ᐅఅంతర్వాణి
ప్రకృతిలోని ప్రతి అణువునుంచీ మానవుడు నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో నేటికీ ఇదమిత్థమైన ప్రామాణిక సూత్రాలు ఎవరికీ తెలియవు. బహుశా ఇదే కావచ్చునన్న శాస్త్రవేత్తల విశ్లేషణలతో సంతృప్తి పడటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. అంటే మానవాతీత శక్తి ఏదో ఉన్నదన్న అభిప్రాయం కలగకమానదు. అసలు మనిషి జననం నుంచి మరణం దాకా నిర్వహించాల్సిన బాధ్యతలేమిటి? బాల్యం దాటాక కౌమారం, యౌవనం వృద్ధాప్యాల్లో మన అవగాహనలో అనేక మార్పులొస్తాయి. కుటుంబ నేపథ్యం, మానవ సంబంధాల వంటి అంశాలు మనల్ని బాగా ప్రభావితం చేస్తాయి. వీటిని అధిగమిస్తూ సొంత ఆలోచనలతో ముందుకు సాగాల్సిన అవసరం మనకుంది. ఎంతమంది ఈ విషయంలో ముందుకు సాగుతున్నారన్నది ప్రశ్న!
తనలోని బలహీనతలను గుర్తెరిగి బలమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను ఏర్పరుచుకుని ముందుకు సాగినవాడే విజయం సాధిస్తాడు. గతంనుంచి పాఠాలు నేర్చుకుని బంగారు భవిష్యత్‌కోసం వర్తమానాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడమే మనిషి తక్షణ కర్తవ్యం. అందుకోసం సమాజంలోని అన్నివర్గాలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ సమ్యక్ దృష్టితో సాగిన నాడే సార్థకత!
ఎంతటి సమదృష్టి కలిగిన వ్యక్తికి అయినా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎంతో కొంత దుఃఖం ఆవరించక తప్పదు. స్థితప్రజ్ఞత వంటి మాటలు ఎన్నివిన్నా ఆ సమయంలో నైరాశ్యం ఆవహించడం సహజం. అటువంటప్పుడే స్థిమితంగా బుద్ధికి పదునుపెట్టాలి. ఆత్మస్త్థెర్యం కూడగట్టుకోవాలి. చీకటి వేకువకు దారితీస్తుందన్న నిజాన్ని గుర్తించాలి. విషాద సమయాల్లో మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. ఒకానొక క్షణంలో ఆత్మహత్య ఆలోచనా రావచ్చు. అప్పుడే... ఆ క్షణమే... సంయమనం అత్యవసరం. గతంలో హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, ధర్మరాజు వంటి మహనీయులు ఇంతకంటే ఎక్కువగా ఎన్ని కష్టనష్టాలకు గురయ్యారో గుర్తుచేసుకోవాలి. 'వారి కష్టాలతో పోలిస్తే మనం ఎంత' అని అనుకోవాలి. కాళ్లకు జోళ్లులేవని ఒకరు బాధపడుతుంటే... అసలు కాళ్లే లేనివారి బాధ మరెంత అని ఆలోచించాలి. ఆ సమయంలో అతడు తీసుకునే నిర్ణయమే అత్యంత కీలకమైనదిగా భావించాలి. అన్ని సమస్యలకూ పరిష్కారం కాలమేనని గ్రహించాలి. శ్రీరాముడు పద్నాలుగేళ్లు, పాండవులు పదమూడేళ్లు ఎంతో ఓపికగా ఎదురుచూసిన తరవాతే రాజ్యాధికారం దక్కిందన్న నిజం మనం గ్రహించాలి.
శ్రీమద్రామాయణంలో సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలుగా సీత, అహల్య, తాటకి పాత్రలు నిలుస్తాయి. తాటకి తమోగుణానికి, అహల్య రజోగుణానికి, సీత సత్వగుణానికి ప్రతినిధులు. అందుకే శ్రీరాముడు తాటకిని సంహరించాడు, అహల్యను సంస్కరించాడు, సీతను స్వీకరించాడు! మానవాళికి మహత్తర సందేశమిస్తూ మార్గనిర్దేశం చేశాడు.
జీవిత పురోగమనంలో సహనం, సంయమనం అత్యంత ఆవశ్యకాలు కావాలి. మంచిరోజులు చెడ్డరోజులు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. మన ఆలోచనా విధానంలోనే మంచి, చెడు ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా కఠోరసాధన అవసరం లేదు. 'అంతర్వాణి'ని తట్టిలేపడమొక్కటే శరణ్యం!
- కిల్లాన మోహన్‌బాబు