ᐅప్రేమే దైవం





ప్రేమే దైవం 

ద్వేషంతోకాక ప్రేమతోనే ఏదైనా సాధించగలం. శత్రువులను సైతం మిత్రులుగా మార్చే మహత్తర తత్వం ప్రేమలోనే ఉంది. మానసం ప్రేమమయమైతే చేతులు ఆపన్న హస్తాలవుతాయి. అరిషడ్వర్గాలను దూరం చేసి ప్రేమ మాధుర్యాన్ని విస్తరింపజేయడం కోసమే యుగయుగాల్లో మహానుభావులెందరో అవతరించారు. కులాలకు మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక భావ విరులను వికసింపజేశారు. ప్రేమ ప్రాతిపదికనే సమాజానికి మార్గాలు రూపొందించారు. సమదృష్టితో రాగద్వేషాలను విడచి ఇతరుల బాధలను తీర్చేవారే దైవస్వరూపులు. అలాంటివారికి విశ్వమంతా శిష్యులే!
ప్రేమనూ, సేవాతత్వాన్నీ ఆచరించడం అంత సులభం కాదు. ప్రతి మనిషిలో దైవం ఉంటాడని అందరికీ తెలుసు. ఆ జ్ఞానాన్ని వాస్తవం చేసుకునేవారు కొందరే! ఇలాంటివారే మనలను భౌతికత్వంనుంచి ఆధ్యాత్మికత్వానికి చేర్చగలుగుతారు. ప్రేమ, ధర్మం, శాంతి- పవిత్ర జీవితానికి సోపానాలు. పరమ పావనులైన ఆ మహానుభావులకు మతం హితం కాదు, మానవత్వం తప్ప! విశ్వంలో అందరినీ ప్రేమించే వ్యక్తికి- గుడి, చర్చి, ఇతర ప్రార్థన మందిరాల మధ్య తేడా ఉండదు. వారికి జగమే ఒక ఆలయం. ఉనికే ఒక చర్చి.

గౌతమ బుద్ధుడు శాంతిని, ప్రేమను మానవుల్లో విస్తరించడం కోసం రాజభోగాలను త్యాగం చేశాడు. శాసనాలు, ఆజ్ఞలు, నైతిక సూత్రాలు, శిక్షాస్మృతులు చేయలేని గొప్ప సామాజిక చైతన్యాన్ని- బుద్ధుడి బోధనలు సాధించగలిగాయి. ప్రతి మనిషిలో... వాడెంత కఠినుడైనా కానీ... మనసులో ఏదో ఒక మూల ప్రేమ అచేతనంగా ఉంటుంది. ఆ ప్రేమతత్వాన్ని చేతనం చేయగలిగేవారే దైవస్వరూపులు.

మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకరు మానవజాతిని విభజిస్తూ ఉంటారు. మరొకరు మానవజాతిని ఏకం చేసే ప్రయత్నం చేస్తారు. రెండో కోవకు చెందినవారే యుగపురుషులు.

సర్వ ప్రపంచమూ సుఖసంతోషాలతో మనగలగాలనే భావనకు ప్రేమే మూలం. పశుపక్ష్యాదులతో సహా జీవరాశులన్నింటినీ అక్కున చేర్చుకోవడమే ఆధ్యాత్మికం. ఆ ప్రయత్నానికి బాహ్య ప్రపంచంలోని ప్రలోభాలు అడ్డంకులు కావు. ఎందుకంటే... అందరూ నా వారేననే భావన అంతర్గత ఆధ్యాత్మిక ఆనందమార్గం కనుక!

ప్రేమతో జీవించే విధానంలో నవ్యత ఉందని ఆ జీవనవిధానాన్ని అవలంబించే వారెందరో ఉంటారు. ఈ విధానంవల్ల వికాసం, నైపుణ్యం, పరిణతి పొందుతారు. ఉపరితలంపై విస్తరించే లతల్లాగా కొందరు ధర్మాత్ములు మరికొందరిలో దైవత్వాన్ని నింపుతుంటారు. మానవ సమాజాన్ని చైతన్యం చేస్తారు. జీవన సాఫల్యం సాధిస్తారు. వత్తిని కాల్చి వెలుగును వికసింపజేస్తారు. వత్తి నలుపుగా వికారంగా మారుతుంది. మహానుభావుల భౌతిక శరీరాలూ అలాంటివే. వారు పరితపిస్తూ మానవుల్లో వెలుగును నింపుతారు. వారు దైవస్వరూపులు, వారి స్థావరాలే దేవాలయాలు. వారు నడయాడిన నివాసాలే ప్రశాంతి నిలయాలు.


- అప్పరుసు రమాకాంతరావు