ᐅశ్రమజీవన సౌందర్యం





శ్రమజీవన సౌందర్యం 

'కాయకమే కైలాసం' అన్నాడు వీరశైవ ప్రవర్తకుడు బసవేశ్వరుడు. శ్రమజీవనమే మానవుడికి ముక్తిని ప్రసాదిస్తుందని వీరశైవ సిద్ధాంత సారాంశం. 'సోమరిపోతు మెదడు దెయ్యాలకు నిలయం' అని ఆంగ్ల సామెత. శ్రమజీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని ఆధునికాంధ్ర మహాకవి ఉవాచ.
ఒకరిపై ఆధారపడి, వారికోసం వేచి చూడటం కంటే, మన పని మనమే చేసుకుంటే అది వెంటనే జరుగుతుంది; సక్రమంగా కూడా పూర్తవుతుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడటం కంటే, ఎవరి పని వారే చేసుకోవడానికి ప్రయత్నించాలి. పనిని కష్టపడి చేస్తున్నట్లుగా గాక, ఇష్టపడి చేయాలి. అప్పుడే ఎంత పెద్ద పనైనా శ్రమ అనిపించదు.

మన ప్రాచీనులు శారీరక శ్రమను గౌరవంగానే భావించారు. భార్యనూ పిల్లలనూ పోషించడం కోసం 'హాలికులైన నేమి, కందమూల కౌద్ధాలికులైన నేమి?' అని సంతోషంతో శ్రమజీవనాన్ని గడిపిన పోతన వంటి మహాపురుషులు మనదేశంలో ఎందరో!

సుగాత్రిని ఆభరణాలతో అలంకరించి, పట్టుబట్టలు కట్టి నాథుని వద్దకు పంపుతారు తల్లిదండ్రులు. కృత్రిమమైన ఆ సౌందర్యం ఆమె భర్త అయిన శాలీనుణ్ని ఆకర్షించదు. భార్యను ప్రేమగా చూడడు. ఒకరోజు పెద్ద గాలివాన వస్తుంది. తోటలో పూలమొక్కలు పడిపోతున్నాయని, సుగాత్రి ఆభరణాలు తీసి, ముతక వస్త్రాన్ని కట్టుకొని, వర్షంలో తడుస్తూ, మొక్కలు పడిపోకుండా నిలబెడుతూ, పాదులు తవ్వుతూ ఉండగా- ఆమెను భర్త చూస్తాడు. ఆమె సౌందర్యం శాలీనుణ్ని ఆకర్షిస్తుంది. ఆమె పట్ల ప్రేమను ప్రకటిస్తాడు. ఇలా శ్రమజీవన సౌందర్యాన్ని కళాపూర్ణోదయ కావ్యం కళాత్మకంగా చాటింది.

వివేకానందస్వామి అమెరికాలో పర్యటించిన తరవాత మిత్రులతో 'నా జీవిత సమ్మోహిని అమెరికాలో ఉన్నది' అన్నాడు. 'ఎవరామె?' అని ఆశ్చర్యంతో మిత్రులు ప్రశ్నించగా, 'శ్రమపడి పనిచేసే మనస్తత్వమే నా జీవిత సమ్మోహిని. పాశ్చాత్య దేశాల్లో ఈ సుగుణాన్ని నేను గమనించాను!' అని ప్రశంసాపూర్వకంగా పలికాడు.

ఒకచోట సైనికులు కొందరు శ్రమించి పనిచేస్తున్నారు. పెద్ద దూలాన్ని లేవనెత్తడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా అది కదలడం లేదు. 'పట్టండి! ఎత్తండి! నెట్టండి! కట్టండి! లాగండి!' అని సమీపంలో నిలుచుని ఒక వ్యక్తి కేకలు వేస్తున్నాడు.

ఆ తోవన ఒక బాటసారి గుర్రంమీద పోతూ, ఈ దృశ్యాన్ని చూసి ఇలా అన్నాడు. 'అయ్యా! పట్టండి, లాగండి, అలా చేయండి, ఇలా చేయండి అనే బదులు తమరే నడుంవంచి వాళ్లకు సాయం చెయ్యవచ్చు గదా!'

ఆ ఆజ్ఞలిచ్చే వ్యక్తికి రోషం వచ్చింది. అధికారదర్పంతో ఇలా అన్నాడు. 'ఎవరనుకుంటున్నావు నన్ను? తారతమ్యాలు ఎరగకుండా మాట్లాడుతున్నావ్... నేను సేనాధిపతిని!'

'అయ్యయ్యో! మీరు అంత గొప్పవారని తెలియక ఏదో అన్నాను... మన్నించండి!' అని, ఆ బాటసారి గుర్రం దిగివచ్చి, సైనికులతోపాటు తానూ ఓ చెయ్యివేశాడు. దూలాన్ని కదిలించడంలో సాయపడ్డాడు. సేనాని మాత్రం దర్జాగా నడుంపై చేయి పెట్టుకొని నిలుచుని చూస్తూ ఉన్నాడు.

'అయ్యా! పని పూర్తయింది! ఇంకెప్పుడైనా ఏదైనా పని తగిలితే పిలవండి!' అన్నాడు వినయంగా బాటసారి.

'ఎవరు నువ్వు?'

'నన్ను వాషింగ్టన్ అంటారు! ఈ దేశ సర్వసైన్యాధ్యక్షుణ్ని!' అని సమాధానమిచ్చాడు అశ్వికుడు వినమ్రంగా.

సేనాపతి నివ్వెరపోయాడు. తన తప్పు గ్రహించాడు. ఉత్తములెప్పుడూ శ్రమపడటానికి వెనుదీయరని తెలుసుకున్నాడు!

- పి.భారతి