ᐅప్రశాంత చిత్తం



ప్రశాంత చిత్తం 

జీవితం పట్ల సరైన, స్పష్టమైన అవగాహన లేక మనసు పరిపరి విధాల పరిగెడుతూంటుంది. ముందు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మారిపోయి దృష్టి ఎటో మరలిపోయి సాధారణమైన మన జీవన విధానంలో భయాలు, ఆందోళనలు, సందేహాలు కలిగి ఎటూ తేల్చుకోకుండా సందిగ్ధం ఏర్పడుతుంది. గతంలో జరిగినదానికి విచారించకూడదు. వర్తమాన కాలంలో జరుగుతున్న పరిణామాలను మనం అడ్డుకోలేం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవలసిందే! భవిష్యత్తులో జరగబోయేది తెలియదు. అందుచేత ఏం జరగబోతోందో అని ఊహించుకుని భయాందోళనలకు గురి కావడం ఎందుకు? ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయనీ భావించకూడదు. ప్రతికూలంగా జరుగుతాయని మానసికంగా సిద్ధపడితే ధైర్యంగా ఉండగలుగుతాం. అప్పుడు మనసు వైకల్యం చెందదు.
మన ఆలోచనా సరళిలో స్పష్టమైన అవగాహన ఉంటే, సందేహాలు కలగవు. ఒకవేళ కలిగినా ఆ సందేహాలకు సమాధానాలు వాటంతట అవే లభిస్తాయి. ఎవరి సలహాలూ సూచనలూ పాటించకుండానే సందేహ నివృత్తి కలుగుతుంది. ఒక నిబద్ధతతో, మార్గనిర్దేశనంతో మనం ముందుకు సాగాలి.

చిన్నచిన్న విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చి భూతద్దంలో చూసి భయపడకూడదు. అటువంటి చిన్న విషయాల్ని పట్టించుకోకుండా పక్కకు నెట్టేయాలి. కొందరు కొన్ని పనులు సాధించుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడ్డారనుకుందాం. ఆ సంఘీభావం వల్ల అనుకున్న ఆశయాలు నెరవేర్చుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ సంఘ సభ్యులు తమ లోపాలను ఒకసారి అవలోకనం చేసుకుని, వాటిని దిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరులు ఆ వైఫల్యాలను గోరంతలు కొండంతలుగా చిత్రీకరించి ఆ సభ్యులను దెప్పి పొడవకూడదు. సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వ్యక్తిని మనం ఆదుకుంటాం. మనం చేసిన సహాయానికి ఆ వ్యక్తే కృతజ్ఞతలు చెప్పకపోతే బాధపడతాం.

మనం పలకరింపుగా చిరునవ్వు నవ్వితే, అవతలివాళ్లు చిరునవ్వుతో స్పందించకపోతే కుంగిపోతాం, క్షోభపడతాం. వీడికింత తలబిరుసు అనుకుంటాం. అలాగే మనకూ తలబిరుసు లేకుండా చూసుకోవాలి. ఎదుటివారిలో ఏ లోపం ఉందనుకుంటామో, ఆ లోపం మనలో ఉండకుండా జాగ్రత్తపడాలి. మిన్ను విరిగి మీద పడిపోతున్నా, ప్రశాంతంగా ఉండే ఉత్తమ పురుషులు మన పౌరాణిక గాథల్లో కనిపిస్తారు. అందులో- ప్రహ్లాదుడు అయిదేళ్ల బాలకుడు. తన తండ్రి ఎన్ని బాధలు పెట్టినా, శ్రీహరి నామాన్ని నిరంతరం మననం చేసే ప్రశాంత స్వభావుడు.

తరవాత- రాజర్షి అయిన అంబరీషుడు. దుర్వాసమహర్షి క్రుద్ధుడై తన జటాజూటం నుంచి 'కృత్య' అనే అగ్ని జ్వాలలతో ఉన్న శక్తిని అంబరీషుడిపై ప్రయోగించాడు. అంబరీషుడు ప్రశాంతంగా రెండు చేతులూ తల మీద పెట్టుకుని శ్రీహరి నామస్మరణలో నిమగ్నుడైపోయాడు. అంతేకాని ప్రతీకారం తీర్చుకోవడానికి కించిత్త్తెనా ప్రయత్నించలేదు. ఆ శ్రీమహావిష్ణువే 'వెర్రితపసి చేయు వేడబంబు చక్కవెట్టుమనుచు' సుదర్శన చక్రాన్ని పంపి దుర్వాసుని పొగరు అణచివేశాడు.

ప్రశాంతచిత్తుల జాబితాలో ఉండాల్సినవాడు- ఉత్తమోత్తముడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు. తెల్లవారితే యువరాజుగా పట్టాభిషిక్తుడు కాదగినవాడు, జటాధారియై నారచీరలు ధరించి అడవులకు వెళ్లవలసి వచ్చినప్పుడు ప్రశాంత చిత్తంతో బయలుదేరాడు. 'పయోనిధి' అయిన సముద్రంలో బడబాగ్ని ఉంది. అటువంటి బడబాగ్నిని తనలోనే అణచుకుని గంభీరంగా అడవులకు వెళ్లాడు. అందుకే 'కరుణాపయోనిధి' అని స్తుతించాడు కంచర్ల గోపన్న అనే భద్రగిరి రామదాసు.

పైన పేర్కొన్న ఉత్తమ పురుషులు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మేరునగధీరులై, ప్రశాంత చిత్తులై, ఎటువంటి ఆందోళనలకూ గురికాకుండా నిలబడగలిగిన ధీరోదాత్తులు. వాళ్లను తలచుకుంటూ మనం ముందుకు సాగితే జీవితంలో అపజయాలు సైతం విజయాలుగా పరిణమిస్తాయి.

- బులుసు-జీ-ప్రకాష్