ᐅఫాల్గుణ పర్వాలు
చైత్రం నుంచి ఫాల్గుణం వరకు మన సంప్రదాయంలో పన్నెండు మాసాలు. చివరిదైన ఫాల్గుణం ఎన్నో పండుగలకు పర్వాలకు నెలవు. ఫాల్గుణం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని భాగవత పురాణం చెబుతోంది. ఆదితి పయోవ్రతం ఆచరించి వామనుని పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం.
ఫాల్గుణ శుద్ధ తదియ శాలివాహన శక సంవత్సరాది. ఫాల్గుణ శుద్ధ చవితినాడు పుత్రగణపతి వ్రతం. వినాయక చవితి విధానంలోనే చేసే వ్రతం ఇది. ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలకైకాదశి అని, బహుళ ఏకాదశిని పాపమోచన్యేకాదశి అని అంటారు. మంజుఘోష అనే అప్సర, మేధావి అనే మునికి తపోభంగంచేసి శాపానికి గురై పాపమోచన్యేకాదశినాడు విముక్తి పొందిందని పురాణ కథనం. ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఆ రోజు పూజిస్తారు. ఈ ద్వాదశినాటి గంగాస్నానం పాపనాశనమని భావిస్తారు.
ఫాల్గుణంలో అత్యంత ఉత్సాహభరితమైన ఉత్సవం హోలీ. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు జరిగే హోలికోత్సవాన్ని మదనపూర్ణిమ లేక కాముని పున్నమి అని వ్యవహరిస్తారు. రాక్షస పీడ తొలగేందుకు హోలిక అనే శక్తిని ఆరాధిస్తారు. ఈ రోజునే ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో, బెంగాల్‌లో కృష్ణుడికి డోలికోత్సవం చేస్తారు. కృష్ణ విగ్రహాన్ని ఊయలలో ఉంచి పూజించే సంప్రదాయం ఉంది. ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణి నక్షత్రం వచ్చే రోజు లక్ష్మీజయంతి. షోడశోపచారాలతో లక్ష్మీదేవి అష్టమూర్తులను పూజిస్తారు. కనకధారాస్తోత్రం చేస్తారు. ఫాల్గుణ బహుళ తదియనాడు శబరగిరి వాసుడు, హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి జయంతి. ఈ మాసంలో మార్చి 14న సూర్యుడు మీనరాశిలో ప్రవేశించేరోజు మీన సంక్రమణం. దీన్ని షడశీతి సంక్రాంతి అంటారు. ఈ రోజున చేసే జపదానాలు విశేష ఫలప్రదమని విశ్వాసం.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు