ᐅవిశ్వబంధం




విశ్వబంధం 

వ్యక్తిని అర్థం చేసుకున్నప్పుడే సమాజం అర్థం అవుతుంది. అణువును విశ్లేషించినప్పుడు విశ్వానికి చెందిన అనేక సూత్రాలు తెలుస్తాయి. వ్యక్తికి మూడు రకాల సమస్యలు ఎదురవుతాయి. భౌతికమైనవి, సామాజికమైనవి, ఆధ్యాత్మికమైనవి. వ్యక్తి సమస్యలను పరిష్కరించడానికి జరిపే ప్రయత్నాలు ఒక్కొక్కసారి అనేక సమస్యలకు దారితీస్తాయి.
పురాణాల్లో ఒక కథ ఉంది. శివుడి ఆశీస్సులు పొందడానికి ఒకసారి ఒక ఎలుక తపస్సు చేసిందట. శివుడు జాలిపడి ఆ ఎలుకను పిల్లిగా మార్చాడు. ఎలుక పిల్లిగా మారితే పిల్లుల బెడద తప్పినట్లే కదా! కుక్కలంటే ఆ పిల్లి భయపడసాగింది. పిల్లి తపస్సు ప్రారంభించింది. అనేక దశల్లో తపస్సును తీవ్రం చేయడంవల్ల పిల్లి కుక్కగా, కుక్క చిరుతపులిగా, చిరుతపులి మనిషిగా మారుతూ వచ్చింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై 'ఇప్పుడు నీ భయాలన్నీ పోయాయా?' అని అడిగాడు. 'మనిషిగా మారినా, నా సమస్యలు తీరలేదు. ఇప్పుడు నాకు మృత్యుభయం పట్టుకొంది... తిరిగి నన్ను ఎలుకగా మార్చు ప్రభూ' అని వేడుకున్నాడు మనిషి. శివుడు 'తథాస్తు' అన్నాడు. మనిషి తిరిగి ఎలుకగా మారాడు!

మనిషి తన సుఖంకోసం సృష్టించిన ధనం కానీ, మరేదైనా అనేక సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ సమస్యలనుంచి మనిషి పారిపోయి మతం చూపే ఆధ్యాత్మిక ప్రకాశం వైపు తిరుగుతాడు. ఐక్యతా బంధం, సామరస్య సుగంధం- ఇవే నిజమైన ఆధ్యాత్మిక ముత్యాల సరాలు. మనిషి సమస్యలను మతం పరిష్కరించడంలో విఫలమైనదని కొందరంటారు. మితిమీరిన ధన సంపాదనకు, రోగాలను నయం చేయడానికి, న్యాయస్థానాల్లో దావాలు గెలవడానికి మతాన్ని వాడుకోవడంవల్ల కలిగిన దుస్థితి అది. నామరూపాలకు ప్రాధాన్యం ఇవ్వడం పరిపాటి అయింది. వాటికోసం మతం పుట్టలేదు. ఆధ్యాత్మిక భూమికలో మనిషి చైతన్యాన్ని సుస్థిరం చేయడమే దాని అసలు లక్ష్యం.

ఐక్యతే మతంలోని అంతఃస్ఫూర్తి, ఆత్మ. గతంలోని మత యుద్ధాలకు నామరూపాలే కారణం. చైతన్య స్వరూపులమైన మనమంతా ఒకే చైతన్యంనుంచి ఆవిర్భవించాం. అందరూ ఒక్కటే అన్న సూత్రమే మతానికి పునాది. అదే మానవతా మకుటం. చైతన్య స్వరూపులైన జీవులంతా ఒక్కటే. ఈ ఐక్యత సామరస్య (అను)బంధం కనుక మనం సాధిస్తే- అసలు మనం పోరాటాలకు దిగుతామా? ఒక వ్యక్తి మరొక వ్యకిని దోపిడి చేస్తాడా? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ద్వేషిస్తాడా?

ఆదిమానవ దశను దాటి మహోన్నత నాగరికతను, సంస్కృతిని సాధించామని సగర్వంగా చెప్పుకొంటున్నాం. మరి మనలో ఐక్యత, సామరస్య సుగుణ సౌరభం... ఎంతవరకు ఉన్నాయి? అందరూ ఒక్కరేనన్న భావనే నిజమైన మతం. అదే నిజమైన ఆధ్యాత్మికత. ఈ భావన ఎంతగా బలపడుతుందో అంతటి ఔన్నత్యానికి మనం చేరుకుంటాం. దీన్నిబట్టి ఆలోచిస్తే- మనం మతం ఉపరితల భాగాన్నే ఇన్ని యుగాలూ స్పృశించాం. అసలు మతం లోతుల్లోకి, ఆధ్యాత్మిక అంతఃకుహరంలోకి మనం తొంగి చూడనేలేదు.

విశ్వమానవ సౌభ్రాతృత్వానికి మించిన మతం లేదు. బాహ్యమైన పూజలకన్నా ఒక్క బాధాగ్నితప్త హృదయాన్ని ప్రేమతో పలుకరించడం మిన్న! ఆనాడే మనిషి విశ్వసార్వభౌముడు.

- కె.యజ్ఞన్న