ᐅజయం మనదే
ఓటమిని ఆస్వాదించగలిగినవారినే విజయం వరిస్తుంది. జీవితంలో జయాలుంటాయి, అపజయాలూ ఉంటాయి. తలపెట్టిన పనిలో విజయం లభించగానే మన భుజాన్ని మనమే తట్టుకొని గర్వపడతాం. అపజయానికేమో కారణాన్ని విధికి ఆపాదిస్తాం. విధిని నిందిస్తాం. దైవంపై అలుగుతాం. ఇలా ప్రవర్తించడం మానవ తప్పిదమే కాదు, దైవాపరాధం కూడా! జీవితంలో మనకు ఎదురయ్యే జయాపజయాలకు కారణం మనమే! దైవం మనిషికి వివేకం ఇచ్చాడు. వీలైనంతవరకు తప్పులు చేయకుండా కార్యసాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యం! జీవనమార్గంలో తప్పటడుగులు వేయటం ఎవరికైనా సహజం. జీవిత రహదారిలో ముళ్లూ గులకరాళ్లూ ఉంటాయి. వివేకాన్ని ఉపయోగించి ప్రయాణం చేయగలిగితే విజేతలం కావడం ఎప్పుడూ సంభవమే. అందలం కోసం ఎగిరే ప్రయత్నంలో కిందపడిపోతుంటాం. పడిలేచి తిరిగి ప్రయత్నించేవాడికి అందలం అందుతుంది. పూలకోసం యత్నిస్తుంటే ముళ్లు గుచ్చుకుంటాయి. జీవితంలో గెలవాలనుకొంటే ఓపిక ఉండాలి. పదిసార్లు ప్రయత్నించిన తరవాత పదకొండోసారి లభించిన విజయంలోని ఆనందమే వేరు! విజయం సాధించేందుకు అడ్డదారులుండవు. అడ్డంకులుంటే తొలగించుకోవాలి. అందుకు సమయస్ఫూర్తి, వివేకం అవసరం.
శ్రీకృష్ణుడు అపర విష్ణు అవతారం. కౌరవుల బారినుంచి రక్షించడానికి పాండునందనులకు సహకరించాడు కాని విజయప్రయత్నంనుంచి విరమించమనలేదు! లక్కతో నిర్మించిన భవనంలో నివసిస్తున్నవారికి సోమరితనం వదలి అప్రమత్తంగా ఉండాలని బోధించాడు. తాను దైవస్వరూపుడే అయినా జరాసంధుని వధ తన వల్లకా(కూడ)దని తెలిసి... సంధ్యాసమయంలో, పశ్చిమ ద్వారంనుంచి ప్రవేశించి భీముడితో యుద్ధానికి పురిగొలిపాడు. శ్రీకృష్ణుడు జరాసంధుడితో ఓటమికి కుంగక సమయస్ఫూర్తితో పగవాడిని హతమార్చాడు. మహాభారత యుద్ధసమయంలో కౌరవ వీరుల సమరసన్నాహాలు చూసి పార్థుడు పరాజయం తప్పదని భావించాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులవంటి సమరయోధులను గెలవటం అసంభవమని యుద్ధానికి వెనకాడుతున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు పోరుచేయడంలో భీరత్వం ప్రదర్శించక ప్రయత్నించమన్నాడు. నిజానికి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుని వంటివారిని గెలవటం సులభమేమీ కాదు. పద్దెనిమిది రోజుల యుద్ధంలో పాండవులు ఓటమి అంచుల వరకు వెళ్లినా శ్రీకృష్ణుడు వారిని ఉత్సాహపరుస్తూ సామ దాన భేద దండోపాయాలను వినియోగించి విజయం సాధించిపెట్టాడు. అంతేతప్ప- పాండవుల విజయానికి అడ్డదారి చూపలేదు.
ప్రతి మనిషికీ జీవితంలో గెలుపు అవసరం. గెలవలేని జీవనలక్ష్యం అంటూ లేనేలేదు. ఎదురవుతున్న ఓటములకు భయపడి లక్ష్యాన్ని విడచి బతికే మనిషి పథవిహీనుడే! మరణం తప్పదని తెలిసినా బతకడానికి చేసే ప్రయత్నాలు విడవలేం కదా! మనం గెలుపుకోసం చేసే ప్రయత్నాలే తరవా తి తరం వారికి స్ఫూర్తిదాయకాలవుతాయి.
యుద్ధంలో రాముడి సోదరుడు సౌమిత్రి మూర్ఛపోతాడు. వానరసేనలో ఓటమి భయం ప్రారంభమవుతుంది. అప్పుడు విభీషణుడు అంటాడు- 'రామా! నీ కుడిభుజాన్ని కోల్పోయావు. నా కూతురు త్రిజట సహాయంతో సీతను వెంటనే నీవద్దకు రప్పించగలను. ఓటమి భయం నాకూ పట్టుకుంది. లంకారాజ్యం నాకు అవసరం లేదు. నీ శరణార్దిగా అయోధ్యలో జీవిస్తాను, వెళ్లిపోదామా?'
శ్రీరాముడు పలికిన వాక్యాలు మానవులందరూ తెలుసుకోదగినవి. 'విభీషణా! నేను సీత కోసం మాత్రమే రావణుడిపై గెలుపును కోరటంలేదు. మానవ సమాజంలో రావణుడిలాంటి రాక్షసులకు స్థానంలేదు. అతడి సంహారమే నా లక్ష్యం. ఆ లక్ష్యంలో విజయం సాధించడంకోసం నా సోదరుడి ప్రాణాన్నైనా పణంగా పెట్టగలను. ఓటములెన్ని ఎదురైనా ప్రయత్నిస్తూనే ఉంటాను ఎందుకంటే చెడుపై మంచికి తప్పక విజయం లభిస్తుంది.'
విజయం కోసం ఓటమిని ఎదుర్కొనక తప్పదు. ఓటమి గెలుపునకు స్ఫూర్తికావాలి కాని, భీరత్వానికి నాంది కాకూడదు. అప్పుడే జయం మనది!
- అప్పరుసు రమాకాంతరావు