ᐅఆత్మతత్వం
నిత్యమైనది ఆత్మ. సత్యమైనది ఆత్మ. దేహి నిత్యుడు. తోలుతిత్తిలాంటి దేహం అనిత్యమైనది. ప్రాపంచిక విషయాల మీద అత్యంత ఆసక్తి కనబరుస్తూ, దైహిక సుఖాలు తీర్చుకోవడంలోనే తన్మయం చెందే ప్రాణి అత్యంత అల్పుడని చరిత్ర నిరూపించింది. అరిషడ్వర్గాలను జయించగలిగితేనే సామాన్యుడు మాన్యుడవుతాడు. తనలో కలిగే క్రోధం, కామం తాత్కాలిక సుఖాన్నిచ్చేవే కానీ- శాశ్వత సుఖాలకు మార్గదర్శనం చేయించేవి కావని మానవుడు గ్రహించాలి.
ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం అత్యంత ఆవశ్యకమని భారతీయ సనాతన సంస్కృతినుంచి నేటివరకు ఉదాత్త జీవనం గడిపిన ఎందరో మహనీయుల చరిత్ర చెబుతోంది.
బయటపడ్డ తన అవయవాలను అనుకూల పరిస్థితిలేనప్పుడు తాబేలు ఎట్లా లోపలికి ముడుచుకుంటుందో, స్థితప్రజ్ఞుడు తన విషయ వాంఛలను వెనక్కు మరలిస్తాడు. కోరికలను ఎవడు అణచగలడో వాడినే ధీరుడిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అటువంటివాడు రజోగుణం లేక ముక్తిమార్గాన్ని దర్శించగలుగుతాడు.
ఇంద్రియాలను నిగ్రహించటం అంత సులవైన విషయం కానేకాదు. ఆత్మ నియంత్రణతో, ఆత్మ సంయమనంతోనే అది సాధ్యపడుతుంది. ఇంద్రియాలను సమిధలుగా కలిగి ఆత్మ అనే అగ్ని వెలుగుతూ ఉంటుంది. ఈ ధరిత్రిలోని సమస్త ప్రాణుల నూతన ఆత్మలో దర్శించగలిగినవాడికి సూక్ష్మతత్వ దర్శనం కలుగుతుందంటారు. ఆత్మను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకుని జ్ఞానదీపం హృదయంలో ప్రకాశవంతంగా వెలిగే రుషులూ, తపోధనులూ ఎందరో ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో తేటతెల్లం చేశారు.
శరీరమనేది ఒక సముద్రంలాంటిది. ఇంద్రియాలనే ఉత్తుంగ తరంగాలు ఇందులో పడిలేస్తూ కల్లోలం చేస్తూ ఉంటాయి. వాటికి కామక్రోధ లోభాది అరిషడ్వర్గాలు ప్రభువులు. వాటిని జయించినప్పుడే ఈ సముద్రాన్ని దాటి జ్ఞానతత్వం వైపు మళ్ళగలుగుతాం! ఆ పథంలోకి పురోగమించడానికి ఆత్మ నియతి చాలా అవసరం.
గీతాచార్యుడు ఆత్మ తాలూకు నిజమైన వర్తన, స్వరూపాన్ని అందరికీ దర్శింపజేశాడు- పాండవ మధ్యముడైన అర్జునుడితోపాటు.
'ఈ ఆత్మ ఏ కాలమందునూ పుట్టదు, గిట్టదు. ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామం, అపక్షయం, వినాశం అనే భావ వికారాలు లేనిది. జన్మలేనిది. మానవుడు జీర్ణ వస్త్రాలను త్యజించి, నూతన వస్త్రాలు ధరించినట్లు జీవాత్మ పాత శరీరం వీడి నూతన శరీరాన్ని పొందుతుంది. ఆత్మ ఛేదించటానికి, దహించటానికి వీలులేనిది. ప్రతి దేహంలో ఉండే ఈ ఆత్మను వధించటం ఎవరికీ వీలు కాదు' అని హితబోధ చేస్తూ, దుష్ట శిక్షణకు అర్జునుణ్ని ముందుకు నడిపాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడి ధర్మబోధతో ముందుకు కదిలిన పార్ధుడు మరో ఆలోచన లేకుండా యుద్ధంలో వీరవిహారం చేసి పాపభారాన్ని తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఇది ద్వాపర యుగానికే కాదు, ఏ యుగానికైనా వర్తిస్తుంది. ఆత్మను పవిత్రంగా ఉంచుకుని, ఇంద్రియ నిగ్రహంతో ముందుకు సాగుతూ మానవులంతా సత్కర్మలను ఆచరించాలి. ఆ విధంగా మానవాళికి మంచి జరుగుతుంది. విషయ వాంఛలపై ఆసక్తిని విడనాడి, జ్ఞాన సముపార్జనపై దృష్టి సారించిన జీవుడు ధీరుడవుతాడు. అందరిలో మహితమైన ఆలోచనలు వెలిగించి మహనీయుడవుతాడు.
- వెంకట్ గరికపాటి