ᐅజీవన వసంతం




జీవన వసంతం 

ప్రకృతి పరిణామ శీలం కలిగి ఉంటుంది. రుతువులు, కాలాలు, గ్రహప్రభావాలు తమ ముద్రల్ని ప్రకృతిమీద వేస్తుంటాయి. తీవ్ర ఉష్ణం, శీతలం, వర్షం, తుపానులు ప్రకృతిమీద తమ ప్రతాపం చూపిస్తుంటాయి. ఇన్నింటినీ తట్టుకుని ప్రకృతి వసంతంలో కొత్త ఆశల చిగుళ్లు వేస్తుంది. రాలిపోయిన ఆకుల స్థానంలో కొత్తవి పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ ఒకసారే కాదు- ప్రతి ఏడాదీ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది.
మనిషికి ప్రకృతి అందిస్తున్న అమూల్య సందేశంగా దీన్ని మనం స్వీకరించాలి. మనిషి సుఖసంతోషాల్ని ఎంత కోరుకున్నా, ఎన్నిపాట్లు పడినా కష్టాలు, కన్నీళ్లు తప్పవు. అంతటితో బెంబేలు పడిపోయి, నిస్పృహకు లోనై జీవితాన్ని అర్ధాంతరంగా చాలించుకునే యత్నాలు చేయకూడదు. మరణం ఒక్కసారే సంభవించాలి. కలతలతో, కన్నీళ్లతో మనసును దిటవుపరచుకోలేని బలహీనతలతో దినదిన గండంగా బతుకును నరకప్రాయం చేసుకోకూడదు. రోజూ చస్తూ బతికే వారు ఏ లక్ష్యాన్నీ సాధించలేరు.

భారతీయ ఆధ్యాత్మికతలోని గొప్పదనం ఏమిటంటే- అది విజ్ఞానంతో పాటు వివేకాన్నీ కలిగిస్తుంది. ఏది అశాశ్వతమో అది 'మాయ' అని చెబుతుంది. ఏ లక్షణాలవల్ల మనిషి పతనమవుతాడో తెలియజెప్పి హెచ్చరిస్తుంది. కేవలం బోధలతో సరిపెట్టకుండా అందుకు సంబంధించిన గాధల్నీ మనకు చెబుతుంది. కథలపట్ల మనిషికి సహజ కుతూహలంతోపాటు, మానవ మేధ సహజలక్షణం వల్ల అవి స్మృతికోశంలో పదిలంగా నిక్షిప్తమవుతాయి.

సముద్రజలాల్ని పైనుంచి చూస్తే కెరటాలుగానో, ఇంకాస్త ముందుకు వెళితే నిశ్చలజలంగానో కనిపిస్తాయి. కానీ, లోపల ఒక అద్భుత ప్రపంచమే ఉంది. సాధారణ నేత్రాలతో దాన్ని మనం చూడలేం. అందుకు ప్రత్యేక ప్రయత్నాలు చెయ్యాలి. భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానమూ అలాంటిదే. సాధారణ దృష్టికి ఎలాంటి ప్రత్యేకతలూ కనిపించవు. ప్రత్యేక శ్రద్ధ, కృషితో పరిశీలించినప్పుడు అమూల్యమైన, అద్భుతమైన విషయాలు మన ఎరుకకు వస్తాయి. జ్ఞానం అమూల్యమే కాదు, అపారమనీ మనకు అర్థమవుతుంది. అందుకే జ్ఞానాన్ని మహాసాగరంతో పోలుస్తారు. భరద్వాజ మహర్షి వేదజ్ఞాన శిఖరాలను బ్రహ్మ అనుగ్రహంతో దర్శించాకగానీ, సమస్త జ్ఞానాన్ని కైవసం చేసుకోవటం అసాధ్యమని గ్రహించలేకపోయాడని పురాణ కథనం.

మనకు మనమే జ్ఞానులమని భ్రమించటం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. చీకటిని వెలుగుతోనే జయించాలి. అజ్ఞానాన్ని జ్ఞానంతోనే జయించాలి. ముందు మన అజ్ఞానమేమిటో మనకు తెలియజెప్పేదేజ్ఞానం.

అజ్ఞానాన్ని గుర్తిస్తున్న కొద్దీ, దాన్ని దూరం చేసుకుంటున్న కొద్దీ- మనలో సుఖదుఃఖభావన, లాలస క్రమంగా నశించిపోతూ నిజమైన ఆనందం అనుభవానికి వస్తుంది. వసంతం ఉల్లాసానికి సంకేతం. జీవన వసంతం ఆధ్యాత్మిక వికాసానికి సంకేతం. ఎవరు ఆధ్యాత్మిక వికాసం పొందుతారో వారు సర్వకాలాల్లోనూ జీవన వసంతాన్ని అనుభూతిగా పొంది, ఎటువంటి మనోవికారాలూ లేని స్థిరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు.

అప్పుడే వారికి ఆధ్యాత్మిక ఫలాలు లభిస్తాయి. ఆత్మజ్ఞానులై 'అంతర్యామి'ని దర్శించగలుగుతారు.


- కాటూరు రవీంద్రత్రివిక్రమ్