ᐅజీవన సాఫల్యం
మనిషికి లోకంలో అన్నింటికన్న ప్రధానమైంది జీవితమే. తన జీవితం కోసం ఎన్నిపాట్లు అయినా పడటానికి మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడేగాని, పోతేపోనీ అని ఉదాసీనత చూపడు. ఇది మానవనైజం. కొందరికి తాము కోరిన వ్యక్తి లభించడం జీవన సాఫల్యానికి నిదర్శనమైతే- మరికొందరికి కీర్తి, డబ్బు, అధికారం, ఉపాధి... ఇలా ఎన్నో, ఎన్నెన్నో!!
ఇవి మాత్రమే మనిషి బతుకు పండటానికి చిహ్నాలా, వీటిని మించినవి లేవా? కచ్చితంగా ఉన్నాయనే సమాధానాన్ని మన ప్రాచీనులు నొక్కి వక్కాణించారు. సరసంగా మాట్లాడగల చాతుర్యం, చక్కని సంతానాన్ని అందించిన భార్య, దానం చేయగలిగినంత స్థాయిలో ధనలాభం అనేవి జీవిత సాఫల్యానికి గుర్తులని ఒక కవి అంటాడు. అసలు లోకంలో ఎవడు జీవించి ఉండటంవల్ల అన్ని ప్రాణులూ సుఖసంతోషాలతో ఉంటాయో అలాంటివాడే జీవిత సాఫల్యాన్ని పొందినవాడు అవుతాడని విష్ణుశర్మ పంచతంత్రంలో అంటాడు. కాకి కూడా నూరేళ్లు బతుకుతుంది గానీ ఏం లాభం? జీవితమంతా ఎంగిలి మెతుకుల్ని ఏరుకొని తిని, పొట్ట నింపుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలుగుతోందా? అందుకే పొట్ట నింపుకోవడం కోసం బతికేది బతుకు కాదు. తన పొట్ట నింపుకోవడంతోపాటు తోటివారి ఆకలి తీర్చినప్పుడే తిన్న అన్నం జీర్ణమవుతుందని గ్రహించాలి. ప్రాణాపాయ పరిస్థితిలో సైతం 'అన్నమో రామచంద్రా!' అని ఆకలితో దగ్గరకు వచ్చేవారికి తాను తినకున్నా సరే పెట్టాలనే రంతిదేవుడు ఆదర్శం కావాలేగాని, 'చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష' అనుకొంటూ అన్నంమీద పడి మెక్కకూడదని మన శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. డబ్బు శాశ్వతమా? కానే కాదు. జీవితం శాశ్వతమా? అసలే కాదు. యౌవనం చిరస్థాయిగా ఉంటుందా? ఏమాత్రం ఉండదు. ఇలాంటి అశాశ్వత విషయాల కోసం మనిషి ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూస్తే ఏవగింపు కలగక మానదు. మంచి గుణాలు గలవాడు మరణించినా, కీర్తితో జీవించే ఉంటాడు. చెడు నడక గలవాడు జీవించి ఉన్నా మరణించినవాడితో సమానమే అంటారు మన పెద్దలు. కేవలం చావుపుట్టుకలతోనే గణన పొందే మనిషి జీవితానికి ఏ సార్థకతా ఉండదు. తన పుట్టుకవల్ల తన వంశానికీ, చుట్టూ ఉన్న సమాజానికీ, విశాల ప్రపంచానికీ ఎవడు మేలు కలిగిస్తాడో వాడే నిజంగా పుట్టినవాడి కింద లెక్క. లేకుంటే అలాంటివాడు వ్యర్థజీవే.
'తాబేలు జన్మ గొప్పది. అది తన వీపుపై సకల భువనాలనూ వహిస్తున్నది... ధ్రువనక్షత్రం ఎంతో గొప్పది. దాన్ని ఆలంబనగా చేసుకొని కోట్లకొద్దీ నక్షత్రాలు పరిభ్రమిస్తున్నాయి. జీవిస్తే తాబేలువలె, ధ్రువనక్షత్రంవలె జీవించాలి. మేడిపండులోని పురుగులా జీవించకూడదు. ఎందుకంటే- మేడిపండులోని పురుగు ఆ పండును పాడుచేయడంతోబాటు, ఇతరులకు ఆ పండును పనికిరానిదానిగా మారుస్తోంది' అని వర్ణించాడు ఒక ప్రాచీనకవి. జీవితాన్ని సఫలంగా మార్చుకోవాలంటే సద్గుణాలను ఆశ్రయించక తప్పదు. ఔషధాలు సేవించకపోతే రోగం తగ్గదు కదా. అలాగే ఎప్పుడూ మంచినే కోరుకోవడం, కోరుకున్న మంచిని ఆచరించడానికి పూనుకోవడం అనే విద్యను మనిషి నేర్చుకుంటే- అతని జీవితం సఫలం కాగలదనడంలో ఎలాంటి సందేహం లేదు.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ