ᐅఆనందమే జీవితం
జీవితం ఎందుకు? ఈ ప్రశ్నకు- పుట్టినది మొదలు మరణించేంతవరకూ ఎల్లప్పుడూ సంతోషంతో ఆనందంగా గడపడమే జీవితం అనే సమాధానం వస్తుంది. భగవంతుని దృష్టిలో పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరూ ఒకటే. ప్రతివారూ వారి వారి కర్మలకు బద్ధులై జీవితాన్ని అనుభవిస్తారు. కర్మానుగుణంగా అనుభవించే జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు, కష్టనష్టాలు సముద్రంలోని అలల్లా వస్తూపోతుంటాయి. ఏదీ శాశ్వతం కాదు. సంతోషమూ ఎల్లప్పుడూ ఉండదు, దుఃఖమూ ఎల్లప్పుడూ ఉండదు. సాధారణంగా ఇలాంటి అనుభవాలే అందరం పొందుతూ ఉంటుంటాం. ఎవరికైతే కష్టం కలిగినా సుఖంగా భావిస్తాడో అతడే స్థితప్రజ్ఞుడవుతాడు. మనసును దుఃఖ భావనతో నింపుకొనక తన కర్మానుభవంగా ఎంచి, బుద్ధితో నిర్మల మనసుతో వ్యవహరించేవాడే స్థితప్రజ్ఞత్వం కలిగినవాడు.
ఏది లభించినా, ఎంతో కొంత లభించినా, ఆ లభించిన దానితోనే సంతృప్తి పొందుతాడు స్థితప్రజ్ఞుడు అని భగవద్గీతలో అన్న కృష్ణుడు- ఆనందకరమైన జీవితానికి ఉపాయం తెలియజెప్పాడు.
ఒక విధంగా- ఇది కష్టమే అయినా సాధన చేసిన వారికి సులువే. ఆత్మసంతృప్తి లేనిదే దీన్ని సాధించడం కష్టం. అందుకే తృప్తిని అలవరచుకోవాలి. ఆశను త్యజించాలి. ఆశయం ఉన్నా అది లభించకపోయినా కుంగిపోకుండా ప్రయత్నం చేయాలి. ఫలితమేదైనా దైవప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే సంతృప్తి దక్కుతుంది. కష్టమంటే తెలియకుండా ఉంటుంది.
తనను అడవికి పంపించాల్సిందిగా దశరథుడిని కైకేయి కోరిందని శ్రీరాముడికి తెలిశాక- ఆమెపై ప్రేమను పెంచుకొన్నాడే తప్ప ద్వేషం చెందలేదు సీతాపతి. తమ్ముడు భరతుడికే పట్టం కట్టబెట్టడానికి తండ్రి ఇచ్చిన హామీని నిలబెట్టే యత్నంలో అతనికి అడవులకు వెళ్లడమనే విషయం కష్టమే అనిపించలేదు. పైగా అపరిమితమైన ఆనందం కలిగింది. వెంటనే ఆచరించాడు- లోకానికి ఆదర్శంగా నిలిచాడు. అదీ స్థితప్రజ్ఞత్వ లక్షణం.
కష్టమైనా, సుఖమైనా మనసులోనికి తీసుకోకుంటే ఆ మనిషి ఆనందమే అనుభవిస్తాడు. అన్నమాచార్యుడు కూడా జీవితం అంతా ఒక నాటకంలా భావించమంటాడు- 'పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమిది నాటకము' అంటాడు. జనన మరణాలు మాత్రమే నిత్యసత్యాలు. మధ్యలో కొనసాగే జీవనంలో బాల్య, కౌమార, యౌవన, వృద్ధ అవస్థలతో కొనసాగేదంతా నాటకం. ఈ జీవన నాటకంలో క్రోధం, లోభం, మోహం, చెడు జరుగుతుందేమోనన్న భయం, వీటితోపాటు కలిగే ఈర్ష్య, అసూయ లక్షణాలు ఇవన్నీ మనసును చలింపజేసేవే. ఆనందకరమైన జీవితానికి ఆటంకం కలిగించేవే. అందుకే ఆనందంతో కూడిన, సంతృప్తికరమైన జీవితానికి ఇవేమీ ఆటంకం కాకుండా మనిషి సాధన చేయాలి.
ఏదీ మన వెనక రాదు, ఏదీ తెస్తూ ఈ భూమిపై మనం పుట్టలేదు అన్న నగ్నసత్యాన్ని ఎల్లప్పుడూ మనం మననం చేసుకోవాలి. బతికినంత కాలం 'నాది' అనే భావన కలగకుంటే మన ఆనందం మన చెంతే ఉంటుంది. నిజానికి పరమాత్మ స్వరూపమే ఆనందం. అతను మనలో ఉన్నాడు- ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆ దైవం మనకు తోడు ఉండగా మనం దుఃఖాన్ని ఎలా అనుభవిస్తామన్న విచారణ మనం చేయాలి. అందుకే ప్రతి విషయంలోనూ మనోస్థిరత్వం కలిగి ఉండి, నిష్కపట, నిర్మలత్వాన్ని మనసు సాధిస్తే- సర్వత్రా మనకు ఆనందమే కలుగుతుంది. ఈ జీవితం ముళ్లబాటైనా, పూలబాటైనా మనం ఆనందంతోనే కొనసాగుతాం. సంతోషంతోనే జీవిస్తాం. కష్టసుఖాలను రెండూ సమంగా భావిస్తూ ఆగని కాలచక్రంతో పాటు సాగే జీవన చక్రంలో ఎల్లప్పుడూ ఆనందం అనుభవించాలంటే- అనునిత్యం ప్రకృతిని పరిశీలించాలి. సూర్యచంద్రులపై దట్టమైన మేఘాలు కమ్మినా, గ్రహణాలే కలిగినా కాసేపటికంతా సర్దుకుంటుంది. చంచలం కాకుండా మనసును స్వాధీనంలో నిలుపుకొంటే మనంత ఆనందం మరెవరికీ ఉండదు. మన జీవితమంతా ఆనందమయమే!
- డాక్టర్ మరింగంటి మధుబాబు