కాలం మంత్రదండం. ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. కాలం ఒక వలయం (చక్రం). తనలో అన్నింటినీ కలుపుకొని ముందుకు వెళ్లిపోతుంటుంది- తనకేమీ పట్టనట్టుగా. కాలం ఒక ఇంద్రజాలం. ఎందరినో కలుపుతుంది, మరెందరినో విడదీస్తుంది. కాలం ఒక దేవత. ఒక శక్తి. ఒక అజ్ఞేయం. త్రికాలాలకూ అతీతంగా మెరిసే చిరంతనత్వం కాలం స్వరూపమే. కాలానికి ఆది, అంతం లేవు. అవి మానవ ప్రజ్ఞకు అందవు. ఆద్యంతాలు లేని అనంతకాలం ఆదిశేషువై విశ్వపరివ్యాప్తుడైన విష్ణువుకు తల్పమై భాసిస్తున్నట్లు ద్రష్టల దర్శనం.
అందువల్లనే కాబోలు- కాలాన్ని ఉగాది రూపంలో ఆరాధించాలని ప్రాచీనులు నిర్దేశించారు. ప్రళయం పూర్తి అయిన తరవాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలో మొదట వచ్చేది యుగాది. యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా ఉగాది అని ప్రజలు వ్యవహరిస్తుంటారు. ఉగాది పర్వదినం చైత్రమాసంలో ప్రారంభం కావడంవల్ల ఆనాటినుంచి తెలుగు సంవత్సరం ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించడానికి వీలుగా ఉండేందుకే- ఉగాది పండుగను మనకు ప్రాచీన మహర్షులు ఏర్పాటు చేశారు.

భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రమారమి ఇదే కాలంలో సంవత్సరాది ప్రారంభమవుతుంది. మనకు ఇది తొలి పండుగ.

ఉగాది నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులూ దేవిని ఆరాధిస్తారు. లలిత, దుర్గాది దివ్యమాతృమూర్తులను ఈ తొమ్మిది రోజులూ పూజించడంవల్ల జీవితం పునీతమవుతుందంటారు. ఈ రోజునుంచే శ్రీరామ నవరాత్రులు ప్రారంభమవుతాయి. పాడ్యమినుంచి తొమ్మిది రోజులు రామార్చన, శ్రీమద్రామాయణ పారాయణ శుభప్రదమని చెబుతారు. సంవత్సరం ప్రారంభంలోని తొమ్మిది దినాలు వైష్ణవ శక్తిని (ఈ శక్తికి పురుషరూపం శ్రీరాముడు) ఆరాధిస్తే విశ్వానికి శుభం చేకూరుతుందని విశ్వసిస్తారు.

చైత్రారంభాన ప్రకృతిలో కొత్తదనం, చివురులెత్తే ఈ తరుణంలో నూతన సంవత్సరాదిని జరుపుకోవడంలో ఖగోళ విజ్ఞానం ఇమిడి ఉంది. ఖగోళపరంగా వచ్చే మార్పు వల్ల కలిగే ప్రభావం దర్శించిన రుషులు అది అందరికీ మేలుచేయాలని ఈ పర్వదినం ఏర్పాటు చేశారు.

సంవత్సర దేవత అనుగ్రహంకోసం పంచాంగపఠనం దైవసన్నిధిలో జరుపుకొంటాం. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాలు- తిథితో సంపద, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపప్రక్షాళన, యోగంవల్ల వ్యాధి నివారణ, కరణంవల్ల గంగాస్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పలువురి విశ్వాసం. ఈ ఉగాది ఒక్క దేవతతో ముడివడిలేదు. ఎవరికి ఇష్టమైన దేవతను వారు ఆరాధించుకోవచ్చు. ఉగాది పచ్చడి షడ్రుచుల్లోని తీపి చేదులు మానవ మనుగడకు కమ్మని సంకేతాలు.

కాలం ఒక మహాసర్పంలా నక్షత్రాల్లో చుట్టలు చుట్టుకుని కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఏ క్షణంలోనైనా కాటు వేయడానికి అది సన్నద్ధమై ఉంటుందంటారు. అటువంటి కాలం దయార్ద్రవీక్షణాల కోసం ఉగాది వంటి పండుగలు చేసుకుంటే మంచిదని పెద్దలు చెబుతారు.

'నేను కాలాన్ని. ఈ వ్యవస్థను విధ్వంసం చేస్తాను' అని విశ్వరూపం దాల్చిన శ్రీకృష్ణ భగవానుడు (గీతలో) అనడంలో ఒక రహస్యం ఇమిడి ఉంది. భగవంతుడు కేవలం కాలస్వరూపుడు మాత్రమే కాదు. సర్వనాశనం ఆయన ప్రణాళికా లక్ష్యం కాదు. అది నవసృష్టికి, నూతనవ్యవస్థకు దారితీసే విధ్వంసం మాత్రమే. అటువంటి సువ్యవస్థ ఆవిర్భావ దిశలో ఉగాది ఒక బంగారు మైలురాయి. రాబోయే ఉజ్జ్వల ఉషస్సులకు వినమ్ర నమస్సులు!

- కె.యజ్ఞన్న