ᐅఅసూయే అసూయపడాలి




అసూయే అసూయపడాలి! 

మనిషి సాధించిన విజయం మరో విజయం సాధించడానికి దోహదపడుతుంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే! మరోవైపు మనిషి సాధించిన విజయం కొందరి మనసుల్లో అసూయ పుట్టిస్తుంది. అందుకే ఉపద్రవం రెండు రకాలని ఓ మేధావి అంటాడు. ఒకటోది మన దురదృష్టం, రెండోది- ఇతరుల అదృష్టం. మనిషికి తాను కోరుకున్నది రాకపోతే బాధ కలుగుతుంది. తనకు రానిది ఇంకొకరికి వస్తే అసూయ పుడుతుంది. దీనికి వయసుతో నిమిత్తం లేదని మానసిక విశ్లేషకులు నొక్కి చెబుతారు.
శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తారేమోనన్న భయంతో కైకేయి అసూయ చెందుతుంది. మయసభ అందాలు చూసి కౌరవులు పాండవులపై అసూయ పెంచుకుంటారు. ఏకలవ్యుడి విలువిద్య నైపుణ్యాలు చూసి అర్జునుడు అసూయ చెందుతాడు. ఇలా అసూయ అనే భావోద్వేగం మంచిది కాదని చెప్పే పురాణ పాత్రలు, సందర్భాలు మనకెన్నో కనబడతాయి. మనిషి తన శరీరంలోకి విషం ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాడు. అసూయ ఇంకో రకమైన విషం. అది మనసును బాధిస్తుంది, శరీరాన్ని కాదు. అసూయ మనిషి మనసులో ప్రాణం పోసుకునే ముందు భయం, కోపం అనే రెండు భావోద్వేగాలు కలుగుతాయి. కారణాలు ఏవైనా ఓ వ్యక్తివల్ల మరో వ్యక్తికి ఏదైనా కోల్పోతున్న భావన కలిగితే ఆ కోల్పోయే వ్యక్తి మనసులో భయం మొదలవుతుంది. అలాగే ఓ వ్యక్తికి చెందిన రంగంలో మరో వ్యక్తి మించిపోతే మొదటి వ్యక్తికి కోపం వస్తుంది. భయం, కోపం రెండూ అసూయలా మార్పు చెందుతాయి. అందుకే ప్రతి వ్యక్తీ తనలో, ఇతరుల్లో అసూయ లక్షణాలు గుర్తించగలగాలి. అసూయపరులు సూటిగా కళ్లలోకి చూసి మాట్లాడరు. పరోక్షంగా విమర్శల వర్షం కురిపిస్తారు. వారికి అనుమానమనే మనోవ్యాధి ఎక్కువ.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి, తండ్రిని విలువైన చెప్పులు కొనిపెట్టమని అడుగుతాడు. తండ్రి అది తన శక్తికి మించిన పని అని, మామూలు చెప్పులు కొనుక్కోమని చెబుతాడు. వాస్తవంగా ఆలోచించమని గుర్తు చేస్తాడు. కొడుకు తండ్రిపై కోపం పెంచుకుంటాడు. రోజూ కళాశాలకు బస్సులో వెళ్లివస్తూ ఇతర విద్యార్థుల కాళ్లు గమనించేవాడు ఆ విద్యార్థి. ఎవరైనా ఖరీదైన చెప్పులు బూట్లు ధరించినా వారిపై అసూయ పెంచుకునేవాడు ఈ విద్యార్థి. ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పాదరక్షలు ఇప్పించగా తన తండ్రి అలా చెయ్యలేకపోయినందుకు తండ్రిపై ఎక్కువ కోపం పెంచుకునేవాడు. ఒక రోజు బస్సులో అందరికాళ్లూ గమనిస్తూ ఓ వ్యక్తి దగ్గర ఆగి హఠాత్తుగా ఆలోచనలో పడతాడు. జ్ఞానోదయం కలిగినవాడిలా ఇతరులపై అసూయ, తండ్రిపై కోపం ఒక్కక్షణంలో తగ్గించుకుంటాడు. ఇన్ని రోజులూ తాను ఇంత నీచంగా ఆలోచించానా అని బాధపడతాడు. ఇంత మార్పునకు కారణం ఏంటంటే... తాను గమనించిన వ్యక్తికి చెప్పులు, బూట్లు కాదు కదా- కనీసం నడవడానికి కాళ్లే లేవు. తనకు కాళ్లు ఉన్నాయి. చెప్పులూ ఉన్నాయి. లేనిదల్లా ధరగల పాదరక్షలే. ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవం ఎదురుకానక్కర్లేదు అసూయను తగ్గించుకోవడానికి. అవగాహన పెంచుకుంటే చాలు. మానవ సంబంధాల విలువ తెలుసుకుంటే చాలు. సంఘజీవనం గొప్పదనం అర్థం చేసుకుంటే చాలు. వసుధైక కుటుంబాన్ని నిర్మించడం మనిషి చేతుల్లోనే ఉంటుంది. మనీషి కాగలిగే లక్షణం మనిషి మనసులోనే దాగి ఉంటుందన్న నిజం గ్రహిస్తే చాలు. మనలో ఉండే అవాస్తవ నమ్మకాలు మార్చుకోవాలి. ఓ వ్యక్తిని తప్పుపట్టకుండా ఆ వ్యక్తి చేసే తప్పుడు పనిని తప్పుపట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. 'మీరు నన్ను బాధపెట్టారు' అనకుండా 'ఆ సందర్భంలో నేను చాలా బాధపడ్డాను' అనడం మంచిది. 'ఫలానా వ్యక్తి మీ గురించి ఇలా అంటున్నాడు' అనే వ్యక్తుల విషయంలో జాగ్రత్తపడాలి. నిర్మాణాత్మక సూచనలు చేసే వ్యక్తి వయసులో చిన్నవాడైనా దాన్ని గౌరవంగా స్వీకరించాలి. ఇతరుల మంచిని నలుగురిలో మెచ్చుకోవాలి. లోపాలు ఎత్తి చూపేటప్పుడు ఆ వ్యక్తి మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అవసరం లేనప్పుడు హాస్యానికైనా లోపాలు ఎత్తిచూపే ప్రయత్నం కూడదు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కావలసిందల్లా వీటి ఆచరణ. నిజానికి ప్రేమ గుడ్డిది కాదు. అది పవిత్రమైనది. అసూయ గుడ్డిది. అందుకే అది అన్ని అనర్థాలకూ హేతువు.

- డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి