ᐅమేరీమాత ఉత్సవాలు
అదొక రాజ్యం. శత్రువుల దాడితో రాజ్యమంతా రక్తసిక్తమైంది. వైరి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఇంటినుంచీ ఒక యువకుడు స్వచ్ఛందంగా యుద్ధభూమికి తరలిరావాలని ఆ దేశపు రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఆ క్రమంలో యుద్ధంలో చేరడానికి ఒక యువకుడు సిద్ధమయ్యాడు. నూనూగు మీసాలతో, ఇంకా లేతదనం వీడని ఆ కుర్రవాడిని పంపడానికి అతడి తల్లి ఇష్టపడలేదు. కొడుకును హత్తుకొని విలపించింది. నవమాసాలు మోసి, కని పెంచిన ఆ కుర్రవాడు యుద్ధంలో బలి అవుతాడని ఆమె భయపడింది. ఆ సమయంలో ఆమెకు ఒక బోధకుడు ఎదురయ్యాడు. 'తల్లీ... ఈ రాజ్యాన్ని రక్షించడానికి మిగతా పౌరులతోపాటు నీ కుమారుణ్ని పంపడానికి ఎందుకు వెనకాడుతున్నావ్... రెండు వేల సంవత్సరాల క్రితం ఈ సృష్టిలోని సమస్త మానవులను రక్షించడానికి ఒక తల్లి తన ప్రియకుమారుడినే అర్పణ చేసింది' అంటూ ఆయన ఆమెకు బోధించారు.
ఆ బోధకుడు చెప్పిన తల్లి మేరీమాత. సమస్త మానవాళి పరిహారార్థం సిలువపై బలియాగం చెందిన ప్రభువైన యేసుక్రీస్తును కన్న మాతృమూర్తి ఆమె. ప్రేమానురాగాలు పంచే మాతృమూర్తి. మానవజాతి జీవితపుస్తకంలో తల్లి గురించిన అధ్యాయం మహోన్నతమైంది. తల్లిని నడిచే దైవం అనీ, తనకు మారుగా అన్నిచోట్ల ఉండలేక దేవుడు తల్లిని సృష్టించాడని ఆధ్యాత్మికులు ప్రవచించారు. తల్లి దైవసమానురాలైనప్పుడు, ఆ దైవ కుమారుడిని కన్న తల్లి ఎంతటి మహిమాన్వితురాలు! లోకమాతగా ఆరాధన పొంది, జగన్మాతగా ఆధ్యాత్మికులు కీర్తిస్తున్న మేరీమాత పుట్టింది ఇజ్రాయెల్‌లోని గలిలియో ప్రాంతానికి చెందిన నజరేత్ అనే ఊరు. మూడు సంవత్సరాల వయసులోనే ఆమె యెరుషలేమ్ దేవాలయానికి చేరి యుక్తవయసు వచ్చేవరకు అక్కడే పెరిగినట్లు లేఖనాలు పేర్కొంటున్నాయి.
మేరీమాత ఒక పేద యూదు స్త్రీ. ఆమె ప్రభువైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చినప్పుడు ఓ పశువుల పాకలో ప్రసవవేదన పడింది. అప్పుడే పుట్టిన బిడ్డను వేరే చోటులేక పశువుల తొట్టెలో పడుకోబెట్టవలసివచ్చింది. ఆనాటి రాజైన హేరోదు నుంచి తన బిడ్డను రక్షించుకునేందుకు ఆమె బాలింతరాలుగానే తన భర్తతో ఆ పసికందును తీసుకుని ఈజిప్ట్ దేశానికి ప్రయాణించవలసి వచ్చింది. యేసుక్రీస్తు చిన్నబిడ్డగా ఉన్నప్పుడు ఆమె అతణ్ని యెరుషలేమ్ దేవాలయానికి దర్శనం నిమిత్తం తీసుకువచ్చింది. ఆ బిడ్డను చూసి 'ఇతడే మెస్సయా... రక్షకుడు, భవిష్యత్తులో ఇతడివలన ఈమెకు హృదయంలో ఖడ్గం దూసుకుపోయినంత దుఃఖం కలుగుతుంది' అని ఆ దేవాలయ పెద్ద సీమోను చెప్పాడంటారు. మూడు దశాబ్దాల తరవాత యేసుక్రీస్తు సిలువపై వేలాడినప్పుడు, ఆయన గుండెలపై సైనికులు ఈటెతో పొడిచిన దృశ్యం చూసిన మేరీమాత హృదయంలో ఖడ్గం దిగినంతగా దుఃఖపడిందని- ఆమెను 'వ్యాకులమాత'గా భక్తులు ఆరాధిస్తున్నారు. అలా నాటినుంచి నేటివరకూ మేరీమాతను వేర్వేరు పేర్లతో భక్తులు ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. భారతదేశంలో వేళాంగణి, ఫ్రాన్స్‌లోని లూర్దు, పోర్చుగల్‌లోని ఫాతిమా ప్రాంతాల్లో మేరీమాత పుణ్యక్షేత్రాలు వెలశాయి. 1925 సంవత్సరంలో ఫాదర్ ఆర్లతి అనే బోధకుడు విజయవాడలోని గుణదలలో సహజసిద్ధంగా ఏర్పడిన గుహల్లో మొదటిసారిగా మేరీమాత విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు జరిపాడంటారు. 1971నుంచి ఆ ప్రాంతంలో భారీయెత్తున మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జనవరి 31న ఈ ఉత్సవాలు మొదలై నేటితో ముగుస్తున్నాయి. మేరీమాత జీవితగాథను పరిశీలిస్తే- ప్రపంచంలోని ఏ తల్లికీ లేనన్ని వేదనలు, శ్రమలు, దుఃఖాలకు ఆమె గురైందని మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు జననంనుంచి మరణం దాకా జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ ఆమె చూపిన ఆత్మస్త్థెర్యం, విశ్వాసం ద్వారా ఎందరికో ఆరాధ్య దేవత అయింది. నేడు లక్షలాది భక్తులు కులం, మతం, ప్రాంతీయ భావనలకు అతీతంగా భక్తిభావంతో ఆమెను లోకమాతగా ఆరాధిస్తున్నారు. మేరీమాత ఉత్సవం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
- డాక్టర్ ఎమ్.సుగుణరావు