ᐅవిద్య పరమార్థం





విద్య పరమార్థం 

కమనీయమైన విద్య తాను కామధేనువులాగా కామితార్థాలు కలగజేస్తుంది. ఎన్ని దేశాలకు ఏగినా తల్లి చందంగా కాపాడుతుంది. సజ్జన సంఘంలో తనను సమ్మాన్యునిగా చేస్తుంది. తన పుణ్యపాపాలను ఎరిగిస్తుంది. ఇహపరాలను సాధిస్తుంది. అగ్నిలో కాలనిదీ, నీళ్లలో నాననిదీ, చోరుల పాలుగానిదీ, అన్నదమ్ముల ఆస్తి విభాగాలతో సంబంధం లేనిదీ విద్యే! విద్యాధనానికి ఎన్నటికీ చేటు రాదు. విద్యను నిగూఢ గుప్తమగు విత్తంగా, యశస్సు కలిగించేదానిగా, భోగకరిగా, విదేశాలకు ఏగినప్పుడు ఆప్తబంధువుగా, విశిష్ట దైవతమంగా భావిస్తారు. పంచతంత్రం, భర్తృహరి సుభాషిత రత్నావళి విద్యను బహుధా ప్రశంసించాయి. కేశపాశాలు, పుష్పసుగంధాలు, ఆభరణాలు నిజమైన భూషణాలు కావనీ, వాగ్భూషణానికి మూలమైన విద్యే నిజమైన విద్య అనీ చెబుతారు. విద్యను ధన సంపాదనకు ఒక దారిగా చెప్పిన మాట నిజమే గాని, అదే ప్రధాన ధ్యేయంగా పేర్కొనలేదు. 'విద్య భోగకరి'గా మాత్రమే గుర్తిస్తే లోకానికి విద్య వలన మేలుకంటే కీడే ఎక్కువ కలుగుతుంది. విద్య విచక్షణాజ్ఞానాన్ని పెంచే ఉత్తమ సాధనం. విద్య పరమార్థం లోక హితం. సాటివాడికి తోడుపడని విద్య నిరర్థకం.
ఒక గురువు ముగ్గురు శిష్యులకు విద్య బోధించారు.

'గురువుగారూ... మా విద్యాభ్యాసం పూర్తయింది! మాకు సెలవిప్పిస్తారా?' అని ప్రార్థించారు శిష్యులు. గురువుగారు ఆశీర్వదించారు. శిష్యులు మూటాముల్లే సర్దుకొని ఇళ్లకు పోవడానికి సిద్ధమయ్యారు.

'నాయనలారా! మీ వూరికి పోవడానికి అనేక మార్గాలున్నా, నేను చూపే దారిగుండానే మీరు వెళ్లండి!' అని గురువు ఒక బాట చూపారు.

ఆ రోజుల్లో విద్యార్థులు చెప్పులు వేసుకొనేవాళ్లు కాదు.

ఆ దారి అంతా కంటకమయంగా ఉంది. అజాగ్రత్తగా అడుగేస్తే ముళ్లు గుచ్చుకుంటాయి! మొదటి శిష్యుడు తన పాదాలకు ముల్లు గుచ్చుకోకుండా జాగ్రత్తగా నడుస్తూ ఎలాగో ఆ బాట దాటాడు. రెండో శిష్యుడు ఈ బాట ఎలా దాటాలా అని దీర్ఘంగా ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది. చెట్టు బెరళ్లను పాదాలకు కట్టుకొని, ముళ్లు గుచ్చుకోకుండా ఆ దారిన నడిచి అవతలకు చేరాడు.

మూడో శిష్యుడు ఇలా అనుకున్నాడు. 'నేనూ ఏదో ఒక ఉపాయంతో ఈ కంటక మార్గంపై నడుచుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. కానీ, నా తరవాత ఎవరైనా పొరపాటున ఈ మార్గాన నడిస్తే వాళ్లకు ఈ ముళ్లు గుచ్చుకుంటాయి. నేను ఇప్పుడే ఈ ముళ్లనన్నింటినీ ఏరివేస్తే భవిష్యత్తులో ఎవరికీ బాధకలగదు...అందరికీ మేలు జరుగుతుంది!'

వెంటనే అతడు పని ప్రారంభించాడు. వరసగా కనబడిన ముళ్లనన్నింటినీ ఏరిపారవేశాడు. దారిని నిష్కంటకం గావించాడు. మిగిలిన ఇద్దరు శిష్యులు ఎగతాళి చేస్తున్నా పట్టించుకోలేదు. ముళ్లు ఏరేటప్పుడు అవి కాళ్లకూ చేతులకూ గుచ్చుకొంటున్నా లెక్కచేయలేదు. తాను అనుకొన్న పని పూర్తిచేస్తూ ఆ ముళ్ల బాటను దాటాడు.

గురువుగారు వేగంగా వచ్చి అక్కడకు చేరారు. మూడో శిష్యుణ్ని ప్రశ్నించారు.

'ఎందుకు దారిలోని ముళ్లు ఏరివేశావు?'

'గురుదేవా! వ్యక్తి వేరూ, సమాజం వేరు కాదు. వ్యక్తి సమాజ శ్రేయం కోరుకోవాలి. అప్పుడే వ్యక్తులందరూ సుఖంగా ఉంటారు. సమాజం లేనిదే వ్యక్తి లేడు. సమాజ స్వరూపమే సర్వేశ్వరుడు. సమాజ సర్వేశ్వరుణ్ని పూజించిన వ్యక్తికి ఇహపరాల్లో సుఖాలు కలుగుతాయి. కొండల్లో, కోనల్లో, నగరాల్లో ప్రజలు- పండితులైనా, పామరులైనా, కుబేరులైనా, కుచేలురైనా తరతమ భేదం లేకుండా ఆ సమాజం అనే సర్వేశ్వరుడికి సేవ చేయాలి. ఇన్నాళ్లూ మీరు బోధించిన విద్య పరమార్థం ఇదే అని నేను అర్థం చేసుకున్నాను. దాన్ని ఆచరణలోకి పెట్టాలని ప్రయత్నం ప్రారంభించాను. ఈ దారిలోని ముళ్లను ఏరివేసి, ఇకపై ఈ దారిలో నడిచేవారికి కష్టం కలక్కుండా చేశాను. ఈవిధంగా నా చేతనైనంతలో సమాజ సర్వేశ్వరుణ్ని ఆరాధించాను' అన్నాడు వినయంగా.

గురువుగారన్నారు-

'నాయనలారా! చదువు అయిపోయింది, సెలవు ఇప్పించండి అన్నారు. నిజానికి మొదట ఈ దారిన వచ్చిన ఇద్దరికీ చదువు పూర్తికాలేదు. విద్య పరమార్థం తెలియనిదే చదువు పూర్తి అయినట్లు కాదు. ఈ మూడో విద్యార్థికే అది తెలిసింది. లోకహితం కోసమే విద్య అని ఇతడు గ్రహించాడు!'

- పి. భారతి