ᐅహృదయ వైశాల్యం
గోరంతదీపం ఇంటి మొత్తానికి వెలుగునిస్తుంది. అలాగే గోరంత మంచిమనసు మనిషిని ఉన్నతుణ్ని చేయడమేకాక, చుట్టూఉన్న సమాజాన్నీ అద్భుతంగా ప్రభావితం చేస్తుంది. ఆత్మలో వెలుగుంటే మనిషిలో సౌందర్యం ఉంటుంది. అతని ఆంతరిక బాహ్యసౌందర్యాలవల్ల కుటుంబంలోని సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇల్లు ప్రశాంతంగా ఉంటే వాడ, వాడ బాగుంటే గ్రామం, రాష్ట్రం, దేశం- ఇలా అన్నీ సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. విశ్వమంతా శాంతిమయమై గోచరిస్తుంది. ఇంత జరగడానికి మానవుడి హృదయ వైశాల్యమే ప్రధానకారణం. హృదయ వైశాల్యమంటే మనసులో సర్వదా క్షమ, సహనం, శ్రద్ధ, పరోపకార బుద్ధి, ప్రేమ, అహింసవంటి సద్గుణాలకు చోటు పుట్టడమన్నమాట.
సుఖదుఃఖాలు, లాభనష్టాలు, కలిమిలేములు, చీకటి వెలుగులు జీవితంలో సహజంగానే వస్తూపోతూంటాయి. వేటికీ చలించక, అన్నిటిపట్ల సమబుద్ధి కలిగి వచ్చినదాన్ని స్వీకరించే ప్రవృత్తిని మనసు అలవరచుకోవాలి. పొరపాట్లు మానవసహజం. వాటిని సరిదిద్దుకుని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎదుటి వ్యక్తిలోని లోపాలను, దోషాలను ఎత్తిచూపి, పదేపదే విమర్శించి, దూషించి వాళ్లను క్షోభపెట్టకుండా, మన్నించి ప్రేమతో అక్కున చేర్చుకునే మనస్తత్వమే హృదయవైశాల్యం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, బుధులు, రుషులు, యోగులు, కవులు, కళాకారులు- అందరూ సమాజానికి ఈ హృదయ సంస్కార సందేశాన్నే అందిస్తున్నారు.
చెట్టు పూలు, ఫలాలు, నిలువనీడ ఇస్తోంది. నరికినా ఇంటికి కలపను ఇస్తోంది. కాల్చినా బొగ్గునిస్తోంది. దానికీ ప్రాణం ఉంది. అది పోయాక కూడా మనకు ఉపకరిస్తోంది. దానికున్న హృదయవైశాల్యం మనిషికి ఉంటే సమాజంలో ఇన్ని అనర్థాలు, ఘోరాలు, అత్యాచారాలు జరుగుతాయా? త్రికరణశుద్ధిగా హృదయాన్ని భద్రపరచుకోగలిగితే సాధించలేని కార్యముంటుందా? చెట్టు ఆకాశంలో ఎంతపైకెదిగినా తాను పుట్టిన మట్టిని వదలదు. మనిషీ తాను పుట్టిన నేలను విస్మరించరాదు. నేలనేకాదు, తనని కన్నవాళ్ళను, తనచుట్టూ ఉన్నవాళ్లను మరువకూడదు.
రాముడు మరుసటిరోజు జరగనున్న పట్టాభిషేకానికి పొంగిపోనూలేదు. తెల్లవారగానే అడవులకు వెళ్లవలసి వచ్చిందని కుంగిపోనూలేదు. దుశ్శాసనుని దుశ్చర్య, కర్ణుడి పరుషపదాలు, దుర్యోధనుడి అహంకారపూరిత వచనాలు, కీచకుడి అత్యాచారయత్నం- వంటి అవమానాలు భరించీ ద్రౌపది ఎంతటి ఆత్మస్త్థెర్యం కనబరచింది? చివరికి విజయమే పొందింది కదా! 'సుఖదుఃఖాలను సమంగా భావించి స్వీకరించేవాడే నాకు అత్యంతప్రియమైన భక్తుడు' అన్నాడు గీతాకారుడు వాసుదేవుడు.
అపజయాలు విజయాలకు సోపానాలని పెద్దలేనాడో చెప్పారు. అపజయంలో ఆదుకునేది ఆధ్యాత్మిక చింతనొక్కటే. అదే ఆత్మస్త్థెర్యాన్ని ప్రసాదిస్తుంది. మనసుకు క్షమాగుణం నేర్పుతుంది. సహనం నేర్పుతుంది. అందుకు ప్రహ్లాద చరిత్రం, రామదాసు చరిత్రమే తార్కాణాలు. ఎన్ని అవమానాలు ఎదురైనా మీరాబాయి కృష్ణభక్తిని మానుకోలేదు. ఎన్ని విపరీత విపత్కర పరిస్థితులెదురైనా మహర్షులు తమ కఠోరదీక్షను, తపస్సును విరమించలేదు. అంతటి హృదయవైశాల్యం కలవారు కనుకనే మనకు మహోత్కృష్టమైన జ్ఞానసంపదను వితరణ చేయగలిగారు.
హృదయవైశాల్యం అలవరచుకోవాలంటే ఆత్మ సంయమనం, మనోనిగ్రహం ఉండాలి. ఇంద్రియదమనంఉండాలి. అందుకు సాధన, ధ్యానం బాగా తోడ్పడతాయి. మనిషి తనను తాను తెలుసుకున్న కొద్దీ హృదయ వైశాల్యానికి చేరువవుతుంటాడు. హృదయవైశాల్యం కలవాళ్లు శత్రువుల్ని, ద్రోహుల్ని సైతం క్షమిస్తారు.
ఓ సన్యాసి భిక్షకోసం ఓ ఇంటిముందు నిలుచున్నాడు. 'భవతీ భిక్షాందేహి' అని కేకవేశాడు. లోపలినుంచి ఇల్లాలు ఆగ్రహంతో బైటికొచ్చి, బిచ్చం వెయ్యకపోగా సన్యాసిని నోటికొచ్చినట్టు దూషించింది. అవన్నీవిన్నా సన్యాసి కోపగించుకోక ప్రశాంతంగా వెనుతిరిగాడు. అది చూసి అవాక్కయిందా ఇల్లాలు. 'నా మాటలు విని నీకు కోపం రాలేదా?' అని అడిగింది ఆశ్చర్యంగా!
సన్యాసి ఇలా అన్నాడు చిరునవ్వుతో- 'ఎందుకు తల్లీ కోపం! ఈ శరీరం నాదే అనుకుంటే కోపం వస్తుంది. శరీరం నాదేకాదు. ఈ చేతిలోని కమండలాన్ని తిడితే ఎంతో నా శరీరాన్ని తిట్టినా అంతే! నా మనసు అవేమీ పట్టించుకోదు' అంటూ ప్రశాంతంగా వెళ్లిపోయాడు సన్యాసి. మనకు లేనిది ఇతరుల దగ్గర ఉందంటే, మన మనసులో ఈర్ష్య, పగ పెరుగుతాయి. హృదయ వైశాల్యానికీ దుష్టభావనే ప్రేరణ కలిగించినా చలించకూడదు. ఆహారం విషయంలో పేదవారిని దృష్టిలో పెట్టుకోవాలి. ఆచరణ విషయంలో పెద్దవారిని ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే 'ఓర్పు' అనే సద్గుణం మనసునావరిస్తుంది. హృదయవైశాల్యానికిదే నాంది. ఈ సద్గుణాన్ని సమాదరించిననాడు మనలను ఏ విపత్తూ, ఏ అనర్థమూ ప్రభావితం చేయవు. విశ్వంలో హృదయవైశాల్యం కలవాడే అజేయుడు, అభినందనీయుడు!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి