ᐅసమ్మతే సంతసం
తనకు ఉన్న ఒకరిద్దరు బిడ్డల అవసరాలు తీర్చవలసి వచ్చేసరికే సతమతమవుతాడు తండ్రి. పక్షపాత రహితంగా తాను చేయగలిగిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. అయినా అమలు జరగవలసి వచ్చినప్పటి పరిస్థితులవలన ఏదైనా తేడాలు రావచ్చు. వాటిని అంగీకరించి సర్దుకుపోయే బిడ్డలు ఆనందంగా ఉంటారు. అంగీకరించని వాళ్ళు దుఃఖితులవుతారు. అలాగే ఈ సృష్టిలో అందరికీ కావలసిన ఏర్పాట్లు సంపూర్ణంగా చేశాడు సృష్టికర్త. వాటిని అందుకోవడంలో తేడాలుండి- కొందరికి ఆనందం, మరికొందరికి విషాదం కలగవచ్చు. లోతుగా ఆలోచిస్తే ఆనందం, దుఃఖం అని రెండు లేవు. అంగీకారమే ఆనందం, అనంగీకారమే దుఃఖం.
ఒక వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. ఒకామెను వ్యవసాయదారుడికి ఇచ్చి పెళ్ళి చేశాడు. రెండో ఆమెను ఇటుకల తయారీదారుడికి ఇచ్చి చేశాడు. వారిద్దరిలో ఎండకాస్తే ఒకరికి ఆనందం, మరొకరికి దుఃఖం. వర్షం కురిసినా (అటుదిటుగా) ఒకరికి ఆనందం మరొకరికి దుఃఖమే, దానికి కారణం కాలం తనపని తాను సక్రమంగా చేసుకుపోతుందని అంగీకరించక, తనకు అనుకూలించలేదని బాధపడటమే. ప్రకృతి గురించిన సత్యాన్ని తెలిసిన ఆ తండ్రి మాత్రం భగవంతుడి చర్యల్ని అంగీకరించాడు. కాబట్టి ఆనందంగా ఉండగలిగాడు.
ఆనందంగా ఉండాలనుకునేవాళ్ళు 'ఆ క్షణంలో అలా తప్ప మరోరకంగా జరగడానికి అవకాశం లేదు' అన్నప్పుడు జరిగినదాన్ని అంగీకరించాలి. తప్పదు. ఏదిపడితే అది అంగీకరించేయడమేనా... మనసు, వ్యక్తిత్వం, ఆత్మగౌరవం లాంటివి ఉండవా అనే ప్రశ్న కొందరిలో ఉదయించవచ్చు. వాటన్నింటికన్నా బలీయమైనది ఆ క్షణం. దానికి ఉన్న బలం మరెవరికీ ఉండదు. అందుకే అంగీకరించక తప్పదు.
చేసిన తపస్సుకు ఫలితంగా 'రాజర్షి'గా అర్హత సంపాదించాడు విశ్వామిత్రుడు. అయినా సంతృప్తి చెందక మరింత ఘోర తపమాచరించి బ్రహ్మర్షిగా మారాడు. అంతటివాడు ఒకానొక సమయంలో ఆకలి తీర్చుకోడానికి కుక్కమాంసం తినవలసి వచ్చింది. ఆ క్షణానికి అది తప్ప ప్రాణాలను నిలిపే ఆహారం మరొకటి లేదు. ఆ క్షణంలో ఆహారం స్వీకరించకపోతే అతని జీవితమే అంతరించిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్నే అంగీకరించాడు.
అంగీకరించడానికి మానసిక సంసిద్ధత కావాలి. పరిణతి చెందాలి. అలా కావడానికి జ్ఞానవంతుడై ఉండాలి. జ్ఞానవంతుడు కావాలంటే సృష్టిలో తనస్థానం, స్థాయి, ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్నవాడై ఉండాలి. అలా అయితేనే సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందువలన ఆనంద జీవనుడవుతాడు.
'సృష్టిలోని ప్రతి అణువూ రూపాంతరం (నాశనం కాదు) చెందక తప్పదు' అనేది అందరికీ తెలిసిన సత్యం. ప్రకృతిలోని ప్రతి అణువూ భగవంతుని (ప్రకృతి) నిర్ణయానికి అనుగుణంగా తామూ మారుతూ ఉంటాయి. ఆనందంగా ఉంటాయి. కానీ, బుద్ధిజీవి అనిపించుకున్న మానవుడే స్వార్థంతో ప్రకృతికి వ్యతిరేకంగా ప్రవరిస్తున్నాడు. అదే అనంగీకారం. దాని ఫలితం దుఃఖం. అలా కాకుండా 'సృష్టిక్రమంలో ఎన్నో విషయాల్లాగానే ఇదీ (జరిగిన ప్రతీదీ) ఒక సహజ ప్రక్రియే' అనే స్పృహ కలిగినవారు మాత్రం స్థితప్రజ్ఞులు. వారే నిత్యానందులు.
ఆనందం అనేది అంతరంగంలోను, భావనలోను అంగీకారంలోనూ ఉంటుంది... అంతే. ఎక్కడినుంచో రాదు. అందుకే 'సంకల్పమే సాక్షాత్కారం' అంటారు పెద్దలు. అది దివ్యమైనది, భవ్యమైనది అయి ఉండాలి. ఇంటినుంచి బయలుదేరినవాడు, తాను ఎటునుంచి వచ్చాడో, ఆ ఇంటికి ఎన్నివైపులనుంచి దారులున్నాయో, ఏ దారి మంచిదో తెలుసుకుంటాడు. అలాగే జీవుడు కూడా తానెక్కడినుంచి వచ్చాడో, తన అసలు నివాసం ఏదో, దాన్ని చేరడానికి మార్గాన్ని తెలుసుకోవాలి. అలాంటప్పుడు భగవంతుని సృష్టి రహస్యాన్ని మనోఫలకం మీద నిక్షిప్తం చేసుకుంటాడు. భగవంతుని చర్యలను అంగీకరిస్తాడు. తద్వారా ఆనంద జీవనుడవుతాడు. అదే బ్రహ్మానందం.
- అయ్యగారి శ్రీనివాసరావు